కేంద్రంలో ఎన్డీయే సర్కారు తీసుకున్న నిర్ణయాలపై ఎవరి అభ్యంతరాలు వాళ్లకున్నాయి. అలాగని, ఒక బేనర్ కిందకు వచ్చి ఉద్యమించడానికి ఏ పార్టీ చొరవ చూపించడం లేదు. కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ మీటింగ్ పెట్టి పిలిస్తే లోకల్‌గా బలం ఉన్న తృణమూల్, డీఎంకే లాంటివి పట్టించుకోలేదు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీలు ముట్టుకుంటే భగ్గుమనే విషయాలు. ఢిల్లీ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే మెయిన్ అజెండాలోకి వస్తాయి. మెజారిటీ ప్రజలను వదులుకోలేరు, మైనారిటీలను దూరం చేసుకోలేరు. అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాకనే మమత, మాయావతి, స్టాలిన్, కేజ్రీవాల్ వంటి ప్రజాబలం ఉన్నవాళ్లు మొహం చాటేశారని ఎనలిస్టులు చెబుతున్నారు.
శత్రువు బలంగా ఉంటే ఒంటిచేత్తో గెలవలేం, నలుగురినీ కలుపుకు పోవలసిందే అన్నది యుద్ధ నీతి. కాంగ్రెస్ ఆ ప్రయత్నంలో ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి వేస్తోంది. కేంద్రంలో మోడీ సర్కారు తీసుకున్న కఠిన నిర్ణయాల్ని వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్ ఒక్కటే గట్టిగా నిలబడుతోంది. మిగతా పార్టీలన్నీ తమ తమ అవసరాల్ని బట్టి నడుచుకుంటున్నాయి. ఉదాహరణకు, సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ బిల్లు (సీఏబీ)పై శివసేన తీరు స్పష్టం చేస్తోంది. పార్లమెంట్లో ఆ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు శివసేన లోక్‌సభలో సమర్థించింది. రాజ్యసభకొచ్చేసరికి ఓటింగ్‌లో పాల్గొనకుండా వాకౌట్ చేసింది. అదేమని అడిగితే, ‘జాతీయ ప్రయోజనాల’కోసం సమర్థించాల్సి వచ్చిందని తప్పుకుంది. ఆ బిల్లు సిటిజెన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ)గా మారిన తర్వాత మహారాష్ట్రలో అమలు చేసేది లేదని చెప్పుకొస్తోంది.
నిజానికి, మహారాష్ట్రలో శివసేన తనతో ఎప్పుడూ ఫైట్ చేసే కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ట్రయాంగ్యులర్ గవర్నమెంట్‌ని నడుపుతోంది. దీనికోసం ఒక కామన్ మినిమం ప్రోగ్రాం (సీఎంపీ)కూడా రాసుకున్నారు. దాని ప్రకారం కీలకమైన విషయాల్లో మూడు పార్టీలు ఒక్క మాటపై నిలబడాలి. సీఏఏని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ… ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ పెడితే దాని మిత్రపక్షంగా ఉన్న శివసేన గైర్హాజరయ్యింది. ‘మేము మిస్‌కమ్యూనికేషన్ (సమాచారం అందక) రాలేకపోయాం’ అని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సర్దుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఆ మీటింగ్‌కి 20 పార్టీలు హాజరైనట్లు చెబుతున్నారు. వాటిలో ఉనికి కోసం తంటాలు పడుతున్న రెండు కమ్యూనిస్టు పార్టీలు, మహా వికాస్ ఆగాధీ (ఎంవీఏ)లో భాగస్వామి ఎన్సీపీ, బీహార్‌లో పెద్ద పార్టీ ఆర్జేడీ వంటివి హాజరయ్యాయి. వీటితోపాటు కొత్త దోస్తు జేఎంఎంకూడా వచ్చింది. ఈ అర డజను పార్టీలను మినహాయిస్తే మిగతావన్నీ లోకల్గానైనా పెద్దగా ప్రభావం చూపలేని పార్టీలే అంటున్నారు ఎనలిస్టులు.