తెలంగాణలో కొత్త పార్టీలకు చాన్స్?

రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్​ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనుకున్న కాంగ్రెస్​ ప్రజలకు అసంతృప్తినే మిగిల్చింది. బీజేపీ కూడా అనుకున్న స్థాయిలో బలం పుంజుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్​కు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీలు ఏర్పాటయ్యేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే షర్మిల కొత్త పార్టీ పెడతానని ప్రకటించగా.. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్​రెడ్డి కొత్త పార్టీలు పెడతారని ప్రచారం జరుగుతోంది.

ఉద్యమ కాలంలో, అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీఆర్ఎస్​ పార్టీ తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసింది. దీంతో అధికార పార్టీపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కరోనా సెకండ్​ వేవ్​ కారణంగా రాష్ట్రంలో జనం అల్లాడుతున్నారు. సరైన ట్రీట్​మెంట్​ అందక, హాస్పిటల్స్​లో బెడ్లు, ఆక్సిజన్ దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాక్సిన్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్న వాళ్లను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొడుకును సీఎం చేయడానికి అడ్డుగా ఉన్నడని ఈటల రాజేందర్ ను భూకబ్జా ఆరోపణలతో కేబినెట్​ నుంచి బర్తరఫ్ చేశారు. ఇక ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన భవిష్యత్​ కార్యాచరణ ఏమిటనే దానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఎలాంటి విధానాలతో ముందుకెళతారనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. 

పార్టీ పెడతానని ప్రకటించిన షర్మిల

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ రాజశేఖర్​రెడ్డి కూతురు వైఎస్​ షర్మిళ కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కార్యచరణను కూడా ఆమె ప్రారంభించారు. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇటీవల కాంగ్రెస్​ నుంచి బయటికి వచ్చిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా చెప్పారు. అంతే కాక అధికార పార్టీలో ఉన్న చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్​ నాయకుడు రేవంత్​రెడ్డి కూడా కొత్త పార్టీ పెడతారని ఎన్నాళ్ల నుంచో ప్రచారం సాగుతోంది. అయితే దానిపై ఆయన ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రాంతీయ పార్టీల అవసరాన్ని తెలియజేసేలా ఫలితాలు వెలువడ్డాయి. పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బీహార్​లో జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ, మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన, కర్ణాటకలో జేడీఎస్, తమిళనాడులో డీఎంకే , అన్నాడీఎంకే, ఆంధ్రప్రదేశ్​లో వైసీపీ, టీడీపీ, ఉత్తరప్రదేశ్​లో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్​ వాదీ పార్టీలు కీలకంగా ఉన్నాయి. అదే విధంగా రాష్ట్రంలో కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటైతే ప్రజలు ఆదరించే సూచనలు కనిపిస్తున్నాయి.

హామీల అమలులో టీఆర్ఎస్ ఫెయిల్

2014లో టీఆర్ఎస్​ ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పదవిని చేపట్టిన కేసీఆర్ మాట్లాడుతూ.. ఇకపై రాష్ట్రంలో అక్రమ అరెస్టులు, ఆకలి చావులు, నిరుద్యోగం ఉండవని, ఉద్యమాలు, పోరాటాలు చేసే అవసరం లేకుండా అన్ని వర్గాల వారికి పెద్ద పీట వేస్తామని చెప్పారు. కానీ, నేడు ఉమ్మడి రాష్ట్రంలో కంటే అధ్వానంగా స్వరాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి. స్టేట్ అడ్వయిజర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుందని, ఈ కమిటీలో జర్నలిస్టులు, విద్యావంతులు, మేధావులు ఉంటారని సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ, ఇప్పుడు ప్రశ్నించిన వారిపైనే కేసులను పెట్టి జైల్లో పెట్టిస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని దేశానికే తలమానికం చేస్తామని, రైతు రుణ మాఫీ చేస్తామని, తెలంగాణను విత్తనోత్పత్తి కేంద్రంగా మారుస్తామని చెప్పినా ఆ హామీలను నెరవేర్చలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు, అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం వంటి హామీలన్నీ మరిచిపోయింది. దళితులకు మూడెకరాల భూమి, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు, చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు, వక్స్ భూములను కాపాడటం గురించి ఆలోచనే లేదు. 

