రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ చేస్తేనే ఈ– వ్యర్థాల అనర్థాన్ని తప్పించుకోగలం. కంప్యూటర్లు, టెలివిజన్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటంతో వీటి వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. సాంకేతిక విప్లవమనే వృక్షానికి విరగకాస్తున్న విషఫలాలే- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఈ–వేస్ట్ ఇపుడు అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒక ప్రధాన మైన సమస్యగా మారుతోంది. ఆధునిక ఫీచర్లతో కూడిన సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వస్తుండటంతో ఉపయోగిస్తున్న వస్తువులను పక్కన పెట్టేసి కొత్త వస్తువులపై మోజు పెంచుకుంటున్నారు. భారతదేశంలో ఏటా 12.5 లక్షల టన్నుల ఈ–వేస్టెజ్ ఉన్నట్లు ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా చెబుతుంది. నేలను, నీటిని, గాలిని కలుషితం చేస్తున్న ఈ–వ్యర్థాలు పర్యావరణంతోపాటు ప్రజారోగ్యానికీ పెనుసవాళ్లు రువ్వుతున్నాయి. ఈ–వేస్ట్ ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలో చైనా, అమెరికాల తరవాత మూడో స్థానాన నిలిచిన భారత్ వాటా 32 లక్షల టన్నులు. గుట్టలు గుట్టలుగా జమవుతున్న ఆ వ్యర్థాలను పద్ధతిగా వదిలించుకోని పక్షంలో తీవ్ర దుష్పరిణామాలు వాటిల్లక మానవు.
మానవ ఆరోగ్యానికి పెనుముప్పు
మనిషి మెదడును, నాడీ వ్యవస్థను, కాలేయాన్ని, మూత్ర పిండాలను ఈ–వ్యర్థాలు దెబ్బతీస్తాయి. గర్భస్త పిండాలపైనా దుష్ప్రభావం ప్రసరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవంలో, దేశవ్యాప్తంగా ఈ– వ్యర్థాల్లో 78 శాతందాకా సేకరణకే నోచుకోవడం లేదు. పాతబడిన చరవాణులు, టీవీలు, కంప్యూటర్లు, ఏసీలు, ఫ్రిడ్జిలు తదితరాలెన్నో యధాతథంగా చెత్తకుప్పల్లోకి చేరిపోతున్నాయి. ఆయా పరికరాలోని మూలకాలు, రసాయనాలు నేరుగా భూమిపొరల్లో ఇంకి మానవాళికి అనర్థాలు తెచ్చిపెడుతున్నాయి. తగినంతగా రీసైక్లింగ్, పునశ్శుద్ధి ఊపందుకోని కారణంగా ఇనుము, సీసం, రాగితోపాటు బంగారం, నియోడిమియం, కాడ్మియం వంటి విలువైన లోహాలూ చేజారిపోతున్నాయి. ఏడాది కాలంలో ఈ–వ్యర్థాల నుంచి సుమారు ఎనిమిది వేలకోట్ల రూపాయల విలువైన బంగారం వెలికితీసే అవకాశాన్ని ఇండియా కోల్పోతున్నదని ఫిక్కి (భారతీయ వాణిజ్య పారిశ్రామిక సంస్థల సమాఖ్య) ఆ మధ్య లెక్కకట్టింది.
