తెలంగాణలో ఒక్కో పంచాయతీ సెక్రటరీపై రూ.3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు

తెలంగాణలో ఒక్కో పంచాయతీ సెక్రటరీపై రూ.3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు
  • ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి ఆగిన నిధులు 
  • రెండున్నరేండ్లుగా స్టేట్​ ఫైనాన్స్ నిధులూ వస్తలేవు 
  • మెయింటెనెన్స్  పనుల కోసం సొంతంగా ఖర్చుపెడుతున్న కార్యదర్శులు
  • ఒక్కో సెక్రటరీపై రూ.3 లక్షల నుంచి 10 లక్షల దాకా అప్పు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో  కేంద్రం నుంచి పల్లెలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. నిరుడు జనవరి నుంచి ఇదే పరిస్థితి. ఇటు రెండున్నరేండ్లుగా రాష్ట్రం నుంచి స్టేట్​ ఫైనాన్స్​ నిధులు కూడా రావడం లేదు. మరోవైపు ఆస్తిపన్నులు వసూలు కావట్లేదు. దీంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. నిధుల్లేక పల్లెల్లో అభివృద్ధి పనులు చేసే పరిస్థితి లేదు. పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, ట్రాక్టర్  మెయింటనెన్స్, డీజిల్, ట్యాంకుల క్లోరినేషన్, బ్లీచింగ్, మోటార్ల రిపేర్  లాంటి పనులకు సెక్రటరీలు తమ జేబుల్లోంచి ఖర్చు చేయాల్సి వస్తున్నది. రెండేండ్లుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పులు చేశామని కార్యదర్శులు వాపోతున్నారు. అప్పులు తెచ్చి పనులు చేస్తున్నా కొందరు ఉన్నతాధికారులు ఫీల్డ్​విజిట్ పేరుతో ఎక్కడో ఓ లోపం పట్టుకొని తమపై చర్యలు తీసుకుంటున్నారని, ఇది ఎంత వరకు సమంజసమని సెక్రటరీలు ప్రశ్నిస్తున్నారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు కనీసం స్టేట్ ​ఫైనాన్స్​ నిధులైనా విడుదల చేసి అప్పుల బాధ నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

పంచాయతీలకు రూ.6,500 కోట్లు పెండింగ్

పంచాయతీలకు గతేడాది ఫిబ్రవరిలో పాలకవర్గాల గడువు ముగిసింది. ఏడాది దాటినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు ఆగిపోయాయి. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం రూ.1,514 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. పాలకవర్గాలు కొలువుదీరితే తప్ప ఈ నిధులు వచ్చే పరిస్థితి లేదు. రెండున్నరేండ్లుగా దాదాపు రూ.5 వేల కోట్ల స్టేట్  ఫైనాన్స్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. గత బీఆర్ఎస్  హయాం నుంచే ఈ పరిస్థితి ఉంది. అప్పటి సర్పంచులు అప్పు చేసి పల్లెల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టగా, దానికి సంబంధించిన బిల్లులు నేటికీ చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. 15 నెలల కింద కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి రావడంతో పంచాయతీలు గాడిన పడ్తాయని అందరూ భావించారు. గతంలో కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులైనా వచ్చేవి. కానీ, ఎన్నికలు జరగకపోవడంతో ఆ నిధులు కూడా రాకపోవడంతో పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడినట్లు అయింది. 

నిర్వహణ భారమంతా కార్యదర్శులదే

సర్పంచుల పదవీకాలం ముగియడంతో పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. ఒక్కో అధికారికి నాలుగైదు గ్రామాల బాధ్యతలు ఉండడంతో ఇప్పుడు పంచాయతీల నిర్వహణ భారమంతా పంచాయతీ కార్యదర్శలపై పడింది. కేంద్రం, రాష్ట్రాల నుంచి ఫండ్స్  రాకపోవడం, టార్గెట్​ మేరకు ఆస్తిపన్నులు వసూలు కాకపోవడంతో కార్యదర్శులే అప్పులు చేసి పంచాయతీలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటింటా చెత్త సేకరణకు ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను గ్రామంలోకి పంపాలంటే అందులో డీజిల్‌‌‌‌‌‌‌‌  పోయించాల్సి ఉంటుంది. నెలనెలా డీజిల్‌‌‌‌‌‌‌‌కు రూ.10 వేల నుంచి20 వేలకు పైగా ఖర్చుచేయాల్సి వస్తోంది. చాలా గ్రామాలకు మిషన్​ భగీరథ నీళ్లు అందడం లేదు. దీంతో లోకల్​గా బోర్లు, మోటార్లు, పైపుల రిపేర్లు చేయించక తప్పట్లేదు. రహదారులపై మొరం పోయించడం, గుంతలు పూడ్చడం, మొక్కలకు నీళ్లు పట్టడం, స్ట్రీట్​ లైట్ల నిర్వహణ లాంటి పనులు సరేసరి. ప్రత్యేక అధికారుల పాలనలో ఏ చిన్న మీటింగ్  జరిగినా తమ జేబు నుంచే పెట్టుకోవాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. ఇలా ఒక్కో నెలకు రూ.50 నుంచి రూ.80 వేల వరకు, పెద్ద పంచాయతీలకు రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు మెయింటెనెన్స్  ఖర్చవుతున్నదని చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా అప్పు చేశామని వాపోతున్నారు.

తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నయ్​

ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పల్లెల్లో సమస్యలు పరిష్కరించలేకపోతున్నం. చాలా మంది సెక్రటరీలు లక్షల్లో అప్పులు తెచ్చి పనులు చేయాల్సి వస్తున్నది. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపో వడంతో ఇబ్బందులు పడ్తున్నరు. వారి కుటుంబాల పోషణ కూడా కష్టంగా మారింది. సర్కారు వెంటనే స్పందించి,  ఫండ్స్​ విడుదల చేయాలి.  - శ్రీకాంత్, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 

స్టేట్​ఫైనాన్స్​నిధులు రిలీజ్  చేయాలి

జీపీలకు నిధులు రాకపోవడంతో మా జీతాలు పోగా, మీదంగ అప్పులు తెచ్చి పనులు చేస్తున్నం. ట్రాక్టర్  డీజిల్, మోటార్లు, పైపులైన్ల రిపేర్లకు మా జేబులోంచి పెడుతున్నం. కేంద్రం నుంచి నిధులు రాకుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా స్టేట్​ ఫైనాన్స్​ నిధులు రిలీజ్​ చేయాలి. కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి. 2019లో ఉద్యోగంలో చేరిన వాళ్లకు సర్వీస్ కాలం కలిపి, ఒకేసారి రెగ్యులరైజేషన్  డేట్ ఇవ్వాలి. - కర్నెకంటి నరేశ్, గ్రేడ్- 4 కార్యదర్శి, భూపాలపల్లి జిల్లా