50 ఏండ్ల తర్వాత ఆ స్థాయిలో.. ములుగు కేంద్రంగా తెలంగాణలో భూకంపం

50 ఏండ్ల తర్వాత ఆ స్థాయిలో.. ములుగు కేంద్రంగా తెలంగాణలో భూకంపం

=రాష్ట్రంలో భూకంపం

= రిక్టర్ స్కేలుపై 5.3 మ్యాగ్నిట్యూడ్ గా నమోదు
= ఉదయం 7.27 గంటలకు పలు సెకన్ల పాటు కంపించిన భూమి
= ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూ ప్రకంపనలు
= 40 కిలోమీటర్ల లోతు నుంచి రేడియేషన్
= ఏపీలోని పలు  ప్రాంతాల్లోనూ  
= విజయవాడలో 5 సెకన్ల పాటు ఎర్త్ క్వేక్


హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.  దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుకు జిల్లా మేడారం కేంద్రంగా ఈ భూకంపం కేంద్రీకృతమైంది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైంది. ఉదయం 7.27 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్‎లోని   జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్, బోరబండ, రాజేంద్రనగర్​, వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లో, రంగారెడ్డి జిల్లాలో భూమి కంపించింది. 

దీంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. అటూ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో కూడా భూమి కంపించింది. దాదాపు భూమి లోపల 40 కిలోమీటర్ల లోతు నుంచి రేడియేషన్ వచ్చినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. 

ఇప్పటి వరకు 13 సార్లు

హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 సార్లు  భూ కంపాలు వచ్చినట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. 1843, 1876, 1982, 1993లలో సంభవించిన భూప్రకంపనలను అంచనా వేయగా.. తక్కువ తీవ్రతతో ఏర్పడినట్లుగా నిర్ధారించారు. ఏప్రిల్ 2020లో రామగుండం ప్రాంతంలో 4.8 రిక్టర్ స్కేల్ నమోదైందని ఎన్జీఆర్ఐ గణాంకాలు చెబుతున్నాయి.  2022లో గచ్చిబౌలి ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత 3.8గా నమోదైంది. రిక్టర్ స్కేల్‎పై  సూక్ష్మస్థాయి భూప్రకంపనాలతో వచ్చే నష్టం కూడా ఉండదని, మౌలిక నిర్మాణాలపై ఏమాత్రం ప్రభావం చూపదని పేర్కొన్నారు. 

50 ఏండ్ల క్రితం 5.7

1969లో ఏప్రిల్ 13న  భద్రాచలం పరిసరాల్లో ఇంత కన్నా ఎక్కువ తీవ్రతతో భద్రాచలం కేంద్రంగా భూకంపం సంభవించింది. సుమారు 50 ఏళ్ల తర్వాత నేడు ఆ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్పారు. అప్పుడు రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత నమోదైందని అంటున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్పుడప్పుడు భూమి కంపించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.  

భయపడొద్దు

భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు తెలిపారు.హైదరాబాద్‌, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్‌-3లో ఉన్నాయన్నారు. జోన్‌-5లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఏపీలోనూ ప్రకంపనలు

ఆంధ్రప్రదేశ్‎లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టయగూడెం, టి.నరసాపురం మండలం బొర్రాంపాలెం, జంగారెడ్డిగూడెం సహా పలు ప్రాంతాల్లో ఉదయం 7.27 గంటలకు ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది. జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండ్ రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించటంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వెళ్లామని స్థానికులు తెలిపారు.