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేని ఢీకొట్టడానికి సెంట్రల్, సెంట్రిక్ లెఫ్ట్ పార్టీలతో కూటమి కట్టాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో కలగంటోంది. 2018 బడ్జెట్ సెషన్ సందర్భంలోనే రెండుసార్లు సోనియా గాంధీ అపోజిషన్ పార్టీలతో మీటింగ్‌లు పెట్టారు. ఒకదానికి వచ్చినవాళ్లు రెండో మీటింగ్‌కి రాకపోవడంతో అప్పట్లోనే ఆమె ప్రయత్నాలకు గండి పడింది. ఆ తర్వాత అనుకోకుండా కర్ణాటకలో బీజేపీని ఇరుకునపెట్టే అవకాశం వస్తే, కాంగ్రెస్ పూర్తిగా వాడుకుంది. 37 సీట్లు తెచ్చుకున్న జేడీ(ఎస్)కి సపోర్ట్నిచ్చి, హెచ్.డి.కుమారస్వామిని సీఎం సీటులో కూర్చోబెట్టింది. ఆ సందర్భంలో ఏపీ నుంచి చంద్రబాబునాయుడు, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, ఉత్తరప్రదేశ్ నుంచి మాయావతి వంటి హేమాహేమీలు వేదికపై నిలబడి యాంటీ–బీజేపీ ఫ్రంట్ ఏర్పడబోతోందన్న సంకేతాలిచ్చారు. కానీ, ఆ ప్రయత్నం మొగ్గగానే వాడిపోయింది.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఒక దశలో ‘ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటుకు చాలా చురుగ్గా ప్రయత్నాలు సాగించారు. మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను, బెంగాల్ సీఎం మమతను స్పెషల్ ఫ్లయిట్ వేసుకుని వెళ్లి కలిశారు. ఇదికూడా ముందుకు సాగలేదు. మూణ్ణాళ్లకే దాని ఊసు అందరూ మరచిపోయారు.
ప్రస్తుతానికి దేశంలో 26 పార్టీలతో బీజేపీ నడిపిస్తున్న ఎన్డీయే ఒక్కటే యూనిటీతో ఉంది. కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో 11 పార్టీల యూపీయే ఉన్నప్పటికీ… అవేవీ పెద్దగా బలం లేని పార్టీలేనని ఎనలిస్టుల అంచనా. యూపీయేకి లోక్‌సభలో 93 సీట్లున్నా వాటిలో కాంగ్రెస్‌కి 52, డీఎంకేకి 24 సీట్లు తీసేయగా, మిగతా పార్టీల బలం 17 సీట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో తమ కూటమిలో లేకపోయినప్పటికీ బీజేపీ వ్యతిరేక లైన్‌తో పాలిటిక్స్‌తో నడిపే పార్టీలనుకూడా కలుపుకుపోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. ఈ వరుసలో కీలకమైనవి సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, టీడీపీ, టీఆర్ఎస్, జేడీ(ఎస్), ఐఎన్ఎల్డీ వంటివి. వీటిలో టీడీపీ, టీఆర్ఎస్లను కాంగ్రెస్ పిలవనే లేదు. పిలుపు వెళ్లిన పార్టీల్లో పెద్ద పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, ఆప్, శివసేన గైర్హాజరయ్యాయి.
వచ్చే ఏడాదిన్నర కాలంలో ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అస్సాం మినహా అన్ని చోట్ల ప్రతిపక్షాలే అధికారంలో ఉన్నాయి. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ వంటివన్నీ నేరుగా ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాయి. ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలకు వీటి విషయంలో చాలా భయాలున్నాయి. ఈ దశలో కాంగ్రెస్‌తో కలిసినట్లయితే, తమ ఓట్లు చీలిపోతాయన్న సందేహం తృణమూల్, ‘ఆప్’, సమాజ్‌వాది పార్టీ వంటి వాటిల్లో బాగా ఉంది. అందుకే ఎన్నికల ముందు హిందూ ఓట్లను వదులుకోవడానికిగానీ, ముస్లిం ఓట్లు చీలిపోవడానికిగానీ ఆ పార్టీలు సిద్ధంగా లేవంటున్నారు ఎనలిస్టులు.
