ఒక్కొక్కరు రోజూ 50 గ్రాముల ఆకుకూరలు తినాలె
రాష్ట్రంలో 26 గ్రాములే తింటున్నరు
కూరగాయలు కూడా తినాల్సినంత తింటలేరు
అందుకే పోషకాహార లోపం
హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కూరగాయలు తక్కువగా తింటున్నరు. ఆకుకూరలైతే మరీ తక్కువగా తీసుకుంటున్నరు. రోజూ తినాల్సిన దానిలో సగం కూడా తింటలేరని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ రిపోర్ట్‌లో వెల్లడైంది. విటమిన్లు, పోషకాలు చాలా ఎక్కువగా ఉండే ఆకుకూరలను సరిపోయినంత తినకపోవడం వల్ల జనం పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తేలింది. రాష్ర్టంలో కూరగాయలు, ఆకుకూరల వినియోగం, వాటి సాగు, ఉత్పత్తి వంటి వివరాలను ఉద్యాన శాఖ సేకరించింది.
ప్రజలు ఏ కూరగాయను ఎంత తింటున్నారన్న విషయంపై వివిధ సంస్థలు చేసిన సర్వే రిపోర్ట్లు, ఇతర సోర్స్‌ల ద్వారా ఒక రిపోర్ట్‌ను తయారు చేసింది. దీంతో రాష్ట్రంలో కూరగాయలు, ఆకుకూరలను సరిపోయినంత మేరకు తినడం లేదని వెల్లడైంది.
రోజుకు 50 గ్రాముల ఆకుకూరలు
ఒక్కొక్కరు యావరేజ్‌గా రోజుకు 40 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు ఆకుకూరలు తింటే మంచిదని నిపుణులు చెప్తుంటారు. అయితే రాష్ట్రంలో ఒక్కొక్కరు రోజూ 20 గ్రాముల నుంచి 26 గ్రాములలోపే ఆకుకూరలు తింటున్నారని హార్టికల్చర్ డిపార్ట్ మెంట్ నివేదిక చెప్తోంది. అంటే తినాల్సిన దానికన్నా సగం తక్కువే తింటున్నరని తేలింది. అట్లనే ఒక్కొక్కరు రోజుకు యావరేజ్ గా 200 గ్రాముల కూరగాయలు తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కానీ రాష్ట్రంలో కూరగాయలను రోజుకు 175 గ్రాముల నుంచి 200 గ్రాముల లోపే తింటున్నారని వెల్లడైంది. ఇక దుంప రకాల కూరగాయలను కూడా రోజుకు 50 గ్రాములు తీసుకోవాల్సి ఉండగా, 32 గ్రాములే తింటున్నారని నివేదిక తెలిపింది.
పాలకూరకే జైకొడ్తున్నరు
ఆకుకూరల్లో పాలకూరే ఎక్కువగా వండుకుంటున్నారని అధికారులు పేర్కొన్నారు. అయితే పాలకూరను పప్పులు, పన్నీరు వంటివాటితో కలిపే ఎక్కువగా వండుకుంటుండటంతో సరిపోయినంత తినడం లేదని అంటున్నారు. కొత్తిమీర, పుదీనా వంటివి రోజూ ఏదో ఓ కూరలో వేసుకుంటున్నా, అవి కూడా తక్కువగానే వాడుతున్నరు. ఇక కరివేపాకును అన్ని కూరల్లోనూ వేసుకుంటున్నా.. చాలామంది తినకుండా ఏరిపారేస్తుంటరు. మెంతి, చుక్క కూర, పుంటికూర వంటివి వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే తీసుకుంటున్నారని అధికారులు చెప్తున్నారు.
సాగు పెరగాలె
ఆకుకూరల ఉత్పత్తి తక్కువ, ధరలు ఎక్కువగా ఉంటున్నయి. చిన్నపిల్లలు ఆకుకూరలను ఎక్కువగా ఇష్టపడరు. ఇంట్లో అందరికీ సరిపోయేటంత వండాలంటే ఎక్కువగా కొనాల్సి వస్తుంది. అందుకే ఆకుకూరల వాడకం తక్కువగా ఉంటోందని అధికారులు చెప్తున్నారు. ఆకుకూరలు తినాలనే అవగాహన ఈ మధ్య పెరిగినా, ధరలు భయపెడుతున్నాయి. సాగు, ఉత్పత్తి తక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదంతా కలిపితే 33 వేల ఎకరాల్లో ఆకుకూరలు సాగవుతున్నాయి. వీటి సాగు మరో ఐదారు వేల ఎకరాల వరకు పెరగాలని అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి1.46 లక్షల టన్నుల వరకూ ఆకుకూరలు పండుతున్నాయి. వీటి ఉత్పత్తి మరో16 నుంచి18 వేల టన్నులు పెరిగితే ధరలు తగ్గే చాన్స్ ఉంటుందని పేర్కొంటున్నారు.
ఆకుకూరల్లో అన్నీ ఉంటయ్
ఆకుకూరలతో శరీరానికి కావాల్సిన అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. వీటితో కొవ్వు సమస్య కూడా ఉండదు కాబట్టి ఎక్కువగా తినాలని డాక్టర్లు చెప్తుంటారు. తోటకూరలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ వంటి రోగాలు రావు. ఇందులోని క్యాల్షియం, ఐరన్ రక్తహీనతను తగ్గిస్తాయి. ఎముకలకు బలాన్నిస్తాయి. పాలకూరలో విటమిన్ ఎ, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. గుండెకు పుదీనా చాలా మంచిది. వెక్కిళ్లు, వాంతులు, అజీర్ణ రోగులకు పుదీనా తింటే ఆ ప్రాబ్లమ్స్ తగ్గుతాయని డాక్టర్లు చెప్తున్నారు.
పౌడర్ చేసుకుంటే బెటర్
కూరగా తినడానికి ఇష్టపడనివారు కొన్ని రకాల ఆకుకూరలను పౌడర్ చేసుకుని వాడుకోవచ్చు. ఇది బాగా పనికొస్తుంది. రాష్ట్రంలో ఆకు కూరల సాగు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రైతుల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం. చాలామంది కల్యామాకు తీసి పక్కన పెడుతుంటారు. అందులోనే చాలా పోషకాలుంటాయి. కల్యామాకు, మెంతి ఆకును పౌడర్‌గా చేసుకోని రోజూ కూరల్లో వేసుకోవచ్చు. పుదీనాను పచ్చడి రూపంలో తీసుకోవచ్చు.
– ఎల్. వెంకట్రామ్ రెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్
For More News..