యువతను పట్టించుకుంటలేరు

విద్యారంగంలో సమూల మార్పులు తెస్తామని, ప్రతి ఒక్కరికీ కేజీ నుంచి పీజీ వరకు విద్యను ఉచితంగా అందిస్తామని, కొత్త యూనివర్సిటీలను నిర్మిస్తామని, ప్రతి ఆరు గ్రామాలకు ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, విమెన్స్​ కాలేజీల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రైవేట్, కార్పొరేట్​ కాలేజీలు, స్కూళ్ల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చేపడతామని చెప్పినా.. నెరవేర్చలేదు. రాష్ట్రంలో 11 రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, 3 సెంట్రల్​ వర్సిటీలు, 2 ఎన్ఐటీలు, ట్రిఫుల్ ఐటీలు, ఒక డీమ్డ్ వర్సిటీ ఉన్నాయి. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలో ఒక్క దానిలో కూడా వైస్ చాన్స్​లర్​ లేరు. అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. యూనివర్సిటీలను పట్టించుకోకపోవడంతో యూజీసీ నుంచి రావాల్సిన గ్రాంట్స్ నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

65 శాతం ఉన్న బీసీలకు తీవ్ర అన్యాయం

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది. రాష్ట్ర జనాభాలో 65% ఉన్న బీసీలకు ఎలాంటి ప్రత్యేక పథకాలు లేవు. వారి సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. ఉద్యమం కీలకపాత్ర పోషించిన బీసీ స్టూడెంట్లు, మేధావులకు ఎలాంటి సహాయం అందించలేదు. సబ్సిడీ రుణాలు ఇచ్చి తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడంలో విఫలమైంది. కుల వృత్తులకు సంబంధించి శిక్షణ, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్లకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయ్యింది. బీసీల జనాభా 65% ఉంటే, జనాభా ప్రాతిపదికన బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 65 ఉండాల్సినా 23 మంది మాత్రమే ఉన్నారు. 17 ఎంపీ సీట్లుంటే ఇందులో ఏడుగురు బీసీలు ఉండాల్సినా ముగ్గురే ఉన్నారు. బీసీలను తరతరాలుగా అణచివేతకు గురి చేస్తూ, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడేలా చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నత వర్గాల జనాభా 7.6%. వీళ్లలో 1.8% నుంచి 2.2% మాత్రమే నిరుపేదలు. 2% కూడా లేని ఉన్నత వర్గాలకు 10% రిజర్వేషన్లను కల్పించి 65% ఉన్న బీసీలకు 29% అందిస్తూ మరింత పేదరికంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.

4 వేలకుపైగా సర్పంచ్​ పదవులు కోల్పోయిన్రు

నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం, సామాజిక న్యాయం వంటి అంశాలతో ఏర్పడిన కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్​ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేసింది. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉంటే, ఇందులో బీసీలకు రావాల్సినవి దాదాపు7,500. కానీ టీఆర్ఎస్​ ప్రభుత్వ నిర్ణయం కారణంగా నేడు బీసీలకు 2,333 గ్రామ పంచాయతీలే లభిస్తున్నాయి. ప్రభుత్వ విధానం వల్ల దాదాపు 4 వేల సర్పంచ్​లు, 35 వేల వార్డు మెంబర్ల పదవులను బీసీ కులాలు కోల్పోతున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో బీసీల బడ్జెట్ 3.6% ఉంటే, దానిని టీఆర్ఎస్​ ప్రభుత్వం 1.8%కు తగ్గించింది. ఉమ్మడి రాష్ట్రంలో 36 మంది ముఖ్యమంత్రులు ఐతే.. ఒక్క బీసీ కూడా సీఎం కాలేదు. ఇక కేసీఆర్ కేబినెట్​లో నలుగురు బీసీ మంత్రులుంటే, ఎనిమిది మంది ఉన్నత వర్గాలకు చెందిన మంత్రులు ఉన్నారు. 

బీసీలకు రాజ్యాధికారం దక్కాలె

రాష్ట్రంలో 65% మంది బీసీలు ఉన్నా.. వారిని ప్రస్తుత రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తూ, రాజ్యాధికారం అందకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రాజకీయ పార్టీలను స్థాపించిన వాళ్లు, పార్టీలను నడిపించేవాళ్లు ఎక్కువ శాతం అగ్రకులాలవాళ్లే కావడంతో బీసీలను అధికారానికి దూరం చేసే ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో, ఇటు ప్రత్యేక తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు ఉన్నత వర్గాలకే పెద్ద పీట వేశాయి. బడుగు, బలహీన వర్గాలను మరీ ముఖ్యంగా బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయి తప్ప ఏ రోజు వీళ్లను పరిపాలనలో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేయలేదు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా మంది ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని నడిపించే బలమైన నాయకుడు లేకపోవడంతో అవి పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ఈ పార్టీలు కూడా ఇంతకు ముందు ఉన్న పార్టీలు అవలంభించిన విధానాలనే అలంభిస్తూ మళ్లీ ఉన్నత వర్గాలకు చెందిన నాయకులకే టికెట్లు ఇవ్వడం వంటి కారణాలతో అవి ఎక్కువ రోజులు నిలబడలేకపోయాయి. కొత్తగా ఏర్పాటు కాబోయే పార్టీలు రాష్ట్రంలో ఉన్న పార్టీల కంటే భిన్నంగా సామాజిక న్యాయం పాటిస్తూ అన్ని వర్గాల సమాన అవకాశాలు కల్పిస్తేనే వాటిని ప్రజలు ఆదరిస్తారు.