ఈ‌‌-వేస్ట్​ మెడల్స్​!

ఈ‌‌-వేస్ట్​ మెడల్స్​!

తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ.. చేసిన తప్పును సరిదిద్దుకున్న వాళ్లే చరిత్రలో మిగిలిపోతారు. పదిమందికి గుర్తుండిపోతారు. ప్లాస్టిక్​ విషయంలో ఇప్పటికే పర్యావరణం చాలా పాడైపోయింది. అందులో ఎలక్ట్రానిక్​ వేస్ట్​ వల్ల ప్రకృతికి వాటిల్లే ముప్పు అంతా ఇంతా కాదు. అందుకే.. ఎలక్ట్రానిక్​ వేస్ట్​తో ఓ సంచలనాత్మక ఆవిష్కరణకు తెర తీశారు. టోక్యోలో జరగనున్న ఒలింపిక్​ విజేతలకు ఈ– వేస్ట్​తో తయారు చేసిన పతకాలు ఇస్తారట.

భూమి, నీళ్లు, గాలిని కలుషితం చేసి.. మనం బతకడానికి కాసింత జాగానిచ్చిన ప్రకృతికి చాలా ద్రోహం చేశాం. ఇకనైనా తప్పు సరిదిద్దుకోకపోతే.. భవిష్యత్​ కష్టమే. అందుకే.. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలన్నీ ప్లాస్టిక్​ పని పట్టడానికి పూనుకున్నాయి. ఒక్కో దేశం ఒక్కో మార్గంలో ప్లాస్టిక్ వేస్టును తగ్గించేందుకు, తిరిగి వాడేందుకు, నాశనం చేసేందుకు ప్రణాళికలు వేస్తూ అమలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ సారి ఒలింపిక్స్​లో ఈ– వేస్ట్​తో పతకాలు తయారు చేస్తున్నారు.

టోక్యోలో 2020లో జరిగే ఒలింపిక్స్​లో విజేతలకు ఇచ్చే పతకాల విషయంలో నిర్వాహకులు చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ‘బి బెటర్​ టుగెదర్​ ఫర్​ ప్లానెట్​ అండ్​ పీపుల్​’ అనే కాన్సెప్ట్​తో ఎకో ఫ్రెండ్లీ ఒలింపిక్స్​ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 2020 ఒలింపిక్స్​, పారా ఒలింపిక్స్​లో విజేతలకు ఎలక్ట్రానిక్​ వ్యర్థాలను రీసైకిల్​ చేసిన పతకాలను అందిస్తారు. దీని కోసం.. జపాన్​ ప్రజల నుంచి ఈ– వేస్ట్​ని సేకరించారు. కొంతమంది ఈ ప్రాజెక్ట్​ కోసం తమ కొత్త ఎలక్ట్రానిక్​ వస్తువులను కూడా డొనేట్​ చేశారు. మూడేళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్న జపాన్​ ప్రభుత్వం 2017 ఏప్రిల్​ నెల నుంచి ఈ ఏడాది మార్చి నెల వరకు ఈ వేస్ట్​ని సేకరించింది. టోక్యో ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్​ రెండింటిలో విజేతలకు ఇవ్వాల్సిన పతకాలు బంగారు, వెండి, కాంస్య పతకాలు కలిపి ఐదువేల పతకాలు అవసరం. వాటన్నింటినీ ఈ– వేస్ట్​తోనే తయారుచేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్​కు ‘టోక్యో మెడల్​ ప్రాజెక్ట్​’ అని పేరు పెట్టారు. ఇందులో 1741 పట్టణాలు పాల్గొన్నాయి. అంటే.. జపాన్​లోని 90 శాతం పట్టణాలు ఈ ప్రాజెక్ట్​లో పాలు పంచుకున్నాయి. ఆయా పట్టణాల మున్సిపాలిటీలు దాదాపు 78 వేల 985 టన్నుల ఈ – వేస్ట్​ని పోగు చేశాయి. ఇందులో 6.21 మిలియన్ల వేస్టేజ్​ కేవలం మొబైల్​ ఫోన్లదే. ఫోన్ల తయారీకి కేంద్రమైన జపాన్​ దేశంలోనే ఇంతలా మొబైల్​ ఈ– వేస్టేజ్​ బయటపడితే.. ఇక ప్రపంచ దేశాలన్నింటిలో ఎంత వేస్టేజ్​ బయట పడుతుందో! ఇలా ఈ వేస్టుతో పతకాలు చేయడం ఇది తొలిసారేం కాదు. 2016 రియో ఒలింపిక్స్ అప్పుడు కూడా రీసైకిల్డ్​ మెటల్స్​తో పతకాలు రూపొందించి విజేతలకు అందించారు.

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మెడల్స్​ అన్నింటినీ ‘జునిచి కావానిషి’ అనే డిజైనర్​ రూపొందించారు. టోక్యో ఈ– వేస్ట్​ మెడల్​ డిజైన్​ కోసం నిర్వహించిన పోటీల్లో 400 మందిలో జునిచి కావానిష్​ మొదటి స్థానంలో నిలిచాడు. వచ్చే ఏడాది జులై 24న ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్​ ప్రపంచ దేశాలకు కొత్తదనం చూపించబోతున్నాయి.