ఆఫీసర్లది ఓ రేటు.. వ్యాపారులది మరో రేటు

ఆఫీసర్లది ఓ రేటు..  వ్యాపారులది మరో రేటు
  • కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచుతున్న దళారులు
  • హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌లోనే ప్రతి కూరగాయపై రూ. 20 నుంచి రూ. 30 పెంపు
  • అధికారుల లెక్కల్లో కిలో టమాట రూ. 40, జనాలకు అమ్మేది మాత్రం రూ. 90 నుంచి రూ.100
  • రేట్లు నిర్ణయించుడు తప్ప అమలు పట్టించుకోని ఆఫీసర్లు

వరంగల్, వెలుగు : కూరగాయల రేట్లు విపరీతంగా పెరగడంతో జనాలు పరేషాన్‌‌ అవుతున్నారు. ప్రస్తుతం ఏ కూరగాయ తీసుకున్నా ఒక్కోటి కిలో రూ. 100 నుంచి రూ. 140 వరకు పలుకుతోంది. మార్కెట్‌‌ హెచ్చు తగ్గులు, దిగుబడి ఆధారంగా ఆఫీసర్లు ప్రతి రోజు కూరగాయల రేట్లు నిర్ణయిస్తుంటారు. కానీ దళారులు కూరగాయలను కావాలనే బ్లాక్‌‌ మార్కెట్‌‌కు తరలించి రేట్లు పెరిగేలా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్‌‌ మార్కెట్‌‌పై నిఘా పెట్టి రేట్లను కంట్రోల్‌‌ చేయాల్సిన ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో జనాల జేబులు ఖాళీ అవుతున్నాయి. 

నెలలో 100 శాతం పెరిగిన రేట్లు 

గత నెలతో పోలిస్తే ప్రస్తుతం అన్ని కూరగాయల ధరలు అమాంతం 80 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. టమాట అయితే రికార్డు స్థాయి ధర పలుకుతోంది. ఈ నెల 18, 19 వరకు కిలో రూ. 70 పలికిన టమాట 20వ తేదీ నుంచి రూ. 100కు చేరుకుంది. మే నెలలో పచ్చిమిర్చి (సన్న రకం) క్వాలిటీ ఆధారంగా రూ.70 ఉండగా ఇప్పుడు రూ.120 నుంచి 130 అయింది. బీరకాయ, దేశీ చిక్కుడు, కాకరకాయ, క్యాప్సికం ధరలు 25 రోజుల క్రితం కిలో రూ.60 ఉండగా బుధవారం రూ.120 పలికాయి. కాకర, వంకాయ, గోరుచిక్కుడు రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. రూ.15 నుంచి రూ. 20 పలికే సోరకాయ ప్రస్తుతం రూ.50 చెబుతున్నారు. క్యారెట్‍రూ.80 పలుకుతుండగా, అల్లం రూ.250, ఎల్లిగడ్డ కిలో రూ.330తో చుక్కలు చూపుతున్నాయి.

దళారులు, వ్యాపారుల బ్లాక్‍ మార్కెట్‍

కూరగాయల ధరలు గతానికి భిన్నంగా పెరగడంలో దళారులు, వ్యాపారులు, ఆఫీసర్ల పాత్ర కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉపయోగించే కూరగాయల్లో సుమారు 80 శాతం పక్క రాష్ట్రాల నుంచే దిగుబడి చేసుకుంటుండడంతో రవాణా ఛార్జీల భారం ధరలపై పడుతోంది. ప్రధాన మార్కెట్లలో ఏఏ కూరగాయలు ఎంత ధరకు అమ్మాలనేది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆఫీసర్లు నిర్ణయిస్తారు. అదే రేటుకు వ్యాపారులు కూరగాయలు అమ్మాలి. కానీ దళారులు, ఆఫీసర్లు కలిసిపోవడంతో ఆఫీసర్లు విడుదల చేసే రేట్లకు, జనాలు కొనే రేట్లకు పొంతన ఉండడం లేదు. ఉదాహరణకు వరంగల్‌‌ హోల్‌‌సేల్‌‌ కూరగాయల మార్కెట్‌‌లో బుధవారం అమ్మాల్సిన ధరలను ఆఫీసర్లు తెల్లవారుజామునే ప్రకటించారు. ఇందులో హోల్‌‌సేల్‌‌ ధర టమాట క్వాలిటీ ఆధారంగా బయట అమ్ముకునే వారికి 10 కిలోలకు రూ.350, జనాలు డైరెక్ట్‌‌గా వచ్చి చిల్లర ధరలో కొనుగోలు చేస్తే రూ.40 నుంచి రూ. 45 అమ్మాలని నిర్ణయించారు. అయితే వ్యాపారులు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా కిలో రూ.60 నుంచి 65 వరకు అమ్మారు. దేశీ చిక్కుడు రూ.70 ఉంటే రూ.90కి, బీరకాయ రూ.35 ఉంటే రూ.60కి, క్యాప్సికం రూ.50 ఉంటే రూ.75 నుంచి 80 వరకు, క్యారెట్‌‌ రూ. 40 ఉండగా రూ.60 వరకు అమ్మారు. ఇదేంటనీ ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘స్టాక్‍ లేదు.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి’ అనే సమాధానం వినిపిస్తుంది.

