
వెల్లింగ్టన్: వరుస భూకంపాలు పలు దేశాలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయ్ లాండ్లో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. తాజాగా న్యూజిలాండ్ పశ్చిమ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1 గంట తర్వాత భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంప ప్రభావంతో దేశవ్యాప్తంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాసేపటి దాకా ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇన్వర్‌కార్గిల్‌కు నైరుతి దిశలో 300 కిలోమీటర్ల దూరంలో సముద్రం అడుగున 10 కిలోమీటర్ల దూరంలో భూ కేంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతంలో ప్రభుత్వ యంత్రాగం అప్రమత్తమైంది. వెంటనే సహయక చర్యలు చేపట్టింది.
అయితే.. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఈ ఎర్త్క్వేక్ను అధికారులు భారీ భూకంపంగా పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. 5 మిలియన్ల మందికి పైగా నివస్తోన్న న్యూజిలాండ్ భూకంపాలు, అగ్నిపర్వతాలు సర్వసాధారణమైన పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ‘రింగ్ ఆఫ్ ఫైర్’ జోన్లో ఉంది. ఇక్కడ తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.