![Bird Flu: మనుషులు ఉండాలా..? పోవాలా..? చేపలకు మేతగా బర్డ్ ఫ్లూ కోళ్లు..!](https://static.v6velugu.com/uploads/2025/02/east-godavari-district-is-in-turmoil-birdflu-chickens-have-been-used-to-feed-fish_UKaYltoP96.jpg)
పెద్దాపురం: తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేగింది. చేపల చెరువులకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లను వేస్తున్నట్లు తెలిసింది. చనిపోయిన కోళ్లను యజమానులు చేపల చెరువుల్లో పడేస్తున్నారు. జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు,పెద్దాపురంలో చేపలకు మేతగా కోళ్లను వేస్తున్నట్టు గుర్తించారు. కాకినాడ ఎన్జీవో సభ్యులు వీడియోలు విడుదల చేశారు. ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం వేల్పూరు, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అక్కడి కోళ్ల నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో ఏవీఎన్ ఇన్ ఫ్లుయెంజా(హెచ్5ఎన్1-బర్డ్ ఫ్లూ) ఉందని నిర్ధారించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దులు ఆనుకొని ఉండడంతో తెలంగాణ అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయింది.
సూర్యాపేట జిల్లాలో కోదాడ రామాపురం దగ్గర, నల్గొండ జిల్లాలో తిరుమలగిరి సాగర్, వాడపల్లి వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో సరిహద్దు జిల్లాల్లో టెన్షన్ నెలకొంది. ప్రభుత్వ ఆదేశాలతో ఏపీని ఆనుకొని ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ పశు సంవర్థక శాఖ సిబ్బందిని నియమించారు. వాహనాలను తనిఖీ చేసిన అనంతరం రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ప్రత్యేకించి కోళ్లు, కోడి గుడ్లు, కోళ్ల దాణా ఏపీ నుంచి మన రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కోళ్లు, గుడ్లు, దాణాతో ఏవైనా వాహనాలు వస్తే వాటిని తిప్పి పంపిస్తున్నారు.
ALSO READ | సికింద్రాబాద్లో అమ్ముతుంది కుళ్లిన చికెనా..? రెండు చికెన్ సెంటర్స్లో 5 క్వింటాళ్లు సీజ్
హైదరాబాద్లో ప్రతిరోజు ఒక్కో షాపులో కనీసం 300 నుంచి 500 కిలోల చికెన్ అమ్ముతుంటారు. కానీ, రెండు రోజులుగా కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోందనే ప్రచారంతో అమ్మకాలు తగ్గాయి. వారం కింద కిలో చికెన్ (విత్ స్కిన్) రూ. 200, స్కిన్లెస్చికెన్రూ.220 వరకు ఉండగా బుధవారం కొన్ని చోట్ల విత్ స్కిన్ చికెన్ రూ. 180కి, స్కిన్ లెస్ చికెన్ రూ. 200కి కిలో చొప్పున అమ్మడం కనిపించింది. అమ్మకాలు ఇంకా పడిపోతే, ధరలు కూడా తగ్గించే అవకాశం ఉంది.