ఆధార్కార్డు.. దేశంలో అతి ముఖ్యమైన గుర్తింపు కార్డు. బ్యాంక్ లావాదేవీలు, పాస్‌పోర్ట్ దరఖాస్తులు, పాఠశాల అడ్మిషన్లు, ఉద్యోగ ధృవీకరణలు ఇలా చాలా విషయాల్లో ఆధార్ లేకుండా ఏ పని జరగదు. ఆధార్ లేకుండా ప్రభుత్వ పరంగా ప్రజలు అందాల్సిన ఏ సౌకర్యాలు పొందలేమంటే దీని ప్రాముఖ్యతను అంచనా వేయవచ్చు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఆధార్ కార్డుపై ఫొటో లేకపోయినా.. స్పష్టంగా లేకపోయినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అపహాస్యం పాలు కావాల్సి వస్తుంది కూడా.. అయితే ఆధార్ కార్డుపై ఫొటో తిరిగి పొందలేమా..? స్పష్టంగా లేని ఫొటోలను మార్చే ఆప్షన్ లేదా.. అంటే ఉందనే అంటున్నారు ఉడాయ్ అధికారులు.
ఏ ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆధార్ కార్డు ఫొటోను సులభంగా, త్వరగా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు. UIDAI వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ కార్డు పై ఫొటోను సులభంగా మార్చుకోవచ్చు.
మొదటగా UIDAI వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, ఆధార్ విభాగానికి నావిగేట్ చేయాలి. అప్‌డేట్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని అవసరమైన మీ వివరాలను పూరించండి. తప్పులు లేకుండా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను ఆధార్ శాశ్వత నమోదు కేంద్రంలో సమర్పించాలి. దీనితో పాటు మీ బయోమెట్రిక్ వివరాలు అందించాలి. రూ. 100 నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
URLని కలిగి ఉన్న కేంద్రం నుండి రసీదు స్లిప్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత మీ ఆధార్ కార్డులో ఫొటో అప్ డేట్ అవుతుంది. ఆధార్ సెంటర్ అందించిన URLని ఉపయోగించి అప్ డేట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ దశలను అనుసరించడం ద్వారా తమ ఆధార్ కార్డ్ ఫోటోను సులభంగా,సౌకర్యవంతంగా అప్‌డేట్ చేయవచ్చు.