టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చేదాకా కౌంటింగ్ ప్రక్రియను జాప్యం చేస్తారా..? : లక్ష్మణ్ 

మునుగోడు ఉప ఎన్నిక లెక్కింపు ఫలితం వెల్లడించడంలో ఆలస్యం కావడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రౌండ్ ల వారీగా ఫలితాలు వెల్లడించడంలో గందరగోళం నెలకొందని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఎంఓ నుండి ఆదేశాలు వస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా..? అని ప్రశ్నించారు. అధికారులు కుంటి సాకులు చెబుతూ టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చేదాకా కౌంటింగ్ ప్రక్రియను  జాప్యం చేస్తారా..?  అని ప్రశ్నించారు. 

బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్ డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉప ఎన్నిక మొదటి రోజు నుండి కౌంటింగ్ దాకా సీఈవో పని తీరు అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సీఈవో పని చేస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ రోజు టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులోనే ఉన్నా, ఎవరూ లేరని సీఈవో చెప్పడం హాస్యాస్పదమన్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఎందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.