సూర్యాపేట, వెలుగు : పాలనలో పారదర్శకత, పనుల్లో వేగం పెంచేందుకు గతంలో ప్రారంభించి పక్కనపెట్టిన ‘ఈ–ఆఫీస్’ విధానం సూర్యాపేటలో మళ్లీ ప్రారంభం అవుతోంది. ఈ నెల 26 నుంచి స్టార్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2020లోనే అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ విధానాన్ని ప్రారంభించారు. కొన్ని రోజుల పాటు సక్రమంగా సాగిన తర్వాత ఆఫీసర్లు స్వస్తి పలికారు. ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్ వెంకట్రావు ఈ ఆఫీస్ విధానాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు.
స్పీడందుకోనున్న ఫైళ్లు
ఈ ఆఫీస్ విధానం అమల్లోకి వస్తే కలెక్టరేట్‌తో పాటు అగ్రికల్చర్, హెల్త్, ఎడ్యుకేషన్, డీఆర్డీవో, ఎక్సైజ్, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఫైల్స్‌లో వేగం పెరిగే చాన్స్ ఉంది.ప్రస్తుతం డిపార్ట్‌మెంట్స్‌లో ఫైల్స్ మిస్సింగ్ జరుగుతున్నాయి. ఈ ఆఫీస్ విధానం అమల్లోకి వస్తే మిస్సింగ్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫైల్స్ స్టేటస్‌ను జిల్లా, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక ఫైల్ ఆఫీసర్‌కు చేరిన డేట్, టైం వివరాలన్నీ ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. ఫైల్‌ను నిర్ణీత టైంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
మొదట కలెక్టరేట్‌లో...
సూర్యాపేట జిల్లాలో ఈ నెల 26 నుంచి ఈ ఆఫీ స్ ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు సోమవారం ప్రకటించారు. మొదట కలెక్టరేట్ మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. మార్చి 1 నుంచి కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో ఆఫీస్, మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. నెల రోజుల తర్వాత జిల్లావ్యాప్తంగా ఉన్న అన్నీ ఆఫీసుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా అధికారులకు 2 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతే కాకుండా అన్నీ ఆఫీసుల్లో కావాల్సిన కంప్యూటర్స్, స్కానర్స్ రెడీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని, వీటితో పాటు ప్రత్యేక ఐడీ, పాస్‌వర్డ్ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ నెల 26 నుంచి అమలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో ఈ ఆఫీస్ విధానాన్ని ప్రారంభిస్తున్నాం. 26 నుంచి కలెక్టరేట్‌లో, మార్చి 1 నుంచి మిగతా ఆఫీసులలో స్టార్ట్ చేస్తాం. ఇందుకోసం ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తున్నాం.
- కలెక్టర్ యస్. వెంకట్రావు