హైదరాబాద్, వెలుగు: గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ, నగర పరిశుభ్రత, నిబంధనల అమలుపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. నిబంధనల ఉల్లంఘనులకు భారీ జరిమానా విధించేలా కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఈ–చలాన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో ఈ చలాన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ఈ చలాన్ మిషన్లను సమకూర్చుకునే పనిలో నిమగ్నమైంది. నెల రోజుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ విభాగంలో ఈ – చలాన్ పద్ధతి విజయవంతమైంది. అదేవిధంగా సిటీలో జీహెచ్ఎంసీ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ఈ–చలాన్ ప్రవేశపెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.సిటీలో ఫుట్ పాత్ ల ఆక్రమణ, భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు, బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పడేయడం, హోటళ్లలో ఫైర్ సేఫ్టీ లేకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, కంపోస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం వంటి ఉల్లంఘనలకు ప్రస్తుతం చలాన్లు విధిస్తున్నారు.
మాన్యువల్ గా రసీదు ఇచ్చి జరిమానా స్వీకరిస్తున్నారు. అలా కాకుండా ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ తరహాలోనే ఈ–చలాన్లను నేరుగా ఇంటికి పంపించేలా చర్యలు చేపడుతున్నారు. ట్యాక్స్ పేయర్ల ఇన్ఫర్మేషన్ జీహెచ్ఎంసీ వద్ద ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా నేరుగా చలాన్ విధిస్తే సంబంధిత వ్యక్తికి ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం వెళుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ జిహెచ్ఎంసి వెబ్సైట్లోనూ అప్డేట్అవుతుంది. ఇందుకు ప్రత్యేక యాప్ ను ప్రవేశ పెట్టనున్నారు. నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వారి సమాచారం కూడా వెబ్సైట్లో భద్రంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ–చలాన్ వ్యవస్థను ఈడీ విభాగంలో జిహెచ్ఎంసి అందుబాటులోకి తీసుకురానుంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఇతర విభాగాలకు కూడా విస్తరించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పన్నుల వసూలు, నిర్మాణాల్లో ఉల్లంఘనలు వంటి వాటిని కూడా ఈ– చలాన్ పరిధిలోకి తీసుకు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.