మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్ రిపేర్ మట్టికట్ట తొలగింపు

  • 16 వేల క్యూసెక్కుల వాటర్ కిందికి

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ రిపేర్ కోసం నిర్మించిన మట్టికట్టను తొలగిస్తున్నారు. బ్యారేజీ కుంగిన తర్వాత నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన ఆదేశాల మేరకు బ్లాక్ లో పనులన్నీ పూర్తిచేయడం కోసం ఎడో బ్లాక్ లోకి వాటర్ రాకుండా ఈ మట్టికట్టను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏడో బ్లాక్ లో గ్రౌటింగ్ పనులు పూర్తి చేసి బ్యారేజీలో ఉన్న మొత్తం 85 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. రిపేర్లలో భాగంగా డౌన్ స్టీమ్ లో షీట్ ఫైల్స్ ఏర్పాటు చేశారు. సీసీ బ్లాక్ ను రివిటింగ్ ను ఏర్పాటు చేసి ఆఫ్రాన్ తో పూర్తిచేశారు.

ప్రస్తుతం గోదావరిలో వరద పెరుగుతుండడంతో పనుల కోసం ఏర్పాటుచేసిన మట్టికట్టను ఎల్ అండ్ టీ కంపెనీ వారు తొలగిస్తున్నారు. ఇన్ని రోజులు ఏడో బ్లాక్ కింది నుంచి వాటర్ వెళ్తే పిల్లర్ కింది నుంచి ఊటపడి డౌన్ స్ట్రీమ్ లో వాటర్ బయటికి వెళ్లేది. ఇప్పుడు ఏడో బ్లాక్ లో ఏర్పడిన అన్ని హోల్స్ ని సిమెంట్, ఇసుక, కెమికల్ మిక్సింగ్ తో గ్రౌటింగ్ చేశామని, ప్రస్తుతం ఎలాంటి లీకేజీలు లేవని ఓ ఇంజినీరు తెలిపారు. వాటర్ ఆపడం వల్ల బ్యారేజీకి ఏర్పడిన ప్రమాదం ఫ్లోటింగ్ వాటర్ వల్ల ఉండదని స్పష్టం చేశారు. అందుకే సెంట్రల్ బృందం.. 85 గేట్లను ఎత్తి వాటర్ ను కిందికి వదలాలని ఆదేశించిందని ఆ ప్రకారం పనులన్నీ పూర్తి చేశామని చెప్పారు.

గోదావరి, ప్రాణహిత నదులకు ప్రారంభమైన వరద 

బ్యారేజీ వద్ద మొత్తం 85 గేట్లు ఎత్తి.. పైనుంచి వచ్చే వాటర్ ను కిందికి వదులుతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల గోదావరి, ప్రాణహిత నదులకు వరద ప్రారంభమైంది. గురువారం మేడిగడ్డ బ్యారేజీకి బుధవారం 8వేల క్యూసెక్కుల వాటర్ రాగా.. గురువారానికి 16 వేల క్యూసెక్కుల కు చేరింది. ఈ సీజన్ లో మొదటిసారి ఒక టీఎంసీకి పైగా నీళ్లు మేడిగడ్డ బ్యారేజీ నుంచి కిందికి వెళుతున్నాయి. బ్యారేజీలో ఈసారి వాటర్ స్టోరేజీ లేదు కాబట్టి 85 గేట్లు సీజన్ మొత్తం ఎత్తి ఉంచనున్నారు.