తెలంగాణలోని పలు జిల్లాల్లో భూ కంపం..రిక్టర్ స్కేలుపై 5.3

 తెలంగాణలోని పలు జిల్లాల్లో  భూ కంపం..రిక్టర్ స్కేలుపై 5.3

తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. డిసెంబర్ 4న ఉదయం  ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా,  ఉమ్మడి వరంగల్ జిల్లా, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భూమి కంపించింది.  హైదరాబాద్ లోని పలు చోట్ల రెండు సెకన్ల  పాటు భూమి కంపించింది. జనం భయాందోళనతో  ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదయ్యిందని అధికారులు తెలిపారు. భూమి లోపల 40 కి.మీ లనుంచి రేడియేషన్ ఉద్భవించిందని చెప్పారు. 

భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇల్లందులో స్వల్పంగా భూమి కంపించింది.  మణుగూరు అశ్వాపురం మండలాల్లో  ఆరు సెకండ్ల పాటు కంపించింది.  ఖమ్మం నగరంతో , కామేపల్లి , కారేపల్లి మండలంలో ఒక్కసారిగా  భూమి కంపించింది.  ఇండ్లల్లో వైబ్రేషన్ రావడంతో   స్థానికులు  బయటకు పరుగులు తీశారు. 

వరంగల్ జిల్లా నర్సంపేట, ఏటూరు నాగారంలో  స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం7.28 నిమిషాలకు 3 సెకండ్ల పాటు  కంపించింది. ఉమ్మడి మెదక్  జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల  స్వల్పంగా భూమి కంపించింది. భూ ప్రకంపనలతో ఇళ్లలో ఉన్న జనం ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. 

పెద్దపల్లి జిల్లాలో పలు చోట్ల మూడు సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి.  కరీంనగర్ విద్యానగర్ లోనూ భూమి కంపించిందని స్థానికులు చెప్పారు.   కరీంనగర్ విద్యానగర్, దుర్గమ్మ గడ్డలోనూ భూమి కంపించింది.సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో  స్వల్పంగా భూమి కంపించింది. ఉదయం7.27 నిమిషాలకు 5 సెకండ్లు కంపించింది.

  కొమురం భీం ఆసిఫాబాద్‌  జిల్లాలోని  కౌటాల, చింతల మానేపల్లి మండలాల్లో రెండు సెకన్ల  పాటు భూమి కంపించింది  ఇళ్లల్లో  నుంచి భయంతో పరుగులు తీశారు స్థానికులు. ఇళ్లల్లోని సామాగ్రి కిందపడిపోయాయి.