ఇండియాలో దూసుకెళ్తున్న ఈ–ఫార్మా

ఇండియాలో దూసుకెళ్తున్న ఈ–ఫార్మా

మొబైల్‌‌ ఇంటర్నెట్టే ప్రధాన కారణం దీర్ఘకాలిక వ్యాధులు ఇంకో కారణం

న్యూఢిల్లీ : ఇండియాలో ఆన్‌‌లైన్ ఔషధ వ్యాపారం ఊపందుకుంటోంది. 2023 నాటికి ఈ మార్కెట్‌‌ రూ.1,26,351 కోట్ల(18.1 బిలియన్‌‌ డాలర్లు)కు చేరనుంది. దేశంలో  స్మార్ట్‌‌ఫోన్లతో నానాటికీ పెరుగుతున్న ఇంటర్నెట్‌‌ వినియోగం, దీర్ఘకాలిక వ్యాధులూ ఎక్కువవుతుండటంతో ఆన్‌‌లైన్ ఔషధ మార్కెట్‌‌ దూసుకుపోనుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలోని ఆన్‌‌లైన్‌‌ మందుల మార్కెట్‌‌  (ఈ–ఫార్మా) మీద ఈవై ఒక రిపోర్టును రూపొందించింది. ప్రస్తుతం ఆన్‌‌లైన్‌‌ ఔషధ మార్కెట్‌‌ విలువ రూ.64,941 కోట్లు. ఇది ఏటా 18.3 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇండియాలో స్మార్ట్‌‌ఫోన్లతో పెరుగుతున్న ఇంటర్నెట్‌‌ వినియోగంతోపాటు, ఈ–కామర్స్‌‌ ప్లాట్‌‌ఫామ్స్‌‌లో ఆర్డరివ్వడం సులభతరంగా మారడమే ఈ–ఫార్మా మార్కెట్‌‌ విస్తరణకు ప్రధాన కారణాలు. అంతకంతకూ ఎక్కువవుతున్న దీర్ఘకాలిక వ్యాధులు, ప్రజల వ్యక్తిగత ఆదాయంలో పెరుగుదల కూడా కారణాలేనని రిపోర్టు చెబుతోంది. ఎందుకంటే, అంతకు ముందు ఔషధాల కొనుగోలుపై ఎక్కువ మొత్తం వెచ్చించలేని వారు కూడా ఇప్పుడు ఖర్చు పెట్టగలుగుతున్నారని ఈవై రిపోర్టు వివరించింది. ఈ కారణాలన్నింటి వల్లే ఆన్‌‌లైన్‌‌ ఔషధ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందని పేర్కొంటోంది.

నాలుగేళ్లలో బాగా పెరుగుతుంది…

ముఖ్యంగా రాబోయే నాలుగేళ్లలో ఈ–ఫార్మసీ రంగం భారీగా వృద్ధి నమోదు చేస్తుందని భావిస్తున్నారు. ఆరోగ్యంపై అటు ప్రభుత్వంతోపాటు, ఇటు ప్రజలకూ శ్రద్ధ పెరగడంతోనే ఈ వృద్ధి సాధ్యమవుతుందని రిపోర్టు చెబుతోంది. ఇండియా ఔషధ మార్కెట్‌‌ను చూస్తే, 35 శాతం మార్కెట్‌‌ వాటా దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఔషధాలు, మిగిలిన 65 శాతం మార్కెట్‌‌ వాటా ఎక్యూట్‌‌ మెడిసిన్స్‌‌దని రిపోర్టు తెలిపింది. 2023 నాటికి, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు వాడే ఔషధాల మార్కెట్లో 85 శాతం, ఎక్యూట్‌‌ మెడిసిన్స్‌‌లో 40 శాతం వాటా సాధించాలని ఈ–ఫార్మా టార్గెట్‌‌గా పెట్టుకుంటున్నట్లు తెలిపింది. ఔషధాలను కస్టమర్లకు చేర్చడంలో లోకల్‌‌ ఫార్మసీలు, హైపర్‌‌ లోకల్‌‌ మోడల్స్‌‌ ద్వారా సాధ్యమవుతుండటంతో ఎక్యూట్‌‌ మెడిసిన్స్‌‌ ఆన్‌‌లైన్ మార్కెట్‌‌ పెరుగుతుందని పేర్కొంది. మార్కెట్లో పట్టు సాధించేందుకు ఇప్పటిదాకా ఈ–ఫార్మా కంపెనీలు డిస్కౌంట్లు, ఇతర ఇన్సెంటివ్స్‌‌ కోసం  కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయని చెప్పింది. ఆన్‌‌లైన్ ఔషధ కంపెనీలు లాభాల బాట పట్టాలంటే ఈ డిస్కౌంట్లు గణనీయంగా తగ్గాల్సిన ఆవశ్యకత ఉందని రిపోర్టు అభిప్రాయపడింది. సమీప భవిష్యత్‌‌లోనే గ్లోబల్‌‌ ఈ–కామర్స్‌‌ కంపెనీలు సైతం తమ అనుభవంతో ఈ రంగంలో అడుగుపెట్టే అవకాశం ఉందని తెలిపింది.