కేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చార్జ్ షీట్ 

హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో ఏం చేశామో, భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పి తాము మునుగోడులో ఓట్లు అడుగుతున్నామని  అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఎనిమిదేళ్లలో ఏ వర్గానికి మేలు చేయకుండా.. ఓట్లు ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పరిపాలనను, బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ .. తాము ప్రజల తరపున కేంద్రంపై చార్జ్ షీట్ వేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. 

* ఉమ్మడి నల్గొండ జిల్లాలో  ఫ్లోరోసిస్ వ్యాధి నిర్మూళనను పట్టించుకోలేదని, మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదని, మిషన్ భగీరథ పథకానికి నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా.. నిధులు ఇవ్వనందుకు తాము చార్జ్ షీట్  వేస్తున్నామని చెప్పారు.

* చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీ, హ్యాండ్లూమ్ బోర్డును రద్దు చేశారని, యార్న్ పై సబ్సిడీ రద్దు చేసినందుకు కేంద్రంపై చార్జ్ షీట్  వేస్తున్నామని చెప్పారు.

* వ్యవసాయ బావుల వద్ద మోటర్లకు మీటర్లు పెడుతామని చెప్పారని, ఉచిత విద్యుత్ కు మంగళం పాడుదామని నిర్ణయించారని, యాదాద్రి పవర్ ప్లాంట్ కు రుణాలు రాకుండా కేంద్రం చేసిందని, అందుకే కేంద్రంపై చార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పారు. 

* కృష్ణా నది జలాల పంపకాల విషయంలో ఎనిమిదేళ్లుగా కేంద్రం రాజకీయం చేస్తోందని, అందుకే చార్జ్ షీట్  వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని కేంద్రంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

* బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ధరను 1200 రూపాయలకు పెంచారంటూ మండిపడ్డారు. ఈ విషయంలో మహిళల తరపున కేంద్రంపై చార్జ్ షీట్  వేస్తున్నామని చెప్పారు. 

* ముడి చమురు ధరలు పెరగపోయినా.. చమురు ధరలు పెంచి దేశ ప్రజలపై అధిక ధరలు మోపారని కేటీఆర్ మండిపడ్డారు. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసరాల సరుకుల ధరలను పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచినందుకు కేంద్రంపై చార్జ్ షీట్  దాఖలు చేస్తున్నామని తెలిపారు. 

* ఐదేళ్ల నుంచి గిరిజనుల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారని, అందుకే వారి తరపున కేంద్రంపై చార్జ్ షీట్  వేస్తున్నామన్నారు. 

* బీసీల జనగణన చేయమని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా.. ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నందుకు,  కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వశాఖ పెట్టనందుకు బీసీల తరపున చార్జ్ షీట్ వేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

* దేశంలోని మైనార్టీలపై దాడులు జరుగుతున్న తీరును నిరసిస్తూ.. కేంద్రంపై చార్జ్ షీట్ దాఖలు చేస్తున్నామని చెప్పారు. 

* కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ.. ‘ఉచిత పథకాలు అనుచితం’ అంటున్నారని, అందుకే కేంద్రంపై చార్జ్ షీట్  దాఖలు చేస్తున్నామని చెప్పారు. 

* ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని.. అందుకే తాము చార్జ్ షీట్  వేస్తున్నామని చెప్పారు.

* నల్లధనం తీసుకొస్తానని చెప్పి తీసుకురాలేదని, పెద్ద నోట్ల రద్ధుతో ప్రజలను కుదేలు చేశారని, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే కేంద్రం తీరును నిరసిస్తూ చార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పారు.

* తెలంగాణ విద్యారంగంపై కక్షగట్టారని, ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఒక్క కొత్త మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వలేదని, అందుకే కేంద్రంపై చార్జ్ షీట్  వేస్తున్నామన్నారు. 

* రాష్ట్ర విభజన చట్టం  ప్రకారం ట్రైబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం లేదని, రాష్ట్రానికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారని, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేశారని, విభజన చట్టానికి తూట్లు పొడిచారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.  అందుకే కేంద్రంపై చార్జ్ షీట్  వేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. 

* నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినందుకు 13 నెలల పాటు రైతులను ఇబ్బందుకులు గురి చేశారని మండిపడ్డారు.

* ‘వరి ధాన్యం కొనం. నూకలు తినాలి అని చెప్పి తెలంగాణ రైతులను అవమానించారు’ అందుకే చార్జ్ షీట్  దాఖలు చేస్తున్నామని చెప్పారు. 

* దేశాన్ని అప్పుల కుప్పగా చేసినందుకు, రూపాయి పతనం అయినందుకు చార్జ్ షీట్ వేస్తున్నామని చెప్పారు.