ENG vs PAK: టీవీల్లో సలహాలు ఇవ్వడం కాదు.. దమ్ముంటే నేరుగా కాల్ చేయండి: బాబర్ ఆజాం

ENG vs PAK: టీవీల్లో సలహాలు ఇవ్వడం కాదు.. దమ్ముంటే నేరుగా కాల్ చేయండి: బాబర్ ఆజాం

ఒక మాట అన్నారు.. పడ్డాడు, రెండు మాటలు అన్నారు.. తుడుచేసుకున్నాడు. ఏం అనట్లేదు కదా! అని పదే పదే విమర్శిస్తుంటే ఎవరికి కోపం రాదు చెప్పండి. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంకు అలానే కోపం కట్టలు తెంచుకుంది. మీడియా డిబేట్లలో పాల్గొంటూ నోటికొచ్చింది వాగుతున్న ఆ దేశ మాజీ క్రికెటర్లపై గరమయ్యాడు.   

మెగా టోర్నీ ప్రారంభానికి ముందు ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ ఆజాం, ఆ స్థానానికి న్యాయం చేయలేదనేది ఆ దేశ మాజీ క్రికెటర్ల వాదన. చిన్న జట్లపై రాణించి ఆ ర్యాంక్‌కు చేరువయ్యాడని కొందరంటే, అసలు బాబర్ ఆజాం ఆ స్థానానికి ఎలా చేరుకున్నాడో అర్థం కానీ విషయమని మరికొందరు విమర్శించారు. ఇన్నాళ్ళు అలాంటి మాటలు ఎన్ని  అన్నా మౌనం వహించిన పాక్ కెప్టెన్.. నేడు వాటికి తెరదించాడు.     

ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న బాబర్ ఆజాం.. "టీవీల్లో అభిప్రాయాలు చెప్పడం చాలా సులభం. ఎవరైనా సలహా ఇవ్వాలనుకుంటే, నాకు నేరుగా కాల్ చేయండి. అలాంటి వారు ఎంతమంది ఉన్నా స్వాగతిస్తా. నా నంబర్ కూడా అందరికీ తెలుసు.." అని విమర్శకుల నోరు మూయించాడు.

"నేను గత మూడేళ్లుగా జట్టుకు కెప్టెన్‌గా ఉన్నా. గతంలో ఎప్పుడూ ఇలాంటి విమర్శలు ఎదుర్కోలేదు. ప్రపంచకప్‌లో మీ అంచనాలను అందుకోకపోవడమే దీనికి కారణం. అందరూ నేను ఒత్తిడిలో ఉన్నానని అంటున్నారు. నా వరకు అలా అనిపించడం లేదు. ఫీల్డింగ్ సమయంలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. బ్యాటింగ్ సమయంలో ఎక్కువ పరుగులు చేసి జట్టును ఎలా గెలిపించాలి అని ఆలోచిస్తా.." అని బాబర్ ఆజాం విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. 

ఈ టోర్నీలో బాబర్ ఆజాం 8 మ్యాచ్ ల్లో 282 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇంగ్లాండ్‌తో.. 

పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో నవంబర్‌ 11న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్.. ఇంగ్లాండ్‌ను 287 పరుగుల తేడాతో ఓడించడం కానీ, లేదంటే ఇంగ్లాండ్ నిర్ధేశించే లక్ష్యాన్ని 2.3 ఓవర్లలో ఛేదించడం కానీ జరగాలి. అలా అయితేనే పాక్ రన్‌రేట్‌ పరంగా కివీస్‌ను కిందకునెట్టి నాలుగో స్థానానికి చేరుకోగలదు.