కాంగ్రెస్‌తో డీఎంకే గొడవలు
యూపీఏ కూటమిలో డీఎంకే చురుగ్గా ఉన్నప్పటికీ ఆ పార్టీకి తమిళనాడు కాంగ్రెస్ తో గొడవలున్నాయి. లేటెస్ట్ గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గొడవలు బయటపడ్డాయి. ఎన్నికల్లో పొత్తు ధర్మాన్ని డీఎంకే పాటించలేదని సాక్షాత్తూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ( టీఎన్ సీసీ ) చీఫ్ కే ఎస్ అళగిరి, ‘కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ’ ( సీఎల్పీ) నాయకుడు కేఆర్ రామస్వామి బహిరంగంగా విమర్శించారు. 27 జిల్లా పంచాయత్ చీఫ్ పోస్టుల్లో ఒక్క పోస్టును కూడా కాంగ్రెస్ కు ఇవ్వలేదని వీరు ఆరోపించారు. అలాగే కూటమి తరఫున పోటీ చేసిన 303 పంచాయత్ యూనియన్లలో కేవలం రెండు యూనియన్లనే తమకు కేటాయించారని కాంగ్రెస్ లీడర్లు మండిపడ్డారు. దీనిని స్టాలిన్ సీరియస్ గా తీసుకున్నారు. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సర్ది చెప్పే ప్రయత్నం చేసినా స్టాలిన్ తగ్గలేదు. ఢిల్లీ మీటింగ్‌కు డీఎంకే గైర్హాజర్ కావడానికి ఇదే కారణమంటున్నారు ఎనలిస్టులు.
అసెంబ్లీ ఎన్నికలే మమత టార్గెట్
ఎన్డీయే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కొన్ని రోజుల కిందట ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ బెంగాల్ లో హింసాత్మకంగా మారడంతో మమతా బెనర్జీకి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై కోపం వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడుతూ అటు కాంగ్రెస్ ఇటు సీపీఎం రెండూ బెంగాల్లో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సమ్మెలు చేసి బెంగాల్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
పశ్చిమ బెంగాల్లో ముస్లింల ఓట్లు కీలకం. మొత్తం 294 సీట్లలో వందకు పైగా సీట్లలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగబోతున్నాయి. దీంతో ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలవడానికి పక్కా ప్లానులు రెడీ చేసుకుంటున్నారు మమత.
అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో మమతా బెనర్జీ దోస్తానా కంటిన్యూ అయితే అది తృణమూల్ కాంగ్రెస్ కు మైనస్ పాయింటే అవుతుందన్నది ఒక అంచనా. తమకు టీఎంసీ ఒక్కటే రక్షణ కల్పించగలదన్న అభిప్రాయం ముస్లింలలో కలిగించాలన్నది మమతా బెనర్జీ ముందున్న టార్గెట్. ముస్లిం ఓట్లు తృణమూల్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య చీలిపోకుండా చూడటానికి ఆమె ప్రయత్నిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడానికి రెండంచెల వ్యూహాన్ని అమలు చేయాలన్నది మమతా బెనర్జీ ఆలోచనగా కనిపిస్తోంది. ముస్లిం ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవడంతో పాటు హిందువుల ఓట్ల శాతాన్ని కూడా పెంచుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఇప్పటికే బెంగాల్ పై బీజేపీ పెద్దలు సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి ఒకే వేదిక మీద కనిపించి మోడీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తే ఉన్న హిందూ ఓటు బ్యాంకు కూడా పోతుందని ఆమె భయపడుతున్నారు. గతంలో తృణమూల్ కు అండగా నిలిచిన మతువా కమ్యూనిటీ ఓట్లు కిందటేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చీలిపోయాయన్నది నిజం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు మమత దూరంగా ఉంటున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు.
కాంగ్రెస్‌కు చెక్ పెట్టడానికేనా?
