- కుర్చీ కాపాడుకునేందుకే జిమ్మికులు: ఈటల
- హరీశ్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నడు
జమ్మికుంట, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలతో సీఎం కేసీఆర్ నేలకు దిగుతారని బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మొన్న వచ్చిన సర్వేలో కేసీఆర్ చెత్త సీఎం అని తేలిందని, అందుకే కుర్చీ కాపాడుకునే ప్రయత్నాల్లో ఆయన బిజీగా ఉన్నారన్నారు. హరీశ్‌రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, గ్యాస్ సిలిండర్‌కి, ఈటలకి ఏం సంబంధమో చెప్పాలన్నారు. వడ్లు కొనాల్సిన మంత్రి ఇక్కడ మద్యం పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆబాది జమ్మికుంటలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉప ఎన్నిక ప్రచారంలో, బీసీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గొల్ల కురుమ, బుడిగ జంగాల మీటింగ్‌లో ఈటల మాట్లాడారు. గొల్లకుర్మలు నిజాయితీకి మారుపేరని, ఎవరి జోలికి పోరని, వాళ్లకు ఎవరైనా అన్యాయం చేస్తే చంపుతారని హెచ్చరించారు. తనతో పెట్టుకున్న కేసీఆర్ కథ కూడా ఖతం అయిపోతదన్నారు. ‘‘నేనెప్పుడూ సిద్ధాంతపరంగానే కొట్లాడాను.. కేసీఆర్‌ను, పార్టీనీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. పార్టీని చిక్కపరిచాను.. తప్ప చిక్కబడిన తర్వాత వచ్చి పదవులు అనుభవించలేదు” అని చెప్పారు.
అందుకే ప్రచారానికి వస్తలే
‘‘యువతకు కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేశారు. ఆయనను గద్దెదించడమే లక్షంగా పని చేయాలి. అందుకు బీజేపీని గెలిపించాలి’’ అని ప్రజలను ఈటల కోరారు. టీఆర్ఎస్ ఓడిపోతుందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే హుజూరాబాద్ మీటింగ్‌కు సీఎం రావడం లేదని, అందుకే ఏప్రిల్ 27న పెట్టాల్సిన ప్లీనరీని ఇప్పుడు పెట్టుకున్నారని విమర్శించారు. బిజీగా ఉన్నట్లు నటించడం కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి ఓటు వేస్తే కార్డులు, పెన్షన్లు, దళిత బంధు రావని భయపెడుతున్నారని, అవేవీ నమ్మవద్దన్నారు.
కేసీఆర్‌పై ఈటల కథ..
సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఒక కథ చెప్పారు. ‘‘చరిత్రలో మంచి రాజులు, చెడ్డ రాజుల గురించి స్టూడెంట్లు చదువుకుంటారు. అలా చూసినప్పుడు కేసీఆర్ఓ చెడ్డ రాజు. కేసీఆర్..హుజూరాబాద్ ఎన్నికల్లో రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టెను.. రూ.వంద కోట్ల మందు తాగించెను.. రూ.4,500 కోట్ల జీవోలు ఇచ్చెను.. అయినా మట్టి కరిచెను’’ అని నేటి చరిత్రను రేపటి తరం చదువుకోబోతోందని జోస్యం చెప్పారు.
ఈటలకు మద్దతివ్వండి: కేంద్ర మంత్రి నిత్యానందరాయ్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. అందరూ ఈటలకు మద్దతు పలికి గెలిపించాలని, ఇక్కడి ప్రజలకు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల ఖర్చు కోసం నిత్యానందరాయ్ రూ.10 వేలను ఈటలకు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ మాట్లాడుతూ.. ధర్మానికి ఓటు వేయాలని హరీశ్ చెబుతున్నారని, దాని అర్థం ఈటలకు ఓటేయమనేనన్నారు. ఓయూ జేఏసీ నేత సురేశ్ యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు గొల్లకుర్మల మీద నిజంగా ప్రేమ ఉంటే గోల్కొండ కోటను గొల్లకొండగా ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, తుల ఉమ, భిక్షపతి యాదవ్, యెండల లక్ష్మీనారాయణ, ధర్మారావు, సతీశ్ కుమార్, రవి యాదవ్, తిరుపతి యాదవ్, కొమ్ము అశోక్ కురుమ, సురేశ్ యాదవ్, పోలెబోయిన శ్రీనివాస యాదవ్, నరేశ్ యాదవ్, తుల అమర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల గుండెల్లో ఈటల: వివేక్ వెంకటస్వామి
మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. తాను ఇప్పుడే దళిత కాలనీకి వెళ్లి వస్తున్నానని, తమ అందరి గుండెల్లో ఈటల రాజేందర్ ఉన్నారని వారు చెప్పినట్లు తెలిపారు. ‘‘కేసీఆర్‌కు మాపై ప్రేమ లేదు. అందుకే మూడు ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇప్పుడు దళిత బంధు ఎగ్గొట్టారు” అని వారు అంటున్నారని చెప్పారు.