తెలంగాణకు రావాలంటే ఈ-పాస్ ఉండాల్సిందే.. 

  • ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో భారీగా ట్రాఫిక్ జామ్
  • ఈపాస్ లేక వెనుదిరుగుతున్న వాహనాలు

హైదరాబాద్: ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు తెలంగాణలోకి రావాలంటే ఈ –పాస్ ఉండాల్సిందేనని పోలీసులు తేల్చి చెబుతున్నారు. లాక్ సడలింపులివ్వడంతో ఆంద్ర నుండి పెద్ద ఎత్తున వాహనాలు తరలివస్తున్న వారు విషయం తెలియక నిరాశతో వెనుదిరుగుతున్నారు. తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లో గంటలతరబడి వాగ్వాదం చేస్తుండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రతిరోజు రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో ఈ దృశ్యాలు సాధారణం అయ్యాయి. అయితే ఇవాళ ఆదివారం కావడంతో చాలా భారీ సంఖ్యలో వాహనాలు ఏపీ నుండి తెలంగాణకు వస్తున్నాయి. 
పగటిపూట లాక్ డౌన్ ఎత్తేశారన్న వార్తలతో సూర్యాపేట జిల్లా కోదాడ సరిహద్దులోని తెలంగాణ-ఆంధ్ర సరిహద్దుల్లో భారీ సంఖ్యలో వాహనాలు తరలివచ్చాయి. విషయం తెలియక వచ్చామని.. ఇదొక్క సారి అనుమతివ్వమంటూ పోలీసులను వేడుకుంటున్నారు. అయితే పోలీసులు మాత్రం వైద్య చికిత్స కోసం అత్యవసర అనుమతి మంజూరు చేయిస్తూ తెలంగాణలోకి రానిస్తున్నారు. మిగిలిన వారిని వెనక్కి పంపిస్తుండడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. విజయవాడ, గుంటూరు తదితర జిల్లాల నుండి భారీ సంఖ్యలో వాహనాల్లో బయలుదేరిన వారు పోలీసులతో వాగ్వాదం చేస్తూ.. బతిమాలుతూ నానా తంటాలు పడుతున్నారు. అత్యవసర వైద్యం కోసం అక్కడి ఆస్పత్రి వారు బెడ్లు కేటాయించినట్లు లెటర్ పంపిస్తే.. వాట్సప్ లో దాన్ని అనుమతిస్తూ ఈ –పాస్ ఇచ్చి పంపిస్తున్నారు. ఈ-పాస్ మంజూరు కాని వారు ద్విచక్ర వాహనాల్లో వెళ్లేందుకు సైతం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపుతున్నారు. విషయం తెలియక తెలంగాణవైపు.. ముఖ్యంగా హైదరాబాద్ కు బయలుదేరిన ఆంద్ర వాసులు సరిహద్దుల్లో గంటలతరబడి చిక్కుకునిపోతున్నారు. నిన్న అర్ధరాత్రి నుండి ఇవాళ మధ్యాహ్నం వరకు ఆంధ్రా నుండి 700 వాహనాలు ఈ-పాస్ తో తెలంగాణలోకి ప్రవేశిస్తే.. మరో 1500 వాహనాలు ఈ-పాస్ లేకపోవడంతో వెనక్కి తిప్పి  పంపామని కోదాడ రూరల్ ఎస్ఐ సైదులు తెలిపారు.