హైదరాబాద్, వెలుగు : యూపీఎస్సీ కూడా అభ్యర్థి కోరిన జిల్లాలోనే ఎగ్జాం సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని, కానీ మన రాష్ట్రంలో గురుకుల అభ్యర్థులు మాత్రం మూడు పేపర్లు రాసేందుకు మూడు వేర్వేరు ప్రాంతాల్లోని సెంటర్లకు తిరగాల్సి వస్తున్నదని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యర్థి ఆప్షన్‌గా ఇచ్చిన జిల్లాలు కాకుండా.. వందల కిలోమీటర్ల దూరంలోని పరీక్షా కేంద్రాలను అలాట్ చేయడం ఏమిటని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. ఒక అభ్యర్థి వందల కిలోమీటర్లు ప్రయాణించి పరీక్షలు రాయడం ఎలా సాధ్యమని అన్నారు.
ప్రత్యేకించి ఇది మహిళా అభ్యర్థులకు పెను సవాల్‌గా మారిందన్నారు. ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్తున్న సీఎం కేసీఆర్.. ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండా లోపభూయిష్టమైన విధానాలను రూపొందిస్తున్నట్టు కనిపిస్తున్నదని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వ చేతగానితనం గురుకుల రిక్రూట్మెంట్ సెంటర్ల కేటాయింపుతోనే బయటపడిందన్నారు.