ఆఫ్రికా దేశాల ఆకలి కేకలు : కనుమ ఎల్లారెడ్డి

తూర్పు ఆఫ్రికా దేశాలు ఇథియోపియా, సోమాలియా, కెన్యా  మునుపెన్నడూ  లేని కరువులో చిక్కుకున్నాయి.  ఇథి యోపియా –  ఈ శాన్య  ఆఫ్రికా దేశం. చాలా పురాతనమైన దేశం. వ్యవసాయంతో పాటు కాఫీ తోటలున్నాయి. సోమాలియా – ఇది ఈ శాన్య  ఆఫ్రికా హిందూ మహాసముద్ర తీరంలో ఉంది. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. కెన్యా – ఇది మధ్య ఆఫ్రికా తూర్పు తీరంలో ఉంది. వ్యవసాయమే  ప్రధాన వృత్తి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ మూడు దేశాలలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయమే. అయినా అక్కడ కరువు నాట్య మాడుతోంది. మూడు దేశాలలో తృణ ధాన్యాల కొరత ఉంది. ధరలు చుక్కల నంటుతున్నాయి.

పసి పిల్లలకు పాలు దొరక్క..

వాతావరణ పరిస్థితుల దృష్యా, జల వనరులు లేక వరుస కరువులు ఆ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పశువులకు గ్రాసం దొరక్క మృత్యు వాత పడుతున్నాయి. దీంతో ప్రజలు కుదేలవుతున్నారు. పశువుల మృత దేహాలు శవాల గుట్టగా ఉంది. మరో భయానక మైన విషయం ఏమంటే పసి పిల్లలకు పాలు దొరక్క  గుక్కపెట్టి ఏడుస్తూ మరణిస్తున్నారు. దానికి తోడు పౌష్టిక ఆహారం దొరకడమే గగనమైంది. పాడి పశువుల మరణంతో ప్రజల జీవనోపాధి దెబ్బతిన్నది. పనులు లేక కుటుంబ పోషణ కోసం ప్రజలు వలస బాట పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం అక్కడి పాలకులు చేసిన ప్రధాన తప్పిదం. అంతంత మాత్రమే ఉన్న జలవనరులపై మూడు దేశాలు నిర్లక్ష్య వైఖరి  ప్రదర్శించాయి. తాగడానికి నీళ్లు లేవంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే పాడి పశువులు మృత్యువాత పడ్డాయి.  పసి పిల్లలకు, గర్భిణులకు పౌష్టిక  ఆహారం లేక ఆకలి.. ఆకలి అంటూ.. గోసపడుతున్నారు. ప్రపంచాన్ని కలవర పెడుతున్న  దృశ్యం ఇది. జలవనరులను కాపాడుకోలేక, అందుకు తగిన ప్రణాళిక లేక మూడు దేశాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. జలం మానవాళికి ఆధారం అనే మాట అక్కడి పాలకులు విస్మరించారు. 

సోమాలియాలో మరింత దుర్భరం

సోమాలియాలో పరిస్థితి కడు  దుర్భరం. పిల్లలు, పెద్దలు పెద్ద తలలతో, అస్థిపంజరం వలె ఉంటారు.   ఏమీ దొరక్క  పిల్లలు మన్ను తినే దృశ్యం చూస్తుంటే ఎవరికి అయినా గుండె తరుక్కుపోతుంది. అది గ్రహించే  ఐక్య రాజ్య సమితి  అనుబంధ సంస్థ  అయిన యఫ్. ఏ. ఓ  ఆ మూడు దేశాల ప్రజలకు ఆహారం అందించాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా  దేశాల చేయూత ఇక్కడ అవసరం. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా అని భేదాలు చూపక  విశ్వమంతా స్పందించాల్సిన  సమయమిది. అందుకే ఐక్యరాజ్య సమితి ప్రధాన  కార్యదర్శి  ఆంటోనియా గుటెర్రస్ ప్రపంచ దేశాలు ఆ మూడు దేశాలను ఆదుకోవాలని పిలుపునిచ్చాడు.

ఆపదలో ఆదుకునేది భారతే 

ప్రపంచంలో ఏ దేశం స్పందించకున్నా భారత్ మాత్రం ఆకలితో అలమటిస్తున్న ఆఫ్రికా దేశాలకు సాయం చేస్తూనే ఉన్నది.  విశ్వంలో ఏ దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా.. భారత్ మాత్రం తన వంతు సాయం అందిస్తున్నది. భారత్ కు ఉన్న మంచి పేరు అదే. అందుకే ఇండియాను రెండవ ఐక్యరాజ్య సమితి అని, ఆపన్న హస్తం అందించే దేశమని పేర్కొనడంలో సందేహమే లేదు. ఇక ప్రపంచంలో ఏ దేశం ఇలాంటి దుస్థితి ఎదుర్కోకూడదు. ఈ దేశాల్లో నెలకొన్న కరువు, ఆసియా ఖండంలో, అది దక్షిణ ఆసియాలో.. శ్రీలంక, పాకిస్తాన్ లాంటి దేశాలకు ఓ గుణపాఠం కావాలి. పాలకుల పనితీరు బాగా లేకున్నా, సమస్యలు పరిష్కరించలేకున్నా, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకున్నా, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోకున్నా ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి.అందుకే దేశాలన్నీ  జాగరూకత  వహించాలి.

– కనుమ ఎల్లారెడ్డి, పౌరశాస్త్ర అధ్యాపకులు