మసాలా దినుసుల మిశ్రమం.. మంచి ఔషధం. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడంలో కీలకంగా ఉంటుంది. అందుకే భారతీయ వంటకాల్లో గరం మసాలా ఆధిపత్యం చెలాయిస్తుంది. భారతీయ కిచెన్ లో ఎన్నో ఔషధాలుంటాయి. ఇవి సువాసనను కలిగి ఉండి... వంటల్లో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ఆయుర్వేదంలో మందుల తయారీకి ఉపయోగించే పదార్దాలు... భారతీయులు మసాలా దినుసులుగా ఉపయోగిస్తారు. మెరుగైన ఆరోగ్యం కోసం ఉపయోగించే వంటింటి మసాలా దినుసుల గురించి తెలుసుకుందాం.
సాధారణంగా ప్రతి ఇంటి వంట గదిలో పసుపు, జీలకర్ర, కొత్తిమీర,దాల్చినచెక్క, ఏలకులు, అల్లం, మెంతులు, అల్లం వంటివి సాధారణంగా ఉపయోగిస్తారు. వీటి మిశ్రమాన్ని గరం మసాలా అంటారు. వంటలో వీటిని ఉపయోగించడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వీటిలో ఇమ్యూనిటి పవర్ పెంచే గుణం ఉంటుంది.
పసుపు:దీనిమహిమ గురించి చాలా మందికి తెలుసు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ వంటి అనేక చికిత్స లక్షణాలకు సాంప్రదాయకంగా ఉపయోగిస్తారు. పసుపు, అల్లం జాతికి చెందింది. కూరలో చిటికెడు పసుపు వేయడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే... గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్, కేన్సర్ రావడాన్ని నిరోధిస్తుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది.
జీలకర్ర: దీని పొడిని వంటలో మసాలాగా ఉపయోగిస్తారు. జీలకర్ర లేకుండా సాంబారు,కూర, మాంసాహారం ఏదీ ఉండదు. ఈ సువాసన భరితమైన మసాలా కాలేయం, ప్యాంక్రియాస్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది. టాక్సిన్స్, పోషకాలను గ్రహిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచి.. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. మధుమేహం వ్యాధిని అదుపు చేయగల పవర్ జీలకర్రకు ఉంటుంది. ప్రతి ఫ్రైలో కచ్చితంగా దీనిని వాడతారు.
కొత్తిమీర: ఇది ఔషధ మొక్క . వింటర్ సీజన్‌లో ధర కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ కూడా లభిస్తాయి. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసం వాటి నుంచి ఉపశమనం ఇస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలతో తగ్గించడంతో పాటు.. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. నోట్లో అల్సర్లు, పగుళ్లు, దుర్వాసనతో బాధపడుతుంటే కొత్తిమీర ఆకులు నమలడం వల్ల అవి నయమవుతాయి
దాల్చిన చెక్క : వంటగదిలో అందరికీ అందుబాటులో ఉండే దాల్చిన చెక్కతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, మంటను తగ్గించే సామర్థ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. దాల్చిన చెక్క మెదడు పనితీరును అనేక విధాలుగా మెరుగుపరుస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది జ్ఞాపకశక్తి, శ్రద్ధను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి వంటి న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఏలకులు : మన ఇంటి వంటగదిలో ఆరోగ్యాన్ని ప్రోత్సహించే అనేక పదార్థాలు ఉన్నాయి. అందులో ఏలకులు ఒకటి. ఈ ఏలకులు ఆహారానికి మంచి సువాసన, రుచిని అందించడమే కాకుండా జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి. ఇందులో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇది ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. ఉదయాన్నే కాఫీ లేదా టీకి బదులుగా ఖాళీ కడుపుతో ఏలకుల నీటిని తాగడం వల్ల జీర్ణ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపించి... గొంతు బొంగురుపోవడం, గొంతు పొడిబారడం వంటి వాటి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గుండెల్లో మంట, అజీర్ణం నివారిస్తుంది.
అల్లం : దీనిని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల ఒకటి కాదు, వందల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిన్న అల్లం ముక్కలో కూడా ఎన్నో లాభాలున్నాయి. అల్లంలో యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి. ఇది అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సహజ నొప్పి నివారిణిగా, జ్వరాన్ని తగ్గించేదిగా పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు 2 కప్పుల నీటిలో ఒక అల్లం ముక్కను వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి వేడి వేడిగా తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇది ఎసిడిటీ సమస్యను కూడా తగ్గిస్తుంది.
మెంతులు: వీటి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఎ, సి, కె, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉండటం వల్ల, మెంతులు శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలను(Hair Growth) ప్రోత్సహిస్తాయి. అంతేకాక రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచి... కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెంతులు మంటను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
వెల్లుల్లి: తెలుగు వారి ఇళ్లల్లో వెల్లుల్లి వాడకం అధికమే. అల్లం వెల్లుల్లి జోడీ కలిస్తే ఏ కూరకైనా అదనపు రుచి వస్తుంది. దీనిలో విటమిన్ బీ6, విటమిన్ సి, మాంగనీస్, ఫైబర్, క్యాల్షియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. శరీరంలోని కొవ్వు కరిగించడంలో ఇది ముందు ఉంటుంది. అల్లం నుంచి అల్లిసిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది మన శరీరానికి అత్యవసరమైనది. ఇది ఒక అద్భుతమైన ఎంజైమ్. క్యాన్సర్‌ను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి దోహదం చేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఈ వెల్లుల్లి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.