ప్రభుత్వం తరపున వాదించేందుకు సుప్రీం న్యాయవాదుల వైపు మొగ్గు

ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున వాదించడానికి ఎంతో మంది న్యాయవాదులు ఉన్నారు. వీళ్లకి తోడు అడిషనల్​ అడ్వకేట్ ​జనరల్, అడ్వకేట్​ జనరల్​ ఉంటారు. వీళ్లంతా ఉండగా, ప్రభుత్వాలు కొంత ప్రాముఖ్యం ఉన్న కేసుల్లో లక్షల ఫీజులు చెల్లించి ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు సీనియర్ ​న్యాయవాదులని తెచ్చుకుంటున్నాయి. అందుకు గల కారణం ఏంటో ? వాళ్లు చెప్పే నాలుగు విషయాలు మన న్యాయవాదులు చెప్పలేరా? 


ఏ మాత్రం ప్రాముఖ్యం ఉన్నా, ఆ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, దేశంలో పేరొందిన సీనియర్​న్యాయవాదులను తమ ప్రభుత్వం తరఫున వాదించడానికి నియమించుకుంటున్నాయి. సుప్రీంకోర్టులో వాదించడానికి మాత్రమే కాదు, తమ హైకోర్టుల్లోని ప్రాముఖ్యం ఉన్న కేసుల్లో వాదించడానికి కూడా సీనియర్​ న్యాయవాదుల సేవలను చాలా ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి. సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదులను ఆయా ప్రభుత్వాలు నియమించుకోవచ్చు. కానీ అలా కాకుండా సుప్రీంకోర్టులోని సీనియర్​ న్యాయవాదులని ఆయా ప్రభుత్వాలు నియమించుకుంటున్నాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే, తమ హైకోర్టుల్లో ప్రభుత్వం తరఫున వాదించడానికి కూడా ప్రముఖ సీనియర్​ న్యాయవాదుల సేవలను వాడుకుంటున్నాయి. ఏకంగా ఢిల్లీ నుంచి పిలిపించుకొని తమ వాదనలు వినిపిస్తున్నాయి. వాళ్లకు చెల్లించే ఫీజులు రూ. లక్షల్లో, కోట్లల్లో ఉంటున్నాయని వింటున్నాం. ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున వాదించడానికి ఎంతో మంది న్యాయవాదులు ఉన్నారు. వీళ్లకి తోడు అడిషనల్​అడ్వకేట్​జనరల్, అడ్వకేట్​జనరల్​లు ఉంటారు. వీళ్లు ఉండగా, ప్రభుత్వాలు లక్షల ఫీజులు చెల్లించి సీనియర్ ​న్యాయవాదులని నియమించుకోవడానికి కారణం ఏంటో ? వాళ్లు చెప్పే నాలుగు విషయాలు మన న్యాయవాదులు చెప్పలేరా? 

అడ్వకేట్​ జనరల్ ​ఎంపిక ఎలా?

చాలా మందికి అడ్వకేట్​ జనరల్​ను ఎలా ఎంపిక చేస్తారన్న సందేహం ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్165 ప్రకారం అడ్వకేట్​ జనరల్​ను ప్రతి రాష్ట్రం నియమించుకోవచ్చు. రాష్ట్రానికి సంబంధించి అత్యున్నత న్యాయాధికారి అడ్వకేట్​జనరల్. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వం తరఫున వాదించే అటార్నీ జనరల్ ఎలాగో, రాష్ట్రంలో అడ్వకేట్​జనరల్​ అలాగే ఉంటారు. ఈయనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర గవర్నర్​ నియమిస్తారు. హైకోర్టు జడ్జిగా నియమించడానికి ఉన్న అర్హతలే ఈయనకూ ఉంటాయి. అంటే పది సంవత్సరాలు న్యాయమూర్తిగా గానీ, లేదా హైకోర్టులో పదేండ్లు న్యాయవాదిగా ప్రాక్టీస్​ చేసి ఉండాలి. భారతదేశ పౌరుడై ఉండాలి. ఎంతకాలం అనే  విషయం మాత్రం రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. పదవి నుంచి ఎలా తొలగించవచ్చన్న విషయం కూడా రాజ్యాంగంలో  లేదు. అయితే గవర్నర్​ సంతృప్తి ఉన్నంత కాలం ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వం మారినపుడు గానీ, మంత్రి మండలి రాజీనామా చేసినపుడు గానీ అడ్వకేట్​జనరల్ రాజీనామా చేయడం ఆనవాయితీగా మారింది. ఎందుకంటే, మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్​ ఆయనను నియమిస్తాడు కాబట్టి.

