ఏం జరుగుతోంది: అమెరికా, నేపాల్ దేశాల్లో.. ఒకేసారి రెండు భూకంపాలు

ఏం జరుగుతోంది: అమెరికా, నేపాల్ దేశాల్లో.. ఒకేసారి రెండు భూకంపాలు

ప్రపంచంలో ఏం జరుగుతుంది.. ఎక్కడ చూసినా ఏదో ఒక విధ్వంసమే.. వారం, పది రోజులుగా అయితే భూకంపాలు భయాన్ని పుట్టిస్తున్నాయి.. మొన్నటికి మొన్న మయన్మార్, థాయ్ లాండ్ దేశాలను అల్లకల్లోలం చేసింది భారీ భూకంపం.. ఇప్పుడు అమెరికా, నేపాల్ దేశాల్లో భూకంపాలు.. 2025, ఏప్రిల్ 15వ తేదీ ఉదయం.. అమెరికా దేశం శాన్ డియాగో సమీపంలోని దక్షిణ కాలిఫోర్నియాను 5.2 తీవ్రతతో భూకంపం వణికించింది. ఇదే సమయంలో.. నేపాల్ దేశంలోనూ భూకంపం వచ్చింది. నేపాల్లో 4 తీవ్రతతో భూమి కంపించింది.

నేపాల్/అమెరికా: మయన్మార్లో పెను విషాదాన్ని మిగిల్చిన భూకంపం మంగళవారం నేపాల్ను పలకరించింది. నేపాల్లో మంగళవారం ఉదయం 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. వేకువజామున 4 గంటల 30 నిమిషాల సమయంలో నేపాల్లో భూకంపం సంభవించింది. దీంతో.. ఇళ్లలో నిద్రిస్తున్న నేపాల్ ప్రజలు మంచాలు ఊగిపోవడంతో భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న శాన్ డియాగోలో కూడా భూకంపం సంభవించింది. 5.2 తీవ్రతతో ఇళ్లన్నీ ఊగిపోయాయి. కొన్ని చోట్ల భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. జపాన్లో కూడా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై 4.6 తీవ్రత నమోదైంది. ఇదిలా ఉండగా నేపాల్ భూకంపం ఆందోళనకు గురిచేసింది. ప్రపంచంలోనే ఎక్కువ భూకంపాలకు అవకాశం ఉన్న దేశాల్లో నేపాల్ 11వ స్థానంలో ఉంది. నేపాల్ దేశంలో ఈ నెలలో రెండోసారి భూకంపం సంభవించడం గమనార్హం. 

ఏప్రిల్ 4న కూడా నేపాల్లో  భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై  5.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఏప్రిల్ 4న రాత్రి 7.52 గంటలకు పశ్చిమ నేపాల్‌లో 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.  నేపాల్తో పాటు  ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయని  తెలిపింది.