భూమి స్పీడ్ తగ్గుతోంది!

భూమి స్పీడ్ తగ్గుతోంది!
  • క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ తో ధ్రువాల వద్ద మంచు కరగడమే కారణం 
  • నీరంతా భూమధ్యరేఖ వద్దకు చేరడంతో రొటేషన్ స్పీడ్ పై స్వల్పంగా ఎఫెక్ట్ 
  • ఇదిలాగే కొనసాగితే.. 2100 నాటికి 2.2 మిల్లీసెకన్లు స్లో అయ్యే చాన్స్ 
  • అదే జరిగితే స్పేస్ నావిగేషన్, జీపీఎస్ కు తప్పని తిప్పలు 

వాషింగ్టన్ : క్లైమేట్ చేంజ్ సమస్య వల్ల వాతావరణం అస్తవ్యస్తంగా మారుతోందన్నదే ఇప్పటిదాకా మనకందరికీ తెలిసిన విషయం. కానీ ఈ సమస్య వల్ల భూమి తిరిగే స్పీడ్ కూడా స్వల్పంగా తగ్గిపోతోందట. ఫలితంగా రోజువారీ సమయం కూడా స్వల్పంగా పెరుగుతోందట. స్విట్జర్లాండ్ లోని ఈటీహెచ్ జూరిచ్ యూనివర్సిటీ, నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ సైంటిస్టులు సంయుక్తంగా చేపట్టిన తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుతం భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగేందుకు 86,400 సెకన్ల(24 గంటలు) సమయం పడుతోంది.

అయితే, క్లైమేట్ చేంజ్ సమస్య గనక ఇలాగే కొనసాగుతూ పోతే.. 2100 నాటికి భూమి తన చుట్టు తానూ తిరిగేందుకు పట్టే టైం దాదాపు 2.2 మిల్లీ సెకన్లు పెరిగే అవకాశం ఉందని వీరి రీసెర్చ్ లో తేలింది. ఒక సెకనుకు వెయ్యి మిల్లీ సెకన్లు ఉంటాయి. అలాంటిది జస్ట్ 2.2 మిల్లీ సెకన్ల టైం పెరిగితే సమస్యేంటీ? అనుకుంటున్నారా! భూమి రొటేషన్ స్పీడ్ లో ఆ మాత్రం తేడా వచ్చినా.. అంతరిక్షంలోని ఇతర గ్రహాలకు పంపిన స్పేస్ క్రాఫ్ట్ లతో కమ్యూనికేషన్ కు, అలాగే భూమిపై జీపీఎస్ వంటి నావిగేషన్ వ్యవస్థల పనితీరుకూ ఇబ్బందులు వస్తాయని సైంటిస్టులు అంటున్నారు.

ఉదాహరణకు.. మన సోలార్ సిస్టంను దాటేసి వెళ్లిపోయిన వొయెజర్ వ్యోమనౌక నుంచి సమాచారం అందుకోవాలనుకుంటే.. కొన్ని మిల్లీ సెకన్ల సమయం కూడా కీలకమని చెప్తున్నారు. భూమి స్పీడ్ తగ్గడంవల్ల దూరంలో కేవలం ఒక సెంటీమీటర్ తేడా వచ్చినా.. అక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్స్ వచ్చే లోపు ఆ దూరం కొన్ని కిలోమీటర్లు దాటుతుందని, దాంతో స్పేస్ కమ్యూనికేషన్ కష్టం అవుతుందంటున్నారు. 

చంద్రుడిని మించిన ఎఫెక్ట్.. 

వాతావరణ మార్పు వల్ల ఉత్తర ధ్రువం వద్ద గ్రీన్ ల్యాండ్ లో, దక్షిణ ధ్రువం వద్ద అంటార్కిటికాలో మంచు విపరీతంగా కరిగిపోతోందని, దీంతో ఈ నీరంతా భూమధ్య రేఖ ప్రాంతానికి చేరుతోందని రీసెర్చ్ లో పాల్గొన్న నాసాకు చెందిన ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్ సురేంద్ర అధికారి, ఈటీహెచ్ జ్యూరిచ్ కు చెందిన బెనెడిక్ట్ సోజా వెల్లడించారు. ‘‘నిజానికి భూమి పూర్తిస్థాయి గోళాకారంలో ఉండదు. భూమధ్య రేఖ వద్ద కొంచెం లావుగా ఉంటుంది. ప్రస్తుతం ధ్రువాలకు దగ్గరగా ఉండే భూమి రొటేషనల్ యాక్సిస్ వద్ద మంచు కారణంగా సరైన బరువు ఉంటుంది.

కానీ అక్కడి మంచు కరిగిపోతే యాక్సిస్ వద్ద ఉన్న బరువు దూరంగా వెళ్లడం వల్ల భూమి స్పీడ్ స్వల్పంగా తగ్గుతుంది” అని వారు తెలిపారు. ప్రస్తుతం భూమిపై ఉన్న వివిధ ప్రాంతాలకు స్పేస్ నుంచి రేడియో సిగ్నల్స్ చేరేందుకు పడుతున్న సమయాన్ని బట్టి తాము ఈ అంచనాకు వచ్చామని వీరు తెలిపారు. లక్షలాది సంవత్సరాలుగా చంద్రుడి గురుత్వాకర్షణ (టైడల్ ఫ్రిక్షన్) ఫలితంగా కూడా భూమి తిరిగే వేగం ఒక శతాబ్దానికి 2.40 మిల్లీ సెకన్లు తగ్గుతోందని

 అయితే, క్లైమేట్ చేంజ్ సమస్య పెరిగితే భూమి వేగంపై చంద్రుడి గురుత్వాకర్షణ కన్నా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు. కాగా, భూమిలోపలి ఇన్నర్ కోర్ స్పీడ్ కూడా  తగ్గిందని, దీంతో భూమి తిరిగే స్పీడ్ పైనా ఎఫెక్ట్ పడుతోందని ఇటీవల మరో రీసెర్చ్ లో తేలింది.