అడ్వకేట్​ జనరల్​ విధులు

అడ్వకేట్​జనరల్ జీతభత్యాలను కూడా రాజ్యాంగం నిర్దేశించలేదు. గవర్నర్​ నిర్ధారించినట్టుగా ఆయన రెమ్యునరేషన్​ తీసుకుంటాడు. ప్రధాన న్యాయాధికారిగా అతను అన్ని లీగల్​ విషయాల మీద గవర్నర్​కు సలహాలు ఇస్తాడు. గవర్నర్ ​నిర్దేశించిన విధులను కూడా నిర్వహిస్తాడు. రాజ్యాంగం నిర్దేశించిన, ఇతర శాసనాలు నిర్దేశించిన విధులను నిర్వర్తిస్తాడు. తన విధ్యుక్త ధర్మాలు నిర్వర్తించడానికి అతను ఏ కోర్టు ముందైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరు కావొచ్చు. వాదనలు వినిపించవచ్చు. ఉభయ శాసన సభల ముందు హాజరై మాట్లాడే అధికారం అడ్వకేట్​ జనరల్ కు ఉన్నది. శాసన సభలు ఏర్పాటు చేసిన కమిటీల్లో అడ్వకేట్​జనరల్​సభ్యుడిగా ఉండవచ్చు. అయితే ఓటింగ్ అధికారం మాత్రం ఉండదు.

ఆత్మస్థైర్యం దెబ్బతినదా?

భారత ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్,​ సొలిసిటర్ జనరల్స్​ మాత్రమే హాజరై సుప్రీంకోర్టులో వాదిస్తారు. వీళ్లను కాకుండా ఇతర సీనియర్​ న్యాయవాదులను భారత ప్రభుత్వం నియమించుకున్నట్లు నాకు తెలిసి ఎప్పుడూ జరగలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వకేట్ జనరల్​ను కాకుండా సుప్రీంకోర్టు సీనియర్​న్యాయవాదులను నియమించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలా నియమించుకోవడం వల్ల అడ్వకేట్ జనరల్​ఆత్మస్థైర్యం దెబ్బతినదా? సుప్రీంకోర్టు వరకు ఫర్వాలేదు. రాష్ట్ర హైకోర్టు ముందు అవసరమా? అత్యధిక ఫీజులు చెల్లించి సీనియర్​ న్యాయవాదులను ఎంపిక చేసుకోవడంలోని  ఔచిత్యం ఏమిటి? అలాంటప్పుడు ఈ పదవి అవసరమా? ఇట్లా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  ప్రభుత్వం మాత్రమే జవాబులు చెప్పాల్సిన ప్రశ్నలు అవి. ప్రభుత్వం ప్రాముఖ్యం అనుకున్న కేసుల్లో సీనియర్​న్యాయవాదులకు, అడ్వకేట్ జనరల్ కు, అడిషనల్​అడ్వకేట్​జనరల్స్​కు చెల్లించిన ఫీజులు ఎంత? ఇవి సామాన్యుడికి తెలియాల్సిన అంశాలే!


అధిక ఫీజులు ఎందుకు?

‘న్యూస్​ మినట్’ అనే వెబ్​ జర్నల్​లో  ఓ ఆసక్తికర కథనం కనిపించింది. ‘హిజాబ్​’ కేసులో  సుప్రీంకోర్టులో వాదించడానికి కర్నాటక ప్రభుత్వం సొలిసిటర్ ​జనరల్​ ఆఫ్​ ఇండియా తుషార్​ మెహతా, అడిషనల్​ సొలిసిటర్​జనరల్​ఆఫ్​ ఇండియా కే.ఎం. నటరాజ్ సేవలను ఉపయోగించుకుంది. అందుకోసం వారికి రూ.88 లక్షల ఫీజు చెల్లించింది. అందులో రూ.39.60 లక్షల ఫీజు తుషార్​ మెహతాకు, రూ.48.40 లక్షల ఫీజు నటరాజ్​కు చెల్లించిందని ‘ఇన్వెస్టిగేటివ్ ​డిజిటల్​పబ్లికేషన్’​ అనే సంస్థ ప్రచురించిందని ‘న్యూస్​ మినట్’ పేర్కొంది. ఆ కేసులో తుషార్​ మెహతా 9 సార్లు, నటరాజ్11 సార్లు సుప్రీం ముందు హాజరయ్యారు. అంటే, వారు ప్రతి వాయిదాకు రూ.4.4 లక్షలు ఫీజు తీసుకున్నారు. ఈ ఫీజు కూడా తక్కువ అని చాలా మంది న్యాయవాదుల అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకున్న న్యాయవాదులకు అధికంగా ఫీజులు చెల్లిస్తున్నాయనేది ఇక్కడి న్యాయవాదుల ఆరోపణ. ప్రభుత్వాలు ఈ విషయంలో శ్వేత పత్రం విడుదల చేస్తే తప్ప ఫీజులు ఎంత చెల్లించారన్న విషయం తేలదు. ప్రతి రాష్ట్రానికి అడ్వకేట్​జనరల్​ఉండగా సుప్రీంకోర్టు సీనియర్​న్యాయవాదులను తీసుకురావడం అవసరమా? అన్న ప్రశ్న కూడా వస్తున్నది. కేసు నిలవదని తెలిసిన కేసుల్లో కూడా ఆ న్యాయవాదులు కేసులని వాదిస్తున్నారన్న అపవాదూ ఉన్నది. ఈ అపవాదులో కొంత సత్యం ఉందని మరికొంత మంది అంటూ.. ఇటీవల మన హైకోర్టులో గవర్నర్​మీద వేసిన కేసును ఉదహరిస్తున్నారు. 

- మంగారి రాజేందర్, జిల్లా సెషన్స్​ జడ్జి (రిటైర్డ్​)