వెలుగు సక్సెస్: తొలి వేదకాల సమాజం

వెలుగు సక్సెస్: తొలి వేదకాల సమాజం

రుగ్వేద కాలపు సమాజం పితృస్వామ్య సమాజం. తండ్రిని గృహపతి లేదా దంపతి అని పిలిచేవారు. రుగ్వేద ఆర్యుల కుటుంబం సమష్టి కుటుంబం. ఆర్​.ఎస్​.శర్మ ప్రకారం రుగ్వేద కాలపు సమాజం గిరిజన, సర్వ సమానత్వ లక్షణాలు కలిగి ఉంది. కుల వ్యవస్థ ఏర్పడలేదు. కానీ, వర్ణ వ్యవస్థ ఉంది. అంటే అస్పృశ్యత లేని సమాజం కనిపించేది. తొలివేద సమాజంలో వర్గ విభజనకు ముఖ్య ఆధారం వృత్తుల మీద ఆధారపడి మాత్రమే కాని కులాల మీద ఆధారపడి కాదు. పురుషసూక్తం కాకుండా చాతుర్వర్ణ వ్యవస్థను బృహదారణ్యకోపనిషత్తు, మనుస్మృతి, మహాభారతం గ్రంథాలు ప్రస్తావించాయి.

రుగ్వేదంలో వివిధ వర్ణాల గురించి బ్రాహ్మణులు (14 సార్లు), క్షత్రియులు (9 సార్లు), వైశ్యులు ( 171 సార్లు), శూద్రులు (ఒకసారి) పేర్కొంది. పై నాలుగు వర్ణాల వారు ఒక వృత్తిని వదిలి మరో వృత్తిని స్వీకరించవచ్చు. ఇందుకు ఉదాహరణగా రుగ్వేదంలోని తొమ్మిదో మండలంలో మా నాన్న వైద్యుడు, మా అమ్మ పిండి రుబ్బుతుంది, నేను ఒక రచయితను అని పేర్కొనడం వల్ల ఒకే కుటుంబంలో అనేక వృత్తుల వారు ఉన్నట్లు అర్థమవుతుంది. సహపంక్తి భోజనాలు ఉండేవి. వివిధ జాతుల మధ్య వివాహాలు తొలివేద కాలంలో జరిగేవి అనడానికి ఉదాహరణ క్షత్రియుడైన మయాతి, బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానిని వివాహమాడటం. రుగ్వేద కాలంలో అనులోమ, ప్రతిలోమ వివాహాలు ఉండేవి. 

స్త్రీ స్థానం

రుగ్వేద కాలంలో స్త్రీ సమానత్వం కనిపిస్తుంది. స్త్రీ స్వతంత్రంగా వ్యవహరించేది. రుగ్వేదకాలంలో పరదా పద్ధతి పాటించలేదు. వీరికి తమ జీవిత భాగస్వాములను ఎన్నుకొనే హక్కు కలిగి ఉంది. రుగ్వేద వివాహ వ్యవస్థలో సాధారణ అంశం ఏక పత్నీవ్రతం. కానీ కొన్ని సందర్భాల్లో బహు వివాహ వ్యవస్థ (బహు భర్తృత్వం, బహు భార్యత్వం) ఉండేది. బహుభర్తృత్వ వ్యవస్థకు ఉదాహ రణగా సూర్యుడి కూతురు, అశ్విన్​ సోదరులను పెళ్లి చేసుకుంది. అలాగే, రోదసి, మారుత్​ సోదరులను వివాహం చేసుకుంది. బాల్య వివాహాలు లేవు. 
స్త్రీకి యుక్త వయస్సు వచ్చిన తర్వాతనే వివాహం ఉండేది. రాజకీయంగా సభ, విధాతలలో మహిళలకు ఉన్నత పదవులు ఉండేవి. రుగ్వేదంలోని శ్లోకాల్లో దాదాపు 20 మంది కవయిత్రుల గురించి పేర్కొన్నారు. అందులో ముఖ్యమైన వారు అపల, విశ్వభర, లోపముద్ర, స్వయంవర, ఘోష.

సామాజిక ఆచారాలు

నియోగ: రుగ్వేద కాలంలో నియోగ విధానం అమలులో ఉండేది. అంటే సంతానం లేని యువతి భర్త సోదరుని ద్వారా సంతానం పొందడం. నియోగ విధానం అమలైనట్లు తెలుస్తోంది. కానీ, వితంతు పునర్వివాహాలకు ఆధారాలు లభించలేదు.

సతీసహగమనం: రుగ్వేద కాలంలో సతీసహగమనం ఉంది. కానీ,  తప్పనిసరి కాదు. 

