ఒక్కో రోజు ఒక్కో దేశంలో.. మయన్మార్లో మరోసారి భూకంపం.. చిలీలో కూడా..

ఒక్కో రోజు ఒక్కో దేశంలో..  మయన్మార్లో మరోసారి భూకంపం.. చిలీలో కూడా..

భూకంపాలు ప్రపంచాన్ని భయపెడుతూనే ఉన్నాయి. తూర్పున ఉన్న మయన్మార్ లో మొదలైన భూకంపాలు ఒక్కో రోజు ఒక్కో దేశం అన్నట్లుగా వరుసగా పడమరకు విస్తరిస్తున్నాయి. మయన్మార్ తర్వాత నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, జపాన్.. ఇలా సంభవిస్తూ చివరికి అమెరికా ఖండాన్ని తాకాయి. గత కొంత కాలంగా వస్తున్న భారీ ప్రకంపనలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 

శుక్రవారం దక్షిణ అమెరికా దేశమైన చిలీ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రతతో నమోదైన భూకంపం.. చిలీని ఒక్కసారిగా ఊపేసింది. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి వీదుల్లోకి పరుగెత్తారు. 

చిలీ భూకంప కేంద్రం 178 కిలో మీటర్లలో లోతులో ఏర్పడిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. రెండు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 15న దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో వచ్చిన భూకంపంతో ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి చిలీలో భూకంపం సంభవించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు ప్రజలు. ఈ భకంపంతో చిలీలో భారీ డ్యామేజ్ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. 

మయన్మార్ లో మరోసారి:

మయన్మార్ ను భూకంపాలు వీడటం లేదు. ఇటీవలే 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపంతో తీవ్రంగా ధ్వంసమైంది. మరోసారి శుక్రవారం (ఏప్రిల్ 18) 3.9 తీవ్రతతో భూమి కంపించడం భయభ్రాంతులకు గురి చేసింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదని స్థానిక మీడియా వెల్లడించింది.