వర్థమాన దేశాల్లో ఈ–వ్యర్థాల సమస్య
కాలం చెల్లిన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఉపకరణాల సమీకరణను పునశ్శుద్ధిని ప్రణాళికాబద్ధంగా పట్టాలకు ఎక్కించడంలో దక్షిణకొరియా, యూకే, జపాన్, నెదర్లాండ్స్ మిన్నగా రాణిస్తున్నాయి. పునశ్శుద్ధిలో ఎంతగానో వెనకబడిన ఇండియా- హానికారక వ్యర్థాల అక్రమ దిగుమతుల విషయంలోనూ అప్రతిష్టపాలవుతోంది. పాత టీవీలు, కంప్యూటర్లు తదితరాలను పౌరులే స్వచ్ఛందంగా పునశ్శుద్ధి కేంద్రాలకు తరలించే స్వీడన్ తరహా సంస్కృతి ఇక్కడా వేళ్లూనుకునేలా ప్రభుత్వ కార్యాచరణ పదును తేలాలి.ఈ– వేస్ట్ నిర్వహణలో తమవంతు పాత్ర పోషణకు వస్తూత్పాదకులను, డీలర్లను సన్నద్ధపరచాలి. రేడియో - 50 మిలియన్ల ప్రజలకు చేరేందుకు 38 సంవత్సరాలు పట్టింది. టెలివిజన్‌కు 13 సంవత్సరాలు పట్టింది. ఇంటర్నెట్‌కు 4 సంవత్సరాలు పట్టింది. 1975 నుంచి 2004 మధ్య కాలంలో బిలియన్ కంప్యూటర్లు అమ్ముడయ్యాయి. ఎలక్ట్రానిక్ వస్తు సేవల వినియోగం ఎంత వేగంగా పెరుగుతోందో ఈ గణాంకాలు తెలియజేస్తాయి. భవిష్యత్తులో ఈ–చెత్త ఎంత పెద్ద మొత్తంలో తయారు కాబోతోందో అనేది ఊహకే అందని వాస్తవం కావచ్చు.
ఆర్ఆర్ఆర్ పాటించాలి
యూరోపియన్ దేశాలలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తి జీవితకాలం ముగిసిన తర్వాత, దానిని వెనకకు తీసుకొనే బాధ్యత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారులే వహించాలనే నియమాన్ని అమలుచేయటం జరుగుతోంది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ఉపయోగించే మెటీరియల్ విషయంలో 2002లోనే యూరోపియన్ యూనియన్ మార్గదర్శకాలను రూపొందించింది. ఇదే తరహాలో మన దేశంలో కూడా ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించేందుకు, వాటిని తిరిగి ఉపయోగించేందుకు లేదా రీసైకిల్ చేసేందుకు తగిన చర్యలను ఇప్పటినుంచే చేపట్టాలి. చాలామంది ఔత్సాహికులు ఆర్ఆర్ఆర్ (రీయూజ్, రెడ్యూస్., రీసైకిల్) సూత్రాన్ని పాటిస్తున్నారు. కేవలం కార్పొరేట్ రంగాలవారే కాకుండా ప్రతిఒక్కరూ తమవంతుగా రీసైక్లింగ్ ప్రారంభిస్తే ఈ–వేస్ట్ భూతలంలోకి చేరకుండా పర్యావరణానికి శోభనిస్తుంది. కాలుష్యం దరిచేరదు.
పాతవాటిని ఇతరుల ఉపయోగానికి ఇవ్వండి
పాత మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, కంప్యూటర్ల వ్యర్థాలే అత్యంత ప్రమాదకరమైన ఈ–వ్యర్థాల్లో ఉన్నాయి. వీటిని శాస్త్రీయ పద్ధతిలో పారవేయకపోతే ప్రమాదకరం. డంప్ యార్డులకు చేరే ఈ-–వ్యర్థాల కుప్పలను భారతదేశంలోని సామాన్య వర్కర్లు నిర్వహిస్తారు, వీరికి ప్రమాద కర వ్యర్థాలను ఎదుర్కోవడంలో ఎటువంటి భద్రతాపరమైన శిక్షణ లేదు. పాత గాడ్జెట్‌లను అనాథాశ్రమాలు, విద్యాసంస్థలకు విరాళంగా ఇవ్వొచ్చు. ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లను వేరే రూపంలో తిరిగి ఉపయోగించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పాత కంప్యూటర్‌లను మళ్లీ ఉపయోగించుకునే మార్గాల కోసం ఇంటర్నెట్‌లో పరిశోధించండి. ఈ–వ్యర్థాలను పారవేయొద్దు. ఈ–వ్యర్థాలను పునరుద్ధరించే స్థానిక సంస్థలు వ్యర్థాలను తొలగించడంలో సహాయపడతాయి. ఈ పద్ధతుల గురించి చుట్టుపక్కల ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి. సమర్థవంతంగా ఈ–వ్యర్థాలను పారవేయడం ఒక అభ్యాసం అవుతుంది.
- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,ఫ్రీలాన్స్ రైటర్