- సెకండ్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్
- దేవరకొండలో బాలు నాయక్, భువనగిరిలో కుంభంకు ఛాన్స్
- మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగుతుర్తి సీట్లపై సస్పెన్స్
- దామన్న, బీఎల్‌ఆర్‌కు ఇవ్వాలని ఎంపీ ఉత్తమ్పట్టు
- రమేశ్ రెడ్డికి కోసం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ప్రయత్నం
నల్గొండ, వెలుగు : మునుగోడు కాంగ్రెస్ టికెట్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికే దక్కింది. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరిన మరుసటి రోజే కాంగ్రెస్ హైకమాండ్ ఆయన పేరు ఖరారు చేసింది. శుక్రవారం రిలీజైన సెకండ్ లిస్ట్‌లో ఈయనతో పాటు దేవర కొండ నుంచి మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్, భువనగిరి నుంచి మాజీ డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్లను ప్రకటించింది. తుంగతుర్తి (ఎస్సీ), మిర్యాలగూడ, సూర్యాపేట అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
సొంతగూటికి చేరిన తెల్లారే టికెట్
2018 ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి గతేడాది రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా భావించిన ఆయన రెండు రోజుల కిందే సొంతగూటికి చేరి.. టికెట్ దక్కించుకున్నారు.
మునుగోడు టికెట్ కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు చల్లమల్ల కృష్ణారెడ్డి గట్టిగానే ఫైట్చేశారు. పాల్వాయి స్రవంతి, పున్నా కైలాస్ నేత లాంటి వాళ్లు కూడా టికెట్ కోసం అప్లై చేశారు. పొత్తులో భాగంగా ఇదే సీటు కోసం సీపీఐ కూడా పట్టుబట్టింది. కానీ, హైకమాండ్ రాజగోపాల్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈ సెగ్మెంట్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిధిలోకి ఉండడంతో అభ్యర్థుల ఎంపికలో ఆయన అభిప్రాయాన్ని తీసుకున్నట్లు తెలిసింది.
దేవరకొండ, భువనగిరిలో లైన్ క్లియర్
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్ మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. 2009లో దేవరకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు 2014లో సీపీఐ పొత్తులో భాగంగా టికెట్దక్కలేదు. తర్వాత పార్టీ జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించింది. అనంతరం బీఆర్ఎస్లో చేరిన ఆయనకు నిరాశే ఎదురైంది. సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్బీఆర్ఎస్లో చేరడంతో 2018లో ఎమ్మెల్యే ఛాన్స్ మిస్సైంది. దీంతో అప్పటికప్పుడు కాంగ్రెస్‌లో చేరిన టికెట్ తెచ్చుకున్నా ఓటమి తప్పలేదు. ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ టికెట్ కోసం రవి నాయక్, కిషన్ నాయక్ పోటీ పడ్డా.. అధిష్టానం బాలు పేరును ఫైనల్ చేసింది.
కుంభంకు మరో అవకాశం
ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కుంభం అనిల్ కుమార్ రెడ్డికి పార్టీ రెండో సారి ఛాన్స్ఇచ్చింది. 2018లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన త్రిముఖ పోటీ కారణంగా ఓడిపోయారు. తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో మూడోసారి గెలవడం కష్టమని పలు సర్వేలు తేల్చి చెప్పడంతో.. అనిల్ కుమార్ రెడ్డిని సీఎం కేసీఆర్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. కానీ, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నచ్చచెప్పి అనిల్‌ను మళ్లీ సొంతగూటికి తీసుకొచ్చారు.
సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి
మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి అభ్యర్థుల ఎంపికలో సీనియర్లు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. సూర్యాపేట, మిర్యాలగూడ టికెట్లు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, బత్తుల కృష్ణారెడ్డికి ఇవ్వాలని ఎంపీ ఉత్తమ్పట్టుబడుతున్న తెలిసింది. మిర్యాలగూడ విషయంలో కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తున్న మరో ఎంపీ వెంకటరెడ్డి పేట విషయంలో మాత్రం పటేల్రమేశ్ రెడ్డి వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే నల్గొండ ఎంపీ సెగ్మెంట్ఉత్తమ్ పరిధిలోకి రావడం,
స్క్రీనింగ్ కమిటీలో కీలక పాత్ర పోషిస్తుండటంతో ఆయన ప్రతిపాదన వైపే హైకమాండ్ మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. మునుగోడులో తన అనుచరుడు కృష్ణారెడ్డికి టికెట్రానందున సూర్యాపేటలో రమేశ్ రెడ్డికి ఇప్పించాలని రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్యాలగూడ విషయంలో మాజీ మంత్రి జానారెడ్డి మాత్రం సీపీఎంకే సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసింది.
భువ నగిరి సెగ్మెంట్పరిధిలోకి వచ్చే తుంగతుర్తి స్థానం కోసం చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్యతో సహా అద్దంకి దయాకర్ పేరు ఇక్కడ పరిశీలనలో ఉంది. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా ఈ స్థానాన్ని ఆశిస్తుండడంతో స్క్రీనింగ్ కమిటీ ఎటూ తేల్చలేక పెండింగ్‌లో పెట్టింది.