
దిస్పూర్: ఈశాన్య రాష్ట్రం అస్సాంలో భూకంపం సంభవించింది. గురువారం (ఫిబ్రవరి 27) తెల్లవారుజూమున మోరిగావ్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. గురువారం (ఫిబ్రవరి 27) తెల్లవారుజామున 2:25 గంటలకు 16 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపింది. మోరిగావ్తో పాటు గౌహతిలోనూ భూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్సీఎస్ వెల్లడించింది.
అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా భూ ప్రకంపనలు రావడంతో జనం ఉలిక్కిపడ్డారు. కాసేపటి దాకా ఏం జరుగుతుందో అర్థంకాక భయాందోళనకు గురయ్యారు. నిద్రమత్తు నుంచి తేరుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భూకంప ప్రభావిత ప్రాంత ప్రజలకు పలు సూచనలు జారీ చేసింది. కాగా, ఇటీవల దేశంలో చోటు చేసుకుంటున్న వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ఇటీవల భారత్ పొరుగు దేశం టిబెట్, నేపాల్ లో భారీ భూకంపాలు సంభవించి భారీగా ప్రాణ నష్టం జరగగా.. వారం రోజుల క్రితం వెస్ట్ బెంగాల్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే.. అస్సాంలో తాజా వచ్చిన భూకంపం చిన్నదేనని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధికారులు పేర్కొనడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.