బానిస వ్యవస్థ: రుగ్వేద కాలంలో బానిస వ్యవస్థ ఉండేది. ఈ బానిసలను ఇళ్లల్లో పనులకు ఉపయోగించేవారు. బానిసలు ఉత్పత్తి రంగంలో ఉపయోగించినట్లు ఆధారాలు లభించలేదు. సంస్కృతి: రుగ్వేద ఆర్యులు ప్రత్తి, నూలుతో చేసిన వస్త్రాలు ధరించేవారు. సాధారణంగా ఆర్యులు అధికంగా అన్ని బట్టలు ధరించారు. కాగా, రుగ్వేద స్త్రీ పురుషులు ఇరువురు వస, అధివస అనే వస్త్రాలను ధరించేవారు. ఆర్యులు ధరించిన ఆభరణాల్లో అతి ప్రధానమైంది నిష్కం.

ఇండో యురోపియన్​ భాషా కుటుంబం

సంస్కృతం, దానితో సంబంధం గల ఇతర భాషలన్నింటి కుటుంబం. 18వ శతాబ్దంలో ఇండో యూరోపియన్​ భాషలకు మూల భాష ఒకటి ఉందని సర్​ విలయమ్​ జోన్స్ కనుగొన్నారు. ఆసియాలోని ఇండో యూరోపియన్​ భాషలు మూడు. అవి.. 1. సంస్కృతం, 2. పారశీక 3. తురక. ఇండో యూరోపియన్​ భాషలకు ఆర్య భాషలుగా ప్రొఫెసర్​ మాక్స్​ముల్లర్​ నామకరణం చేశారు. ఆర్యులు ఉపయోంచిన సంస్కృత భాషకు, ఇండో యూరోపియన్​ భాషలకు మధ్యగల సారూప్యతను ఫిలపోస సతి మొదటిసారి గుర్తించారు. 

 మత వ్యవస్థ

రుగ్వేద మతాన్ని మోనోథీయిజమ్​ లేదా మోనిజమ్​ అని చెప్పవచ్చు. అంటే భగవంతుడు ఒక్కడే రూపాలు వేరు అన్న భావన. తొలివేద ఆర్యులు బహు దేవతారాధన, ఇష్ట దేవతారాధన దిశ నుంచి ఏకేశ్వరోపాసనకు మారినట్లు రుగ్వేదంలోని పదో మండలం తెలుపుతుంది. ఈ కాలంలో 33 మంది దేవుళ్లు, దేవతలు ఉన్నారు. ప్రకృతి నుంచి కాపాడుకోవడానికి ప్రకృతి శక్తులను పూజించారు. ప్రకృతి శక్తులను మానవ రూపాలను ఇచ్చి పూజించడం జరిగింది. విధ్వంసకర, ప్రకోపాత్మక శక్తులకు పురుష రూపాలు, సౌందర్యం, ప్రశాంతత కలిగిన స్త్రీ రూపాలకు స్త్రీ దేవతల రూపాలనిచ్చారు. విగ్రహారాధన లేదు. కాబట్టి దేవాలయాలు కూడా లేవు. రుగ్వేదకాలంలో సూర్యుడు వివిధ రూపాల్లో ఆరాధింపబడ్డాడు. దేవతలు అనే పదానికి మూలం దివ్​ అనే సంస్కృత ధాతువు. దివ్​ అంటే ప్రకాశించడం అని అర్థం. తమ దేవతలను మూడు వర్గాలుగా విభజించి ఆరాధించారు. తొలివేద ఆర్యుల దేవతా వర్గాలు: స్వర్గ దేవతలు, అంతరిక్ష దేవతలు, భూదేవతలు. 

అనులోమ వివాహం: ఉన్నత వర్గం లేదా కులంలోని పురుషుడు దిగువ వర్గం లేదా కులంలోని స్త్రీని వివాహం చేసుకోవడం. 

ఉదా: నిషాద

ప్రతిలోమ వివాహం: దిగువ వర్గం లేదా కులం లోని పురుషుడు ఉన్నత వర్గం లేదా కులంలోని స్త్రీని వివాహం చేసుకోవడం. ఉదా: చండాల

చంద్రయాన తపస్సు: ఒకే తరగతికి చెందినవారు వివాహం చేసుకుంటే భార్యను నెల రోజులపాటు సోదరి సమానంగా భావించి ఆ తర్వాత భార్యను స్వీకరించడం. 

పురుషులతో సమాన స్థాయిలో రుషి స్థాయి ఇవ్వబడిన విదుషీమణులు లోపముద్ర, విశ్వవర, ఘోష, అపల గార్గి.

విశ్వందినులు అంటే జీవితాంతం వరకు విద్యకు అంకితం అయ్యేవారు. రుగ్వేద కాలం నాటి ఓటమి ఎరుగని మహాపండితుడు యజ్ఞవల్కుడు. ఈయన జనకుడి కొలువుకు చెందినవాడు. 
ఆత్మపునరుజ్జీవనం అనే సిద్ధాంతాన్ని మొదటిసారిగా బృహదారణ్యకోపనిషత్తులో ప్రస్తావించాడు. ఇతడిని గార్గి వేదాంత చర్యలో సవాల్​ చేసింది.