ఉత్తరప్రదేశ్‌లోని బీసీ కులాల్లో మంచి పరపతి ఉన్న అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని ‘సమాజ్‌వాది పార్టీ’ కూడా మీటింగ్ కు హాజరుకాకపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. యూపీలో కాంగ్రెస్, ఎస్పీలు తమ మనుగడకు అటు ముస్లింలు ఇటు బీసీల పైనే ఆధారపడుతుంటాయి. దీంతో రెండు పార్టీలు ముస్లిం ఓటు బ్యాంకు పైనే కన్నేశాయి. అయితే కాంగ్రెస్ వల్ల సమాజ్‌వాది పార్టీకి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ యూపీలో కాంగ్రెస్ బలపడితే ఆ తరువాతి కాలంలో అది ఎస్పీకి ఇబ్బంది కావచ్చు. సమాజ్‌వాది పార్టీకి పడే ముస్లింల ఓట్లు చీలిపోవచ్చు. ఈ పరిస్థితుల్లో సీఏఏను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ బలపడకూడదన్న ఏకైక టార్గెట్ తో ఢిల్లీ మీటింగ్ కు సమాజ్‌వాది పార్టీ దూరంగా ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు.
కేజ్రీవాల్ స్టాండ్ ఏంటి ?
ఢిల్లీ మీటింగ్‌కు ‘ఆప్’ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం వెనక ఎత్తుగడే ఉందంటున్నారు ఎనలిస్టులు. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగబోతున్నాయి. ‘ఆప్’ తో పాటు ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ నాయకత్వానికి ఈ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. కేజ్రీవాల్ ప్రస్తుతం ఇంటాబయటా అనేక చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. ఢిల్లీలో 22 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి పవర్ లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే కేజ్రీవాల్ ఐదేళ్ల పాలనపై చార్జ్ షీట్ విడుదల చేసి బీజేపీ ప్రచారంలోకి దూసుకుపోయింది. ‘ఆప్’ ఐదేళ్ల పాలన అంతా ఫెయిల్యూర్స్ మయమేనని బీజేపీ లీడర్లు తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ ఎత్తుగడల గురించి బాగా తెలిసిన కేజ్రీవాల్ కూడా ఎన్నికలకు ఆయుధాలతో రెడీ అవుతున్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి అనేక పాప్యులిస్టు స్కీంలను అమలు చేసి జనం దగ్గరకు వెళుతున్నారు.
2019 లోక్ సభ ఎన్నికల నాటికి ముస్లింలు, షెడ్యూల్డ్ కులాల ఓట్లు కాంగ్రెస్, ‘ఆప్’ మధ్య చీలిపోయాయి. షీలా దీక్షిత్ చనిపోయిన తరువాత ఢిల్లీలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేకుండా పోయారు. అంతేకాదు ఢిల్లీ వరకు కాంగ్రెస్, ‘ఆప్’ మధ్య పెద్దగా సంబంధాలు కూడా లేవు. గల్లీ స్థాయి లీడర్ల లెవెల్లో గొడవలున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు కేజ్రీవాల్ ప్రయత్నించినా ఢిల్లీ లీడర్లు పడనివ్వలేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ను దూరం పెట్టి బీజేపీని వ్యతిరేకించే వర్గాలతో కలిసిపోవాలనేది కేజ్రీవాల్ ఆలోచనగా కనిపిస్తోంది. ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యనే ఉంది. దీంతో కావాలనే సీఏఏ సమావేశానికి ‘ఆప్’ గైర్హాజరైనట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు.
రాజస్థాన్ గొడవలే కారణమా?
ఢిల్లీ మీటింగ్‌కు మాయావతి నాయకత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) హాజరుకాకపోవడం వెనక రాజస్థాన్ గొడవలే కారణం. ఇక్కడి అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కు బీఎస్పీ బయటి నుంచి మద్దతు ఇస్తోంది. బీఎస్పీకి ఇక్కడ ఆరుగురు ఎమ్మెల్యేలున్నారు. కిందటేడాది సెప్టెంబరులో వీళ్లంతా కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ పై మాయావతి మండిపడ్డారు. బొటాబొటీ మెజారిటీతో సర్కార్ ను నెట్టుకొస్తున్న కాంగ్రెస్ కు బయటి నుంచి మద్దతు ఇస్తున్నప్పటికీ తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను కొనేశారని ఆమె విరుచుకుపడ్డారు. లేటెస్ట్ గా రాజస్థాన్ లోని కోటా ఆస్పత్రిలో పిల్లలు చనిపోతున్న సంఘటనలో సోనియా గాంధీ, ప్రియాంకలపైనే నేరుగా విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లోనే సమావేశానికి గైర్హాజరైనట్టు మాయావతి ట్వీట్ చేశారు.