సెర్ప్ ఉద్యోగులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపించాలని సెర్ప్ ఉద్యోగులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. సెర్ప్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి ఎన్నికల్లో బహిరంగంగా పని చేయవచ్చని, మునుగోడులో టీఆర్ఎస్ గెలిచిన వెంటనే ఫైల్ పై సంతకం పెడుతామన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని గ్రామాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇన్ చార్జీలుగా ఉన్నారని, ఆ గ్రామాల్లో సెర్ప్ ఉద్యోగులు బాగా పని చేశారని తనకు రిపోర్ట్ ఇస్తేనే ఉద్యోగుల పే స్కేల్ ఫైల్ కదులుతుందన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ సభకు మునుగోడు నియోజకవర్గంలో విధులు నిర్వర్తించే సెర్ప్ ఉద్యోగులను వాహనాల్లో తీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కామెంట్స్ చేశారు. 

‘మునుగోడు ఉప ఎన్నికలో ఏ మాత్రం తేడా వచ్చినా మీ పని, నా పని అయిపోతుంది. ఏది చేయాలన్నా మీకు సీఎం కేసీఆర్ మాత్రమే చేస్తారు. మిమ్మల్ని కాపాడేది ఆయనే. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ ఏర్పాటుకు ఎన్నికల కోడ్ అడ్డు వస్తోంది. మీతో ఏర్పాటు చేస్తే ఏం కాదు. అందుకే మీరు బహిరంగంగా మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించేలా కృషి చేయాలె. మీ చేతుల్లోనే ఉంది. ఆల్ రెడీ ఫైల్ తయారైంది. మునుగోడులో గెలవగానే సంతకం పెడుతాం’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. ప్రచారం చేసినా మీకు ఏమీ కాదని, సెర్ప్ ఉద్యోగులకు తాను అండగా ఉన్నానని అన్నారు. తనను కాపాడే బాధ్యత మీదే అంటూ కామెంట్స్ చేశారు.