
బ్యాంక్ కొలువే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఉమ్మడి ప్రణాళికతో సిద్ధమైతే కొలువు సులువుగా సాధించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్ మేనేజర్‌గా చేరి చైర్మన్ వరకు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. మూడంచెల ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసుకుందాం...
డిగ్రీ ఉత్తీర్ణతతో బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. ప్రిలిమ్స్, మెయిన్స్‌ల్లో సెక్షన్ల వారీ కటాఫ్ మార్కుల రూల్ లేకపోవడం ఈసారి అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.
ప్రిలిమ్స్:ఇది ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నపత్రాన్ని గంటలో పూర్తిచేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగానికీ 20 నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. కేటగిరీలవారీగా ఖాళీలకు పది రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. సుమారు 20,560 మంది మెయిన్స్ రాస్తారు.
మెయిన్స్: 200 మార్కులకు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. రెండూ ఆన్‌లైన్‌లోనే రాయాలి. ఆబ్జెక్టివ్ పరీక్షకు 3 గంటల సమయాన్ని కేటాయించారు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్‌లో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 45 ప్రశ్నలు 60 మార్కులు. డేటా ఎనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 35 ప్రశ్నలు 60 మార్కులు. జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో 35 ప్రశ్నలకు 40 మార్కులు ఉంటాయి. డిస్క్రిప్టివ్ టెస్ట్‌కు 30 నిమిషాలు ఉంటుంది. పరీక్షలో ఇంగ్లీష్‌లో లెటర్, ఎస్సే రాయాలి. ఖాళీలకు 3 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మొత్తం 6,168 మంది ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ (జీడీ)లో పాల్గొననున్నారు.
ఇంటర్వ్యూ: ఫైనల్ స్టేజ్ ఎగ్జామ్‌కు 50 మార్కులు కేటాయించారు. ఇందులో 20 మార్కులు గ్రూప్ డిస్కషన్‌కు, 30 మార్కులు ఇంటర్వ్యూకు ఉంటాయి. కరోనా నేపథ్యంలో 50 మార్కులకు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించే అవకాశం ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ పావు శాతం మార్కులు తగ్గిస్తారు.
ఫైనల్ సెలెక్షన్: మెయిన్స్, ఇంటర్వ్యూలో అభ్యర్థి సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మెయిన్స్ 250 మార్కులను 75 మార్కులకు, ఇంటర్వ్యూలోని 50 మార్కులను 25కి కుదిస్తారు. 100 మార్కులను స్కేల్‌గా తీసుకొని, మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన తుది నియామకాలు చేపడతారు.
ప్రమోషన్ ప్రాసెస్: ప్రొబేషనరీ సమయం పూర్తయ్యాక స్కేల్-1 స్థాయిలో అసిస్టెంట్ మేనేజర్‌గా మొదలై.. టాలెంట్ ఆధారంగా మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ వరకు పొందే ఛాన్స్ ఉంది.
ప్రిపరేషన్ ప్లాన్:
ప్రిలిమ్స్, మెయిన్స్‌కు కలిపి ఉమ్మడిగా ప్రిపేర్ అవ్వాలి. రెండింట్లో ప్రధానంగా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. జనరల్/ ఫైనాన్స్ అవేర్‌నెస్ మినహా మిగిలిన మూడు సబ్జెక్టులు ప్రిలిమ్స్, మెయిన్స్‌లో వెయిటేజీ ఎక్కువ ఉంటుంది. ఈ నాలుగు సబ్జెక్టులను ప్రిలిమ్స్ సమయంలోనే మెయిన్స్ స్థాయిలో ప్రాక్టీస్ పూర్తి చేయాలి. ప్రిలిమ్స్ నవంబర్ చివరి వారంలో, మెయిన్స్ డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అభ్యర్థులు ముందుగా సబ్జెక్ట్‌లోని అన్ని టాపిక్స్ బేసిక్స్ చదవాలి. కాన్సెప్ట్ పూర్తయ్యాక లోయర్ స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్ ప్రశ్నలు ఎగ్జామ్ ఓరియెంటెడ్‌లో ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్‌కు ఉన్న 40 రోజుల సమయంలో 20 రోజుల్లో అన్ని టాపిక్స్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత సమయం రివిజన్‌కు, ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్‌కు కేటాయించాలి. మోడల్ పేపర్స్ చేస్తుంటే ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయ్, ఎంత సమయంలో ఆన్సర్ చేస్తున్నామో తెలుస్తుంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిపరేషన్
ప్రొబేషనరీ ఆఫీసర్‌తో పోలిస్తే స్పెషలిస్ట్ ఆఫీసర్ రాతపరీక్ష ప్రిపరేషన్ తేలికగా, తక్కువ సమయంలో పూర్తిచేసేలా ఉంటుంది. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసే పోస్టుకు సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టును వారి డిగ్రీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చదివి ఉన్న కారణంగా దాని సన్నద్ధతకు తక్కువ సమయమే పడుతుంది. ఇక ప్రిలిమ్స్ పరీక్షలో ఉండే సబ్జెక్టులకు మాత్రమే వారి తయారీ ఎక్కువగా ఉండాలి. ఏఎఫ్‌ఓ, ఐటీ, హెచ్‌ఆర్/ పర్సనెల్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుల్లో ప్రిలిమ్స్ పరీక్షలో రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టులు, రాజభాషా అధికారి, లా ఆఫీసర్ పరీక్షలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ బదులుగా జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టులు ఉన్నాయి. సన్నద్ధత ఇప్పుడు మొదలుపెట్టినా కూడా విజయం సాధించడానికి ఈ సమయం సరిపోతుంది. తాము చదివిన ప్రొఫెషన్ నాలెడ్జి సబ్జెక్టు మెయిన్స్ పరీక్షలో ఉంది. దానికి ప్రిలిమ్స్ తర్వాత ఒక నెల సమయం ఉంటుంది. కాబట్టి ఆ సమయం దాని ప్రిపరేషన్‌కు సరిపోతుంది.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (సీఆర్‌పీ ఎస్‌పీఎల్-XIII) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనే బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
పోస్టులు: మొత్తం 1402 పోస్టుల్లో ఐటీ ఆఫీసర్ (స్కేల్-1)– 120, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్(స్కేల్-1)– 500, రాజ్‌భాష అధికారి (స్కేల్-1)– 41, లా ఆఫీసర్ (స్కేల్-1)– 10, హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1)– 31, మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1)– 700 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: పోస్టును అనుసరించి బీటెక్, డీగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాలి. వయసు ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ డిసెంబర్ 30, 31 వ తేదీల్లో నిర్వహిస్తారు. మెయిన్స్ జనవరి 28న ఉంటుంది. ఇంటర్వ్యూ ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.ibps.in వెబ్సైట్లో సంప్రదించాలి.
నోటిఫికేషన్
పోస్టులు: మొత్తం 3049 ఖాళీలు ఉన్నాయి. సీఆర్‌పీ ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రైనీ-XIII: 3,049 పోస్టులు (ఎస్సీ- 462, ఎస్టీ- 234, ఓబీసీ- 829, ఈడబ్ల్యూఎస్- 300, యూఆర్- 1224)
అర్హత: ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. వయసు ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: ఆన్లైన్లో ఆగస్టు 21 నాటికి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్షలు: ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్, మెయిన్స్ నవంబర్, ఇంటర్వ్యూ జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
తుది ఫలితాలు ఏప్రిల్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.