ములుగు, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ములుగు జిల్లాలో బుధవారం ఉదయం భూమి కంపించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.3గా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఉదయం 7.20 గంటల ప్రాంతంలో సుమారు 3 సెకన్ల మేర భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం కేంద్రీకృతంగా భూకంపం వచ్చినట్లు ప్రచారం జరుగుతుండగా జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భూమి కంపించడంతో తాను సైతం ఆందోళనకు గురయ్యానని, ఇంటి నుంచి బయటకు వచ్చానని కలెక్టర్ వెల్లడించారు. జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. తాడ్వాయి మండలంలో ఆగస్టు 31న టోర్నడో మాదిరి విపరీత గాలుల ద్వారా వేల సంఖ్యలో భారీ వృక్షాలు నేలకూలడం దీనికి సంకేతమంటూ ప్రచారం జరుగుతోంది.
గోదావరి పరీవాహక ప్రాంతంలో భూమి కంపించడం పట్ల ఇసుకను అధిక మోతాదులో తీయడం, బొగ్గును వెలికితీయడంతోనే పర్యావరణం అసమతుల్యంగా మారి ఈ సంఘటన జరిగినట్లు చర్చించుకుంటున్నారు. భూకంపం మరోసారి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
భూకంపంతో..వణికిన గ్రేటర్ వరంగల్
వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్‌లో స్వల్ప భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 05 నుంచి 10 సెకన్ల పాటు భూమి కంపించిటనట్లు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు. రూరల్ మండలాల్లో కూడా ఇండ్లు కదిలినట్లు ప్రజలు చెబుతున్నారు.