హైదరాబాద్, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీలు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, ఇందుకు నిరసనగా ‘ప్రజాస్వామ్యానికి పాదాభివందనం’ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించింది. శనివారం నుంచి వెయ్యి మంది నేతలు.. ఒక్కొక్కరు వంద మంది ఓటర్లను కలిసి పాదాభివందనం చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ సూచించారు. శుక్రవారం సాయంత్రం పార్టీ ముఖ్య నేతలు, మునుగోడు నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లతో జూమ్‌లో మీట్ అయ్యారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు నిస్సిగ్గుగా కాంగ్రెస్ నాయకులను కొనుగోలు చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
ఆ పార్టీల దుర్మార్గాలు వివరించండి
నేతలు ఇంటింటికీ తిరిగి ఓటరుకు పాదాభివందనం చేయాలని, బీజేపీ, టీఆర్ఎస్ దుర్మార్గాలను వివరించి చెప్పాలని రేవంత్ సూచించారు. తాను కూడా మునుగోడులో తెలంగాణ సమరయోధుల కుటుంబాలను కలిసి వందనాలు చేస్తానని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న రేవంత్.. శనివారం మునుగోడులోని పొర్లుగడ్డ తండాలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు.