హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్యెల్యే పాడి కౌశిక్ రెడ్డి, శేరిలింగపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇష్యూ స్టేట్ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతల అరెస్ట్ నేపథ్యంలో ఇవాళ (సెప్టెంబర్ 13) ఎమ్మెల్యే గాంధీ ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అలర్ట్ అయ్యారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంటికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటుండగా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేస్తు్న్నారు.
ఇప్పటికే శంభీపూర్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఉద్రిక్తతకు కారణమైన ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ నివాసాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. గాంధీ ఇంటిని ముట్టడిస్తామన్న నేపథ్యంలో బాలానగర్ డీసీపీ సురేష్ ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద నివాసం వద్ద కూడా పోలీసులను భారీగా మోహరించారు. ఎమ్మెల్యే నివాసానికి చేరుకుంటున్న గులాబీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు. మరోవైపు అధిష్టానం పిలుపు మేరకు హైదరాబాద్‌కు చేరుకుంటున్న బీర్ఎస్ నేతలను సైతం పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గాంధీ, కౌశిక్ రెడ్డి ఇష్యూ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ వేడెక్కించింది.