నారాయణ్​పూర్ ​జిల్లాలో బేస్​ క్యాంపుపై మావోయిస్టుల దాడి

నారాయణ్​పూర్ ​జిల్లాలో బేస్​ క్యాంపుపై మావోయిస్టుల దాడి
  • ఛత్తీస్​గఢ్​ నారాయణ్​పూర్​ జిల్లాలో బారెల్​ గ్రానైడ్ ​లాంఛర్లతో అటాక్​
  • జవాన్లు ఎదురుదాడికి దిగడంతో పారిపోయిన నక్సల్స్​

భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్ ​రాష్ట్రంలోని నారాయణ్​పూర్ ​జిల్లాలోని సీఆర్​పీఎఫ్​ బేస్​క్యాంపుపై మావోయిస్టులు బుధవారం అర్ధరాత్రి దాటాక దాడి చేశారు. అబూజ్​మాఢ్ ప్రాంతంలోని ఇరక్​భట్టి గ్రామంలో ఇటీవల కొత్తగా బేస్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఇక్కడ కుతుల్​-ఇరక్–​భట్టి మధ్య రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ రోడ్డును మావోయిస్టు పార్టీ వ్యతిరేకిస్తోంది. నిర్మాణ పనులకు రక్షణగా సీఆర్​పీఎఫ్​జవాన్లు నిత్యం పహారా కాస్తున్నారు.

బుధవారం అర్ధరాత్రి జవాన్లు నిద్రిస్తున్న టైంలో మావోయిస్టులు ఒక్కసారిగా బీజీఎల్​(బారెల్ ​గ్రానైడ్ ​లాంఛర్లు)లతో క్యాంపుపై విరుచుకుపడ్డారు. నాలుగు బీజీఎల్​లను ప్రయోగించారు. ఒకటి క్యాంపులో పడినా జవాన్లకు ఏమీ కాలేదు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడికి దిగగా మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. గురువారం అదనపు బలగాలతో క్యాంపు పరిసర అటవీ ప్రాంతంలో కూంబింగ్​నిర్వహించారు. 

దండకారణ్యంలో రోప్​వే  

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బస్తర్ దండకారణ్యంలో సీఆర్​పీఎఫ్, ఐటీబీపీ జవాన్లు కలిసి రోప్ ​వే నిర్మించారు. చర్ల సరిహద్దులోని మావోయిస్టు ప్రభావిత బీజాపూర్ ​జిల్లా పామేడు పీఎస్​ పరిధిలోని చింతవాగుపై 200 మీటర్ల పొడవైన రోప్​వేను 22 మంది ఇంజినీర్లతో కలిసి నిర్మించారు. దీనికి 33 రోజుల  సమయం పట్టింది. అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ధర్మారం బేస్​క్యాంపును ఆనుకునే చింతవాగు ప్రవహిస్తోంది. వర్షాకాలంలో ఈ క్యాంపులోని జవాన్లతో పాటు ధర్మారం, పెద్ద ధర్మారం, సాపేడు, జీడుపల్లి, రావత్ పారా, గాదీగూడ, భాటికీగూడ, కంచాల, కువ్వార్​గుట్ట ఆదివాసీలు వాగు దాటాలంటే ఇబ్బందులు పడుతున్నారు.

దవాఖానకు వెళ్లాలన్నా కష్టమే. ఈ నేపథ్యంలో జవాన్లు, ఇంజనీర్లు కలిసి మే 2న వాగుపై రోప్​వే నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దశలవారీగా రోప్​వేను పరీక్షించార. జవాన్లు అందులో కూర్చుని అటూ, ఇటూ తిరిగారు. విజయవంతం అయ్యిందని నిర్ధారించుకున్నాక బుధవారం ప్రారంభించారు.