ఈస్టర్..​ క్రిస్టియన్​ ఫెస్టివల్​ స్పెషల్​ : ఏసు క్రీస్తు శాంతి సందేశాలు ఇవే..!

ఈస్టర్..​ క్రిస్టియన్​ ఫెస్టివల్​ స్పెషల్​ :  ఏసు క్రీస్తు శాంతి సందేశాలు ఇవే..!

గుడ్ ఫ్రైడే.. శాంతి, ఓర్పు, క్షమలను ఆచరణలో చూపెట్టిన క్రీస్తు శిలువపై రక్తం చిందించిన రోజు. బాధలను సైతం లెక్క చేయక పాపుల కోసం ప్రభువు ప్రాణం వదిలిన రోజు. అందుకే క్రీస్తు మరణాన్ని, బోధనలను గుర్తు చేసుకునే రోజే గుడ్ ఫ్రైడే. ఏసు చనిపోయిన మూడో రోజు బతికి, శిష్యులకు కనిపించాడని బైబిల్ చెప్తుంది. 

అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడే తరువాత వచ్చే  ఆదివారం ఈస్టర్ పండుగలను ఘనంగా జరుపుకుంటారు. గు డ్ ఫ్రైడేను హోలీ ఫ్రైడే, బ్లాక్​ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ వరక ప్రభువు జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకుంటే చాలు.. వాటిలో ప్రభువు ఇచ్చే సందేశం ఉంది. ఆయన మాటలు, పనుల్లో ప్రస్తుత సమాజానికి అవసరమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. 

తగ్గించుకోండి  

పస్కా  .... పండుగ ఆచారం ప్రకారం భోజనం పెట్టి వ్యక్తి అతిథుల కాళ్లు కడగాలి. అందుకు -శిష్యుల్లో ఎవరూ ముందుకు రాదు. వాళ్లలో వాళ్లే నేను గొప్ప అంటే నేనే గొప్ప అనే అహంకారంతో మాట్లాడుకుంటుంటారు. గొప్పవాళ్లమనే అహం ప్రదర్శిస్తారు. అప్పుడు క్రీస్తు నీళ్ల పాత్రను తీసుకుని ఒక్కొక్క శిష్యుడి కాళ్లు కడుగుతాడు. వస్త్రంతో తడి తుడుస్తాడు. అప్పుడు శిష్యులతో మనిషిని అహంకారం నాశనం చేస్తుంది. ఎవర్ని వాళ్లు తగ్గించుకోవడమే గొప్ప అని చెప్తాడు. ..నన్ను నేను తగ్గించుకున్నట్లుగానే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి' అని సందేశం ఇస్తాడు. ఆ రోజు ప్రభువు ఇచ్చిన సందేశం నేటికి అవసరమే...  ధనం, పదవి బలం లాంటి వాటితో నేను గొప్ప నేను ఎక్కువ అని చెప్పుకునే వాళ్లకు ఇలాంటి మాటలు గొడ్డలిపెట్టు లాంటివి. అందరికంటే తక్కువ స్థాయిలో ఉంటూ, తోటివాళ్లకు సాయం చేయడంలోనే మనిషి జీవితానికి సార్థకత అని క్రీస్తు చెప్పడమే కాదు. ఆదరించి చూపాడు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ అని బైబిల్ ద్వారా తెలుస్తుంది.. 

ఏడు మాటలు 

'క్రీస్తు తన బోధనలతో ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నాడు. తనను దేవుని ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్నాడు. పన్నులు చెల్లించకుండా ప్రజల్లో విప్లవం తెస్తున్నాడు ... అని ఆనాటి మత ప్రవక్తలు ఆరోపణలు చేశారు. రోమన్ చక్రవర్తి మత ప్రవక్తలకే ఆయనను శిక్షించే అధికారం ఇవ్వడంతో ఆయనను శిలువ వేయాలని నిర్ణయించారు. తలపై ముళ్ల కిరీటం పెట్టి, చెక్కతో చేసిన శిలువను భుజాలపై పెట్టి, కొరడాలతో కొడుతూ కొంతదూరం నడిపిస్తారు. చేతులను శిలువకు బంధించి మేకులు కొడతారు. క్రీస్తు మరణిస్తూ ఏడు మాటలు చెప్తారు. అవి ప్రపంచానికిచ్చిన సందేశం లాంటివి. 

తండ్రి... వీరేమి చేయుచున్నాడో వీరెరుగరు:   కనుక వీరిని క్షమించుము.  తనకు మరణ శిక్ష విధించిన వాళ్లను కొరడాలతో కొట్టిన వాళ్లను ముళ్లకిరీటం పెట్టిన వాళ్లను కూడా క్షమించమని ప్రభువు ప్రార్థన చేశాడు. ఈ మాట ఆయనలోని క్షమా గుణాన్ని తెలియజేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికీ చెడుచేసిన వాళ్లను క్షమించే స్వభావం ఉందాలని ఈ మాట ద్వారా తెలియజేశాడు.

నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉందువు : అంటే పాపాలు చేసిన వాళ్లను  శిక్షించడం కంటే పాపాల నుంచి విముక్తి కలిగించడమే ముఖ్యమని దీని వెనుకున్న భావం.  దేవుని రాజ్యంలో వాళ్లకూ స్థానం కల్పిస్తానని చెప్పడం ఆయనలోని ఔదార్యానికి చిహ్నం. ఈ గుణం నేటి సమాజానికి చాలా అవసరం 

అమ్మా ఇదిగో నీ కుమారుడు. .యోహాను. ఇదిగో నీ తల్లి :  ఈ మాట ప్రభువు తన చివరి క్షణాల్లో బంధువులను గుర్తుచేసుకోవడంలా కనిపిస్తుంది. ఎప్పటికీ బంధుత్వాలు అనుబంధాలు మర్చిపోకూడదని ఆయన చేసిన హెచ్చరికలాంటిది ఇది.
 
నా దేవా నన్నేల చేయి విడిచితివి:  ఈ మాట ప్రభువుకున్న లౌకిక సుఖాలమీద.. విరక్తిని తెలియజేస్తుంది.  ఎన్ని ఉన్నా, ఎంత సంపాదించినా చివరకు అవన్నీ వెంటరావని, అన్నింటిని విడిచి వెళ్లాల్సి వస్తుందని దీని అర్థం. 

దప్పిక గొనుచున్నాను : క్రీస్తు వెదుకులాట ఇక ముగియలేదని, అందుకే మళ్లీ తిరిగి వస్తామని చెప్పడమే ఈ మాట వెనుకున్న భావన 

సమాప్తమైనది: అంటే శిలువపై తన అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయని తెలియజేయడం. అంటే ఎవరి జీవితం అయినా మరణంతో ముగుస్తుందన్నమాట. 

తండ్రి నీ చేతికి నా ఆత్మను  అప్పగించుకొనుచున్నాను:  లోకాన్ని రక్షించడానికి, ప్రజలను పాపాల నుంచి విముక్తి కలిగించడానికి వచ్చిన క్రీస్తు తన బాధ్యతను విజయవంతంగా ముగించాను. ఇక తిరిగి వస్తున్నానని తన తండ్రికి చెప్పడం ఈ మాటలోని ఉద్దేశం . ఈ భూమ్మీదకు వచ్చిన ప్రతి ఒక్కరు  తమ బాధ్యతలను నీతి... నిజాయితీతో నిర్వహించాలని చెప్తుంది ఈ మాట.

లాస్ట్ సప్పర్ 

క్రీస్తు చనిపోయే ముందురోజు రాత్రి శిష్యులతో కలిసి 'పస్కా' పండుగ సందర్భంగా భోజనం చేస్తాడు. దీనినే లాస్ట్ సప్పర్ అంటారు. క్రీస్తు భోజనం చేస్తూ శిష్యులతో ఇది.నా చివరి విందు" అని చెప్తాడు. రొట్టెను చేతిలోకి తీసుకుని దేవుడికి కృతజ్ఞతలు చెప్పి, వాళ్లకు పంచి పెడ్తూ 'ఇది మీకోసం నేను అర్పించబోతున్న  నా శరీరాన్ని సూచిస్తోంది. నన్ను గుర్తు చేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి' అని చెప్తాడు. అలాగే ద్రాక్షరసం ఉన్న గిన్నెను తీసుకుని 'మీకోసం నేను చిందించబోతున్న నా రక్తం ఆధారంగా కొత్త ఒప్పందాన్ని సూచిస్తోంది' అని అంటాడు. 

 
గుడ్ ఫ్రైడే టు ఈస్టర్ 

ప్రభువు శిలువపై మరణించిన తర్వాత  సరిగ్గా మూడోరోజు శిష్యులను, అనుచరులకు దర్శనమిచ్చాడని బైబిల్ చెప్తోంది. దీనిని పునరుత్థానం అంటారు. అంటే తిరిగి జన్మించడంప్రతి ఒక్కరు తమలో ఉన్న మంచి చెడు గుణాలను వదిలించుకొని.. 
మళ్లీ తిరిగి జన్మించాలన్నది దీనిలోని అర్ధం.  చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే శిలువపై ప్రభువు  అనుభవించినంత బాధ పడక తప్పదు అనడానికి గుడ్ ఫ్రైడే నుంచి ఈస్టర్ వరకు ఉన్న ప్రస్థానం ఒక ఉదాహరణ. ప్రేమ, క్షమ శాంతి, త్యాగం, సేవ లాంటి మంచి గుణాలు అలవర్చుకోవాలి. అవే ఈ రెండు పండుగలు ఇచ్చే సందేశం. అందుకే క్రీస్తు నేనే మార్గం. నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. అంటేప్రక ఒక్కరూ  ఆయన ఆచరించి చూపిన వాటిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ పండుగలు సూచిస్తున్నాయి. 

-–వెలుగు, లైఫ్​–