- పలు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ప్రారంభం
- పొరపాట్లు జరుగకుండా సర్వే చేపట్టాలి: కలెక్టర్ రాజర్షి షా
నెట్వర్క్, వెలుగు: ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన సర్వే గురువారం ప్రారంభమైంది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పలు ప్రాంతాల్లో అధికారులు సర్వే ప్రారంభించారు. అదిలాబాద్ రూరల్ మండలంలోని లోహర గ్రామంలో సర్వే ప్రారంభం కాగా.. కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇంటి యజమానిగా మహిళ పేరు ఉండాలని, ఆ తర్వాత కుటుంబసభ్యుల పేర్లు నమోదు చేయాలని, అనంతరం వారి ఫొటో తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వినోద్ కుమార్, ఇతర అధికారులున్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని అడిగాం బి గ్రామంలో రెండు బృందాలు సర్వే చేస్తున్నట్లు ఎంపీడీవో లక్ష్మణ్ తెలిపారు. సర్వేను జడ్పీ సీఈవో కాళందిని, తహసీల్దార్ సత్యనారాయణ, అధికారులు పరిశీలించారు.
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి
ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ప్రాజెక్టు సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. కాసిపేట మండలంలోని లంబాడితండా(కె) గ్రామపంచాయతీలో చేపట్టిన సర్వేను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ చేసేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 5 రోజుల పాటు జరిగే ఈ సర్వే పూర్తయిన తర్వాత 9న వివరాలను పరిశీలించి నిర్ణీత ఫార్మాట్లో నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. కుటుంబానికి ఒక కార్డు ఉంటుందని, కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ఒక ప్రత్యేక నంబర్ కేటాయించనున్నట్లు చెప్పారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఎంపీవో సబ్దర్ ఆలీ, తదితరులున్నారు.
సర్వే సిబ్బందికి సహకరించాలి
కాగజ్‌నగర్ పట్టణంలోని 14వ వార్డు ఈద్గా కాలనీ, సిర్పూర్ టీ మండలం వెంకట్రావుపేట్లో అధికారుల బృందం ఇంటింటి సర్వే చేపట్టింది. కాగజ్ నగర్ లో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ కిరణ్ కుమార్, వెంకట్రావుపేట్లో ఎంపీడీవో సత్యనారాయణ, డీటీ బక్కయ్య తదితరులు సర్వే చేపట్టి వివరాలు నమోదు చేసుకున్నారు. భైంసా పట్టణంలోని 24వ వార్డులో ఆర్డీవో కోమల్రెడ్డి, తహసీల్దార్ప్రవీణ్ కుమార్ బృందం కుటుంబంలోని సభ్యుల వివరాలు సేకరించారు. సర్వే సిబ్బందికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మండలంలోని హాజ్గుల్ గ్రామంలో సర్వే ప్రారంభించారు.