నేటి నుంచి విధుల్లోకి వీఆర్ ఏలు
బై పోల్ఎఫెక్టే కారణమని ప్రచారం
హైదరాబాద్, వెలుగు : మునుగోడు బై ఎలెక్షన్ తరువాత వీఆర్ఏల హామీలు, సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో నవంబర్ 7 తరువాత వీఆర్ఏల డిమాండ్లను తీరుస్తామని హామీ ఇచ్చింది. దీంతో గురువారం నుంచి విధుల్లో పాల్గొంటామని వీఆర్ఏల ప్రతినిధి బృందం ప్రకటించింది. బీఆర్కే భవన్లో సీసీఎల్ఏ డైరెక్టర్ రజత్ కుమార్ షైనీ సమక్షంలో జరిగిన చర్చలలో వీఆర్ఏ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమేశ్ మాట్లాడుతూ.. వీఆర్ఏల డిమాండ్లపై ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు. ఎన్నికల కోడ్ ఎత్తేయగానే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీఆర్ఏలు వెంటనే విధుల కు హాజరు కావాలని కోరారు. అన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
బై పోల్ భయంతోనేనా
సీఎం కేసీఆర్ఇచ్చిన హామీలు అమలు చేయాలం టూ జూలై చివరి వారం నుంచి వీఆర్ఏల సమ్మె ఉధృతం అవుతూ వచ్చింది. గత నెలలో జరిగిన శాసనసభ సమావేశాల్లో వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అర్థంలేని సమ్మె చేస్తున్నారని అసెంబ్లీ వేదికగా వీఆర్ఏలపై కేసీఆర్ మండిపడ్డారు. ఆ తరువాత మంత్రి కేటీఆర్.. వీఆర్ఏల ప్రతినిధులతో సమావేశమై సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత ఎలాంటి స్పందన రాలేదు. మరోసారి కేటీఆర్‌తో వీఆర్ఏ ప్రతినిధులు భేటీ అయ్యారు. అయినప్పటికీ ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో వీఆర్ఏలు తమ ఆందోళనను ఉధృతం చేశారు.
మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నిరసన చేపట్టారు. పోలీసులు మహిళా వీఆర్ఏలు అని కూడా చూడకుండా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లలో ఉంచారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే మునుగోడులో నామినేషన్లు వేయాలని వీఆర్ఏలు భావించారు. వీఆర్ఏల సమ్మె ప్రభావం బై పోల్‌పై ఎక్కడ పడుతుందోనని ప్రభుత్వం భయడినట్టు సమాచారం. అందుకే బుధవారం సమస్యల పరిష్కారానికి ఓకే చెప్పినట్లు తెలిసింది.