శ్రీ కృష్ణుడి ఉపదేశం : ఎంత తెలివి.. శక్తి సామర్థ్యాలు ఉన్నా.. గుండె దైర్యం లేకపోతే వేస్ట్.

శ్రీ కృష్ణుడి ఉపదేశం : ఎంత తెలివి.. శక్తి సామర్థ్యాలు ఉన్నా.. గుండె దైర్యం లేకపోతే వేస్ట్.

క్షుద్రం.. హృదయ  దౌర్బల్యం త్యక్వోత్తిష్ఠ  భారత. భయపడి యుద్ధం చేయనన్న అర్జునుడికొక్కడికే కాదు ఈ మాట వర్తించేది...  వెలుగు.. అంటే జ్ఞానమునందు ప్రీతి కల ప్రతివారికి చెప్పిన మాట. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ప్రధానంగా వదలవలసినది ఏదో, చేయవలసినది ఏదో స్పష్టంగా, సూటిగా నిర్మొహమాటంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. తరువాత సాగిన ప్రశ్నోత్తరాల క్రమంలో దీని వివరణలే కనపడతాయి.

ఒక పని ప్రారంభించినప్పుడు ఉండవలసినది మనోధైర్యం. అదే ఆత్మవిశ్వాసం...  తాను ఆ పనిని చేయగలను అనే నమ్మకం. తన మీద తనకి నమ్మకం లేని వారు దేనినీ సాధించలేరు. ఎందుకంటే సందేహిస్తూ చేసిన పనిలో తన శక్తిని పరిపూర్ణంగా వెచ్చించటం ఉండదు. దానికి అనుగుణంగానే ఫలితం అరకొరగా ఉంటుంది. లేదా శ్రమ నిష్ఫలం అవుతుంది.  ఎంతటి జ్ఞానం, శక్తి సామర్థ్యాలు ఉన్నా, గుండెబలం లేకపోతే అనుకున్న పనిని కొనసాగించటం  కష్టంగా మారుతుంది.

 మనం వింటూ ఉండే గుండె జారి పోయింది. గుండె ఆగినంత పని అయింది.  బేల గుండె.... గుండె చిక్కబట్టుకుని...గుండె దిటవు చేసుకుని....  మొదలైన జాతీయాలు.. దేనిని సాధించటానికైనా గుండె ఎంత గట్టిగా ఉండాలో అనే దాన్ని తెలియజేస్తాయి. 

యుద్ధం చేయటానికి భయపడి విషాదంలో మునిగిన అర్జునుడు స్వధర్మాచరణకి భయపడిన సామాన్య జీవుడికి చిహ్నం. భయపడటానికి కారణం హృదయ దౌర్బల్యం. దానిని వదిలితే స్వధర్మాచరణం చేయటానికి వెనకాడటం ఉండదు. అర్జునుడి స్వధర్మం క్షత్రియధర్మంలో భాగం. ఇంతకుముందు కూడా ఎన్నో యుద్ధాలు చేసి శత్రుసంహారం చేసి విజయం, కీర్తి సంపాదించాడు. అప్పుడు యుద్ధం హింస అని అనిపించలేదు. ఈ సంశయం ఇప్పుడెందుకు? 

Also Read :- 24 విజయ ఏకాదశి పూజ.. సకల కార్యాలకు విజయం

ప్రేమకి, మమకారానికి స్థానమైన హృదయం నా వాళ్ళు అనే మమకారంతో బలహీనమయింది. అంటే తన వారికి ఒక ధర్మం, పరాయి వారికి మరొక ధర్మం. అందుకే దీనిని క్షుద్రం.. అంటే చాలా చులకన, నీచము అని కృష్ణుడు ఎత్తి చూపవలసి వచ్చింది. పైగా తన దౌర్భాల్యాన్ని సమర్థించుకోవటానికి అర్జునుడు పలికిన మాటలు మంచివే. కాని, కోపం, దుఃఖం, జాలి వంటి భావాలు మనస్సుని ఆవేశించినప్పుడు ఈ భావాలు కలిగితే అవి భావావేశం అవుతాయే కాని, ధర్మం కాదు. 

ఎందుకంటే, ధర్మస్వరూపం బహు సూక్ష్మం. అది మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే గోచరిస్తుంది. ఆవేశంలో కాదు.. అర్జునుడికి ఒక్కడికే కాదు, అందరికీ కూడా తమ స్వధర్మాచారణ సమయంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవటం సామాన్యం. అప్పుడు భావావేశంలో జాలి (దయ కాదు) పడి, జారి పడటం జరుగుతుంది. తమలోని బలహీనతలకి మంచితనం ముసుగు వేయటం జరుగుతుంది. గాలికి పోయిన పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు. యుద్ధభూమికి వచ్చి ఉభయ సేనల మధ్య నిలిచిన తరువాత అహింస గురించి అర్జునుడు మాట్లాడినట్టు.

ధర్మము... కర్తవ్యము.. అందరికి ఒకటిగా  ఉండవు.ఎవరికి తగినది వారికి ఉంటుంది. వ్యవసాయదారుడు భూమిని దున్నే సమయంలో క్రిమి కీటకాలు చనిపోతాయి. కనుక భూమిని దున్నను అనటం వినటానికి ఎంతో బాగున్నా అది బద్దకం మాత్రమే అనిపించుకుంటుంది. మందు చేదుగా ఉంటుంది. ఇంజెక్షన్ నెప్పి పెడుతుంది పిల్లలకి ఇవ్వను అని వైద్యుడు అంటే అది జాలి గుండె అనిపించుకోదు కదా. శస్త్ర చికిత్సలో దుష్టాంగాన్ని తీసేయటం ధర్మం అయ్యో! వేలు తీసేస్తే కష్టం అనుకొని వదిలేస్తే ... కాలే తీసేసే పరిస్థితి వస్తుంది.  కర్తవ్య నిర్వహణలో గుండె దిటవు చేసుకోవలసిన అవసరం ఉంది. ఇవి మన కంటికి కొట్టొచ్చినట్టు కనపడేవి కనక అర్ధం అవుతాయి. కాని, అనునిత్యం విద్యుక్త  ధర్మాన్ని నిర్వహిస్తున్నప్పుడు చాలామంది ఇలాగే తమ పనులని సమర్థించుకుంటూ ఉంటారు. 

ఎందుకు చేయలేదు... అంటే, పోనీలే అని ఊరుకున్నాను.'అంటారు. వాస్తవం ఏమంటే చేసే ధైర్యం లేదు. సమర్థత లేదా? అంటే కావలసినంత ఉంటుంది. అయితే అవతలి వారు తమకి కావలసిన వారో... ఆత్మీయులో, ఇంకేదో రకమైన అనుబంధమున్న వారో అయి ఉంటారు. బాగా అందరికీ అనుభవంలో ఉండే ఉదాహరణ ఒకటి ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటే బాగా అర్థమవుతుంది.. 

పిల్లలని బాగా క్రమశిక్షణలో పెంచాలనుకునే తల్లితండ్రులు.. వారు అడిగినవన్నీ ఇవ్వకుండా వారికి అవసరమైనవే ఇస్తూ ఉంటారు. అపురూపంగా చూసుకునే తమ పిల్లవాడికి ఏ జ్వరమో వచ్చిందంటే బాధ పడిపోతూ, వాడు ఇంతకుముందు అడిగినవన్నీ ఇచ్చేద్దామని నిర్ణయించుకుంటారు. జ్వరం తగ్గాక అది అమలు చేస్తారో లేదో తరువాత సంగతి. ఇది జాలి మొదలైన పేర్లతో లోకంలో చలామణి అవుతున్న హృదయ దౌర్బల్యం. 

ఈ హృదయ దౌర్బల్యాన్ని వదలి ..ఉత్తిష్ఠ.... అంటే లెమ్మని కర్తవ్య బోధ చేశాడు శ్రీకృష్ణుడు. లేవటం అంటే నిద్రమత్తులోనుండి మెలకువ తెచ్చుకొని, అలసటని... అంటే బద్దకాన్ని వదిలి పనిలో పడమని. మనిషిలో బద్ధకం పని మొదలు పెట్టే వరకే ఉంటుంది. ఒకసారి ప్రారంభించిన తరువాత సహజ గుణం వెలికి వచ్చి పని సాగిపోతూ ఉంటుంది. అసలు కదలటం ప్రధానం. ఆ కదలికకి కావలసిన ప్రేరణని కలిగించాడు శ్రీకృష్ణుడు. అది నిజానికి మనిషిలో నిద్రాణంగా ఉన్న ఆత్మశక్తికి మేలుకొలుపు.

–వెలుగు, లైఫ్​–