చల్లమల్ల కృష్ణారెడ్డితో ఠాగూర్, రేవంత్ రహస్య మంతనాలు

చల్లమల్ల కృష్ణారెడ్డితో ఠాగూర్, రేవంత్ రహస్య మంతనాలు

టిక్కెట్ ఎవరికొచ్చినా అందరూ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలె

కాంగ్రెస్ టిక్కెట్ ఆశావాహులకు బోస్ రాజు ఆదేశం

హైదరాబాద్ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి సత్తా చాటాలని అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీలు కూడా భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే అన్ని పార్టీలు ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. ఇటు కాంగ్రెస్ కూడా మునుగోడు సీటును కైవసం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. గాంధీభవన్ లో మునుగోడు టిక్కెట్ ఆశావాహులతో ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా అందరూ ఐక్యంగా పని చేసి, అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలని ఆశావాహులకు సూచించారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు మునుగోడులో మండలాల వారీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆశావాహులను బోస్ రాజు ఆదేశించారు. 

కాంగ్రెస్ గెలుపు కోసం అందరూ పని చేయాలె
మునుగోడు టిక్కెట్ ను ఆశిస్తున్న నాయకులను పిలిచి అన్ని విషయాలపై ఆరా తీశామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా అందరూ కలిసి పని చేయాలని ఆదేశించామన్నారు. ఏఐసీసీ నేతలతో మరోసారి సమావేశం ఉంటుందని వివరించారు. రేపు (గురువారం) ముఖ్య నేతలతో గాంధీభవన్ లో మీటింగ్ ఉంటుందన్నారు.

మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. అనంతరం హోటల్ ఐటీసీ కాకతీయలో కాంగ్రెస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అక్కడికే చల్లమల్ల కృష్ణారెడ్డిని పిలిచినట్లు సమాచారం. ఏఐసీసీ సెక్రటరీ బోస్ రాజుతో పాటు మరికొందరు ముఖ్య నేతలకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. చల్లమల్ల కృష్ణారెడ్డిని పక్కకు తీసుకెళ్లి బోసు రాజు మాట్లాడారని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నికలో గెలిచి రాష్ట్రంలో సత్తా చాటాలని కాంగ్రెస్ నాయకులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

రేపు గాంధీభవన్ లో ముఖ్య నాయకుల సమావేశం
గురువారం ఉదయం10 తర్వాత మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రణాళిక కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ కార్యదర్శి మణిక్కమ్ ఠాగూర్, టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కమిటీ కన్వీనర్ మధుయాష్కీతో పాటు కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ అనుబంధ సంఘాల చైర్మన్ లతో సమావేశం నిర్వహిస్తారు. ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి.