ప్రకాశం: ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూకంపం ఆ జిల్లా వాసులను బెంబేలెత్తిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు రోజుల నుంచి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపిస్తుండటంతో జనం భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణక్షణం టెన్షన్తో జీవనం సాగిస్తున్నారు.
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. మూడు రోజులుగా ప్రకాశం జిల్లాలోని ఒకే ప్రాంతంలో.. ముండ్లమూరులో వరుస భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ ఊళ్లో జనానికి టెన్షన్తో ముచ్చెమటలు పడుతున్న పరిస్థితి. ఇవాళ(డిసెంబర్ 23, 2024) కూడా ఈ ఊరిలో భూమి కంపించింది. వరుసగా మూడో రోజు కంపించడంతో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. సోమవారం ఉదయం 10.35 గంటల సమయంలో భూమి కంపించింది.
కొన్ని రోజుల క్రితమే ఏపీ, తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న ఉదయం 7 గంటల సమయంలో ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, హైదరాబాద్, విజయవాడ, జగ్గయ్యపేట, రంగారెడ్డి, కృష్ణా జిల్లాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఈ పరిణామంతో జనం ఉలిక్కిపడి భయంతో వణికిపోతూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది.
భూకంప తీవ్రత విషయానికొస్తే.. రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఉదయం 7.27కి భూప్రకంపనలు మొదలైనట్లు కొన్ని ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలతో స్పష్టమైంది. ములుగు జిల్లా ఐలాపూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. తెలంగాణ వ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్పై 5.3 నమోదు కాగా, మూడు సెకన్లు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.