
ఎర్త్ డే. ఓఆర్ జి (EARTH DAY.ORG) అనే అమెరికా దేశానికి చెందిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ‘ధరిత్రి దినోత్సవాన్ని’ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న నిర్వహిస్తోంది. 1970వ సంవత్సరంలో మొట్టమొదట ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ 22, 2025 నాటికి ధరిత్రి దినోత్సవం 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలు, ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు ధరిత్రి దినోత్సవంలో పాల్గొంటారని అంచనా. 2025 ధరిత్రి దినోత్సవం ఇతివృత్తం ‘మన శక్తి, మన గ్రహం’.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ పునరుత్పాదకశక్తి వినియోగానికి తోడ్పడాలని, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన పర్యావరణ అనుకూల విద్యుత్ ఉత్పత్తిని మూడు రెట్లు పెంచాలని, 2025 సంవత్సర ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ పిలుపునిచ్చింది. పునరుత్పాదక శక్తి వనరులు (రెన్యువబుల్ ఎనర్జీ) అపరిమితమైన శక్తి వనరులకు ఉదాహరణలు సౌరశక్తి, పవన విద్యుత్, జీవ ఇంధనాలు మొదలగునవి. పునరుత్పాదకం కానీ లేదా పునరుద్ధరించలేని శక్తి వనరులు (నాన్ రెన్యువబుల్ ఎనర్జీ) తిరిగి నింపలేని లేదా తిరిగి పొందలేని పర్యావరణానికి హాని కలిగించే శక్తి వనరులకు ఉదాహరణలు బొగ్గు, పెట్రోల్, శిలాజ ఇంధనాలు మొదలగునవి. ఇవి గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేయటం వలన ‘గ్లోబల్ వార్మింగ్’ పెరిగి వాతావరణ మార్పులు సంభవిస్తాయి.
అమెరికా, చైనా భారీ పెట్టుబడులు
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ పునరుత్పాదకశక్తి వినియోగాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా చైనా, అమెరికా పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. చైనా ప్రస్తుతం పవన, సౌరవిద్యుత్ రెండింటిలోనూ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఉరుగ్వే దేశం పునరుత్పాదకశక్తి వనరుల నుంచి 98% విద్యుత్తును ఉత్పత్తి చేసే స్థాయికి మారింది. భారతదేశం పునరుత్పాదక శక్తి వినియోగం కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందులో భాగంగా 2030 నాటికి దాని శక్తి అవసరాలలో 50% పునరుత్పాదకశక్తి వనరుల నుంచి సాధించాలని, 2030 నాటికి CO2 ఉద్గారాలను ఒక్క బిలియన్ టన్ను తగ్గించాలని, 2070 నాటికి నికర-సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది.
కెన్యా దాని విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు సగం జియోథర్మల్ విద్యుత్ ద్వారానే పొందుతున్నది. డెన్మార్క్ దేశంలో 50% కంటే ఎక్కువ విద్యుత్తు పవన శక్తి నుంచి ఉత్పత్తి అవుతుంది. 2026 నాటికి, స్పెయిన్‌లో 30%, నెదర్లాండ్స్‌లో 17%, జర్మనీలో 23% విద్యుత్ ను పవన శక్తి నుంచి పొందనున్నాయి. గత కొద్దికాలంగా పునరుత్పాదక ఇంధన ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. గత దశాబ్దంలో సౌరఫలకాల తయారీ ఖర్చు తగ్గిపోయినది. దీనివల్ల అవి అందుబాటులో ఉండటమే కాకుండా, చౌకైన విద్యుత్ తయారీ సులభతరం అవుతున్నది. 2010 – 2020 మధ్య సౌర ఫలకాల ధరలు 93% వరకు తగ్గాయి.
రెన్యువబుల్ ఎనర్జీతో ఆర్థిక ప్రయోజనాలు
రెన్యువబుల్ ఎనర్జీ కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు - ఇది ఒక ఆర్థిక విప్లవం. పునరుత్పాదక శక్తి- పరిశ్రమలు, రవాణా, వ్యవసాయ రంగం తదితర రంగాలలో విస్తరించి ఉన్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ కొత్త ఉద్యోగాలు, అవకాశాలను సృష్టిస్తుంది. 2022లో విడుదలైన 13వ అమెరికా జాతీయ సౌర ఉద్యోగుల సంఖ్య గణన ప్రకారం, అమెరికా అంతటా 2,63,883 మంది సౌరశక్తి కార్మికులు ఉన్నారు. వారు సౌర ఫలకాల తయారీ, పంపిణీ, నిర్వహణ కోసం పనిచేస్తున్నారు. ఇది 2021తో పోలిస్తే సౌర ఉద్యోగాలలో 3.5% వృద్ధిని సూచిస్తుంది. పునరుత్పాదక శక్తి భారీ ఆర్థిక అవకాశాలని సృష్టిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా 14 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. 2022 – 2030 మధ్య క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు అమెరికా కుటుంబాలకు $27-–$38 బిలియన్లను ఆదా చేయగలవు. ‘మన శక్తి, మన గ్రహం’అనే 2025 సంవత్సర ధరిత్రి దినోత్సవం ఇతివృత్తాన్ని ప్రజలకి తెలియచేసి, పునరుత్పాదక శక్తిని ఉపయోగించుకోవటం ద్వారా మనమందరం ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన భవిష్యత్తును నిర్మించుకోవటానికి, భూమిని వాతావరణ మార్పుల నుంచి రక్షించుకోవటానికి, ప్రజలను విజ్ఞానవంతులను చేయవలసిన బాధ్యత మనపై ఉన్నది.
పునరుత్పాదక శక్తి ప్రయోజనాలు
3.8 బిలియన్ల మంది ప్రజలు మోడరన్ ఎనర్జీ కనిష్టతను చేరుకోలేకపోతున్నారు, అంటే వారి తలసరి విద్యుత్ వినియోగం 1,000 కిలోవాట్- గంటలు కంటే తక్కువగా ఉంది. ఇది పేదరికాన్ని తగ్గించడానికి ఒక పరిమితి. పునరుత్పాదక శక్తి ఈ పరిస్థితిని, జీవన ప్రమాణాలను, ఆరోగ్య ప్రయోజనాలను మెరుగుపరుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం పునరుత్పాదక శక్తి, వాయు కాలుష్యాన్ని తగ్గించటం వలన ఆస్తమా, బ్రోన్కైటిస్, గుండెపోటు, స్ట్రోక్‌లతో సహా శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులు గణనీయంగా తగ్గిపోతాయి. మహిళల ఆరోగ్యం, వాయు కాలుష్యం వల్ల ప్రభావితమవుతుంది.
ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్, అండాశయ వ్యాధులు తల్లి ఆరోగ్య ప్రమాదాలు మొదలగునవి తగ్గిపోతాయి. పునరుత్పాదక శక్తి వినియోగం వలన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు తగ్గి వాతావరణ మార్పులతో సంబంధం ఉన్న వేడిగాలులు, వరదలు, అంటు వ్యాధుల వ్యాప్తి వంటి సమస్యలు నివారించపడతాయి. వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు (CDC) ప్రకారం పునరుత్పాదకశక్తి వలన వాయు కాలుష్యం, వాతావరణ మార్పు, పర్యావరణ విపత్తులతో సంబంధం ఉన్న ఒత్తిడి, ఆందోళనలు తగ్గటం ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.
-డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ఎన్విరాన్మెంటల్ సైన్సెస్