మునుగోడులో గల్లీ గల్లీలో లిక్కర్​

  • అక్కడే తాగుడు, బుక్కుడు, దుంకుడు..
  • మొన్నటి దాకా రోజూ రూ.2.5 లక్షల విక్రయాలు..ఇప్పుడు 4.50 లక్షలపైనే
  • నియోజకవర్గంలో ఇప్పటికే 1,3‌‌‌‌00కుపైగా బెల్టుషాపులు
  • బై పోల్​ వస్తుండటంతో కొత్తగా మరిన్ని ఏర్పాటు
  • కిరాణాషాపులు, పాన్​ డబ్బాల్లోనూ జోరుగా అమ్మకాలు 


షాపుల్లోనే సిట్టింగులు

ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి ఊరూరా సిట్టింగులు జోరందుకున్నాయి. పర్మిట్ రూమ్ ల్లోనే గాక బెల్టుషాపులు, కిరాణా షాపుల ముందే లిక్కర్​ తాగుతున్నారు. మునుగోడు నియోజక వర్గంలోని ఆరు మండలాల పరిధిలో 157 గ్రామాలు ఉండగా.. పాత లెక్కల ప్రకారం సగటున ఊరికి ఐదారు బెల్టు షాపులు ఉన్నాయి. కానీ, ఉప ఎన్నిక నేపథ్యంలో కొత్తగా మరిన్ని బెల్టు షాపులు పుట్టుకొస్తు న్నాయి. ఇప్పటికే తక్కువలో తక్కువ ఊరికి పది బెల్టు షాపులు తయారయ్యాయి. ఎన్నికల ప్రచారం జోరందుకునేసరికి 20కి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని స్థానికులు అంటున్నారు. రెగ్యులర్ ​బెల్టుషాపులు కాకుండా కిరాణా షాపుల వద్ద లిక్కర్​ అమ్ముతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

నల్గొండ, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో గల్లీ గల్లీకి బెల్టుషాపులు పుట్టుకొస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పప్పు, ఉప్పు, కూల్​డ్రింకులు అమ్మిన కిరాణా షాపుల్లోనూ ఇప్పుడు లిక్కర్​, బీర్లు దర్జాగా అమ్ముతున్నారు. వైన్ షాపులకు అనుబంధంగా ఒక్కో ఊరిలో ఇప్పటికే సగటున ఐదారు బెల్టుషాపులు ఉండగా.. కొత్తగా మరిన్ని వెలుస్తున్నాయి. చాలా గ్రామాల్లో వైన్స్  యజమానులే కొత్తగా బెల్టుషాపులు తెరుస్తున్నారు. అవి కూడా సరిపోని చోట కిరాణా షాపుల్లో, పాన్​ డబ్బాల్లోనూ లిక్కర్​ అమ్మిస్తున్నారు. ఎమ్మార్పీపై రూ. 20 నుంచి 50 దాకా వస్తుండటంతో కిరాణా యజమానులు కూడా మద్యం అమ్మేందుకు ముందుకు వస్తున్నారు. షాపుల ముందే సిట్టింగ్​లు నడుస్తున్నాయి. అక్కడే తాగి, అక్కడే బుక్కి, అక్కడే దుంకుతుండటంతో బయటకు రావాలంటే మహిళలు భయపడుతున్నారు.  

వ్యాపారులకు టార్గెట్లు
మునుగోడు నియోజకవర్గంలో మొత్తం జనాభా 2 లక్షల 90వేల 229. త్వరలో ఇక్కడ ఉప ఎన్నిక జరుగనుండటంతో అన్ని పార్టీలు స్పెషల్​ ఫోకస్​ పెట్టాయి. నోటిఫికేషన్​ రానప్పటికీ తోచిన రీతిలో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ప్రధాన పార్టీల ఇన్​చార్జులు కేడర్​తో మీటింగుల మీద మీటింగులు పెడ్తున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా వారిని బుజ్జగిస్తున్నారు. ఎక్కడ మీటింగులు ఉంటే అక్కడికి కాటన్లకొద్దీ మద్యం దిగుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం నియోజకవర్గంలో 20 వైన్స్​, ఆరు బార్లు ఉన్నాయి. 1,300కుపైగా బెల్టుషాపులు నడుస్తున్నాయి. 

29 రోజుల్లో 1.11 లక్షల పెట్టెలు ఖాళీ..
ఆగస్టు 1 నుంచి 29 వరకు చండూరు, నాంపల్లి, రామన్నపేట ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో 1,11,279 పెట్టెల మద్యం అమ్ముడుపోయింది. దీంట్లో లిక్కర్ 39,695 పెట్టెలు, బీర్లు 71,584 పెట్టెలు ఉన్నాయి. వీటి పరిధిలో మునుగోడు, మర్రిగూడ, నారాయణ్​పూర్, చౌటుప్పల్ మండలాలు ఉన్నాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ 29 రోజుల్లో జరిగిన అమ్మకాలతో సర్కార్​కు 2.17 కోట్ల ఎక్కువ ఇన్​కమ్​ వచ్చింది.  చండూరు పరిధిలో లిక్కర్ 12,142 పెట్టెలు, బీర్లు 21,244 పెట్టెలు అమ్ముడు కాగా.. ఆదాయం రూ.13.11 కోట్లు వచ్చింది. నాంపల్లి పరిధిలో లిక్కర్ 12,692 పెట్టెలు, బీర్లు 19,940 పెట్టెలు అమ్ముడు పోగా.. ఆదాయం రూ.13.26 కోట్లు వచ్చింది. రామన్నపేట సర్కిల్ పరిధిలో లిక్కర్  14,861 పెట్టెలు, బీర్లు 30,400 పెట్టెలు అమ్ముడు కాగా, రూ.16.82 కోట్ల ఆదాయం వచ్చింది. 

బై పోల్​ నేపథ్యంలో లిక్కర్ సేల్స్ పెంచాలని మద్యం వ్యాపారులకు ఎక్సైజ్ శాఖ టార్గెట్​ పెట్టింది. టార్గెట్​ రీచ్​ అయ్యేందుకు వాడవాడలా బెల్టుషాపులను వ్యాపారులు తెరిపిస్తున్నారు. గత నెల వరకు నియోజకవర్గంలో రోజూవారీ మద్యం అమ్మకాలు సగటున రూ. 2.5 లక్షలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు రూ. 4.50 లక్షలకు చేరుకున్నాయి. రిటైల్​ కంటే బెల్టుషాపులు, కిరాణాషాపుల్లో సేల్స్​ ద్వారానే ఎక్కువ గిట్టుబాటు అవుతుండడంతో మద్యం వ్యాపారులు కూడా గ్రామాల్లోకి లిక్కర్​ డంప్​ చేస్తున్నారు. ముఖ్యంగా బెల్టుషాపులు, కిరాణా షాపులకు ఛీప్​ లిక్కర్​ రకాలతో పాటు రాయల్ స్టాగ్, ఇంపిరియల్ బ్లూ, బీర్లలో కింగ్​ఫిషర్​, ఓసీ లాంటి  మీడియం బ్రాండ్లను పంపిస్తున్నారు.