ధరలు నిర్ణయించి.. అమలు పట్టించుకోని ఆఫీసర్లు

హోల్‌‌ సేల్‌‌ మార్కెట్లలో ఆఫీసర్లు నిర్ణయించే ధరల కంటే వ్యాపారులు రూ.20 నుంచి 30 ఎక్కువకు అమ్ముతున్నారు. వీరి దగ్గర కొనుగోలు చేసే చిరు వ్యాపారులు ప్రతి కిలోపై మరో రూ.30 నుంచి రూ. 40 పెంచి అమ్ముతున్నారు. ఆఫీసర్ల లెక్క ప్రకారం బుధవారం మార్కెట్‌‌లో కిలో టమాట రూ.40 ఉండగా దానిని వ్యాపారులు బ్లాక్‌‌ చేసి అమ్మడంతో మార్కెట్లోనే కిలో రూ.60 అయింది. దీనికి చిరువ్యాపారులు మరో రూ.30 నుంచి రూ. 40 పెంచి రూ.90 నుంచి రూ. 100 వరకు అమ్మారు. అధికారుల లెక్కల్లో రూ.40 ఉన్న కిలో టమాట జనాలకు చేరే వరకు రూ. 90 నుంచి రూ. 100 అయింది. ప్రభుత్వ మార్కెట్లలో ధరలు నిర్ణయించే ఆఫీసర్లు.. అవి అమలయ్యేలా చూడడంలో మాత్రం విఫలం అవుతున్నారు. .

ఆఫీసర్ల ధరల పట్టిక ఉత్తిమాటే 

వరంగల్‍ జిల్లా కేంద్రంలోని హోల్‌‌సేల్‌‌ కూరగాయల మార్కెట్లో ఆఫీసర్లు పెట్టే ధరల పట్టికకు, వ్యాపారులు అమ్మే రేట్లకు సంబంధమే ఉండట్లేదు. టమాట, చిక్కుడు, బీరకాయ, క్యాప్సికం.. ఇలా ఏది కొందామన్నా అధికారులు నిర్ణయించిన రేటు కంటే రూ. 20 నుంచి రూ. 30 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఆఫీసర్లు ధరలు పెట్టేందుకే పరిమితం అవుతున్నారు తప్ప వాటిని అమలును మాత్రం పట్టించుకోవడం లేదు.- ఎన్‍.సుధాకర్‍, ఏనుమాముల మార్కెట్‍, వరంగల్‍ 

వాళ్లు పెంచిన్రని.. మేం పెంచుతున్నం 

వరంగల్‍ హోల్‍సేల్‍ మార్కెట్లోని వ్యాపారులు పెట్టే ధరకు అనుగుణంగా మేం జనాలకు అమ్ముతున్నాం. అధికారులు పెట్టే ధర కంటే హోల్‌‌సేల్‌‌ వ్యాపారులు ఎక్కువ అమ్ముతున్నరు. మేము ఆటో చార్జీలు, ఖరాబయ్యే కూరగాయలను లెక్కకట్టి ధర నిర్ణయిస్తున్నాం. హోల్‌‌సేల్‌‌ వ్యాపారులు సర్కారు చెప్పిన రేటుకే అమ్మితే మేం కూడా రేటు తగ్గిస్తాం.‌ - పి.సంపత్‍, హనుమాన్‍నగర్‍, హనుమకొండ