మయన్మార్‎లో మళ్లీ భూ కంపం.. రిక్టర్ స్కేల్‎పై 4.3 తీవ్రత నమోదు

మయన్మార్‎లో మళ్లీ భూ కంపం.. రిక్టర్ స్కేల్‎పై 4.3 తీవ్రత నమోదు

నైపిడా: ఇటీవల సంభవించిన వరుస భూకంపాలు మయన్మార్‎ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. గంటల వ్యవధిలోనే వచ్చిన భారీ కంపాలకు మయన్మార్ అతలాకుతలం అయ్యింది. భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఫ్లై ఓవర్లు, వంతెనలు నేలమట్టం అయ్యాయి. రోడ్లు చెల్లాచెదురు అయ్యాయి. మయన్మార్‎లో భూకంప సృష్టించిన ప్రళయానికి ఇప్పటికే దాదాపు 2500 మంది చనిపోయారు. వేల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. భూకంప ధాటికి మయన్మార్ శ్మశానవాటికను తలపిస్తోంది.

దేశంలో ఎక్కడ చూసిన కూలిపోయిన భవనాలు, ధ్వంసమైన రోడ్లు, సర్వం కోల్పోయి రోడ్ల మీద పడ్డ ప్రజలే దర్శనమిస్తున్నారు. భవన శిథిలాల కింద ఇంకా అధికారులు సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ విషాదం నుంచి మయన్మార్ ప్రజలు ఇంకా తేరుకోకముందే.. తాజాగా ఆ దేశంలో మరోసారి భూకంపం వచ్చింది. బుధవారం (ఏప్రిల్ 2) రిక్టర్ స్కేల్‎పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉందని వెల్లడించింది. 

ఈ భూకంపం ధాటికి ప్రస్తుతానికైతే ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. కానీ ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస భూకంపాలతో మయన్మార్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కు బిక్కుమంటూ భయంతో బతుకున్నారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం ధాటి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు.