పల్లెల్లో ఆగిన ఈ- సేవలు.. జీపీ ఆఫీసుల్లో పేరుకుపోతున్న ఫైళ్లు

పల్లెల్లో ఆగిన ఈ- సేవలు.. జీపీ ఆఫీసుల్లో  పేరుకుపోతున్న ఫైళ్లు

సంగారెడ్డి, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో ఈ-సేవలు నిలిచిపోయాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 1,603 జీపీల్లో 247 మంది కంప్యూటర్ ఆపరేటర్లు 9 రోజులుగా ఆందోళన బాట పట్టారు. దీనివల్ల పంచాయతీ ఆఫీసుల్లో ఫైళ్లు పేరుకుపోయాయి. సమస్యలు పరిష్కారం కాక అర్జీదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో ఈ -పంచాయతీ ఆపరేటర్ 8 నుంచి 10 గ్రామ పంచాయతీల పని భారం మోస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు చేయాల్సిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  ఇప్పటికే అంగన్​వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన బాట పట్టారు. తాజాగా ఈ -పంచాయతీ సిబ్బంది కూడా సమ్మె బాట పట్టడంతో జీపీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ఠ వేసి కూర్చున్నాయి. 

ALSO READ  :- అక్టోబర్ 9న భూపాలపల్లి కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ .. హాజరుకానున్న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

సంగారెడ్డి జిల్లాలో 86 మంది, మెదక్ జిల్లాలో 78 మంది, సిద్దిపేట జిల్లాలో 83 మంది కంప్యూటర్ ఆపరేటర్లు జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద 9 రోజులుగా సమ్మె చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నా అధికారులు, రాజకీయ నేతలు స్పందించడం లేదు. కొందరు ఆపరేటర్లు సీఎం కేసీఆర్ కు పోస్ట్ కార్డుల ద్వారా సమస్యలు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీ తనం కోసం ప్రభుత్వం ఈ -పంచాయతీలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో కంప్యూటర్ ఆపరేటర్ల పాత్ర చాలా కీలకమైంది. వీరు ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా అందజేస్తూ ఉంటారు. పైగా పంచాయతీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరిస్తుంటారు. 

పల్లె ప్రగతి, హరితహారం, జనన-మరణ ధ్రువీకరణ, భవన నిర్మాణం, ఆస్తి మార్పిడి, వ్యాపార లైసెన్సులు, ఆసరా పింఛన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, దళిత, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలతో పాటు ఎన్నికల పనులు కూడా చక్కబెడుతారు. అలాగే ఈ -గ్రామ్ స్వరాజ్,  ప్లాన్ ప్లస్, పీఎఫ్ఎంఎస్, ఆస్తుల జియో ట్యాగింగ్, లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ, పంచాయతీల 
ఆదాయ-వ్యయాలను ఎప్పటికప్పుడు కంప్యూటరీ కరించాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులు చేసే పనులన్నింటినీ ప్రభుత్వ వెబ్ సైట్ లలో నమోదు చేస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తున్నారు. జాతీయ స్థాయి పంచాయతీల అవార్డుల నామినేషన్లకు సంబంధించి ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయడంలో కంప్యూటర్ ఆపరేటర్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 

ఈ- పంచాయతీ సిబ్బంది డిమాండ్లు

  • జిల్లా స్థాయిలో పని చేస్తున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్లకు పే స్కేల్ అమలుచేసి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
  • ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేయాలి. 
  • మహిళా ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి.
  • ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి.
  • ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద 
  • ఉద్యోగవకాశం ఇవ్వాలి.
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని వసతులు వర్తింపజేయాలి.

మా సేవలను గుర్తించండి

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న తమ సేవలను ప్రభుత్వం గుర్తించాలి. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. 9 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో సతమతమవుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని వేడుకుంటున్నాం.
విజయ్ కుమార్ గౌడ్  (కంప్యూటర్ ఆపరేటర్)