విశ్లేషణ: నేషనల్ లెవల్‌లో ఈటల ఎఫెక్ట్​

విశ్లేషణ: నేషనల్ లెవల్‌లో ఈటల ఎఫెక్ట్​

2021 జూన్ 12. సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్​ చాలాకాలం పాటు గుర్తుంచుకోవాల్సిన రోజు. తన అసెంబ్లీ సభ్యత్వానికి ఈటల రాజీనామా చేసింది ఆ రోజే. అప్పటి వరకూ కూడా కేసీఆర్, ఈటల మధ్య మళ్లీ సయోధ్య కుదిరే అవకాశాలు చాలా వచ్చాయి. కానీ, ఎమ్మెల్యే సభ్యత్వానికి ఈటల రాజీనామా చేయడంతో ఇక వెనకడుగు వేసే పరిస్థితులు లేకుండా పోయాయి. పార్లమెంటరీ వ్యవస్థలో కొన్నిసార్లు బై ఎలక్షన్స్​ క్లిష్టంగా మారతాయి. ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. హుజూరాబాద్​ ఎన్నికలో ఈటల గెలుపు తెలంగాణ రాజకీయాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యమంత్రి నుంచి తనను తాను కాపాడుకున్నాననే సంతృప్తి కూడా ఈటలకు ఈ విజయం అందించింది.

హుజూరాబాద్​లో ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులను తీసుకురావడం ద్వారా కేసీఆర్ తప్పటడుగు వేశారని చెప్పవచ్చు. ఈటలను కేసీఆర్ దూరం పెట్టకుండా ఉండాల్సింది. ఆయనను టీఆర్ఎస్​లోనే ఉండేలా ప్రయత్నాలు చేయాల్సింది. వాస్తవానికి, వీపీ సింగ్​ విషయంలో రాజీవ్​గాంధీ కూడా ఇలాంటి పొరపాటే చేశారు. 1984లో రాజీవ్​గాంధీ 400కుపైగా ఎంపీ సీట్లను గెలుచుకున్నారు. కానీ, 1987 నాటికి చెడు సలహాలు, పేలవమైన పాలన, భజనపరుల మాటలు విని సీనియర్ మంత్రిగా ఉన్న వీపీ సింగ్​ను పార్టీ నుంచి బహిష్కరించారు. వీపీ సింగ్​ను బయటకు పంపితే ఆయన పని అయిపోయినట్టే అని భజనపరులు రాజీవ్​గాంధీకి చెప్పారు. కానీ, దానికి విరుద్ధంగా జరిగింది. ప్రతిపక్షాన్ని నడిపించే స్థాయికి చేరుకున్న వీపీ సింగ్​ 1989 ఎన్నికల్లో రాజీవ్​గాంధీని ఓడించి.. ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఈటల ముఖ్యమంత్రి అవుతారో? లేదో? మనం ఇప్పుడే అంచనా వేయలేం. కానీ, కేసీఆర్​ను తీవ్రమైన దెబ్బ తీశారు ఈటల. అయితే ఈటలతో వ్యవహరించిన తీరు అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితులను ఎలా మార్చుకోకూడదనే విషయంలో కేసీఆర్​కు ఒక విధంగా పాఠం లాంటిది. పవర్​లో ఉన్నప్పుడు కొంత సాఫ్ట్​గా నడుచుకోవాలి. మొత్తంగా చూస్తే ఈటల విజయం కేసీఆర్, తెలంగాణ రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాలనూ ప్రభావితం చేస్తుంది.

తెలంగాణ రాజకీయాలపై ప్రభావం

  • ఇది కేసీఆర్​కు అతిపెద్ద ఎదురుదెబ్బ. 2014 నుంచి తెలంగాణ రాజకీయాలను కేసీఆర్​ డామినేట్​ చేస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తి ఉంది. అయితే కేసీఆర్​కు ప్రజాకర్షణ ఉందని, ఎన్నికల్లో తమను సులువుగా ఓడిస్తారనే భయం అసంతృప్త నాయకుల్లో ఉండటంతో ఆయన ఈ అడ్డంకులను ఇన్నాళ్లూ దాటుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఆ భయం పోయింది. తమ నాయకుడు బలవంతుడని నమ్మినన్నాళ్లూ రాజకీయ నాయకులు రెబెల్​గా మారరు. కానీ, ఈటల గెలుపుతో ఇకపై రోజూ కేసీఆర్​కు సవాళ్లు ఎదురుకాక తప్పదు. వందల కోట్లు ఖర్చుపెట్టి టీఆర్ఎస్​కు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ చేదు ఎన్నికలు కేసీఆర్‌‌ను ఓడించగలమన్న సందేశాన్ని ఇచ్చాయి.
  • ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మారింది. ప్రస్తుతం కేసీఆర్, బీజేపీ మధ్యే పోరాటం జరుగుతున్నట్టు స్పష్టం అవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రజాకర్షణ కలిగిన, అన్ని వనరులు ఉన్న నాయకులను బీజేపీ ఆకర్షించే అవకాశం ఉంది. టీఆర్ఎస్​లో ఉన్న చాలా మంది నెమ్మదిగా బీజేపీలో చేరే అవకాశాలను కొట్టిపారేయలేం. ప్రస్తుతం బీజేపీ ప్రజల నమ్మకాన్ని పొంది బలమైన శక్తిగా ఎదుగుతోంది.
  • 2014 నుంచి టీఆర్ఎస్​ అధికారంలో ఉంది. ఒక ప్రాంతీయ పార్టీగా, డీఎంకే, అన్నాడీఎంకే మాదిరిగానే టీఆర్ఎస్​ కూడా తన ఓట్​ షేర్​ను కోల్పోతోంది. తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు చిన్న పార్టీలతో జట్టుకట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, తెలంగాణలో అసలు చిన్న పార్టీలే లేవు. అందువల్ల ఇక్కడ కేసీఆర్, బీజేపీ మధ్య నేరుగా పోరు జరుగుతోంది. అయితే కాంగ్రెస్​తో కేసీఆర్​ దోస్తీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేం. 
  • కేసీఆర్​ ఇప్పటికే ఇతర పార్టీల నుంచి సీనియర్​ లీడర్లను టీఆర్ఎస్​లో చేర్చుకున్నారు. అయితే వారిని పార్టీలో చేర్చుకున్న తర్వాత, వారు పని చేసేందుకు, ఎదిగేందుకు కేసీఆర్​ అవకాశం ఇవ్వలేదు. ఇతర పార్టీల్లోని బలమైన నాయకులను తన పార్టీలోకి తీసుకుని, ఆ తర్వాత వారిని ఉత్సవ విగ్రహాలుగా కేసీఆర్ మార్చేశారు. వారు బయటకు మంచిగానే కనిపిస్తున్నా.. ఎలాంటి పని చేయడానికి లేదు. వీరికి కేసీఆర్​ ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వనట్లయితే వీరంతా టీఆర్ఎస్​ను వీడి బయటకు వచ్చేస్తారు.
  • తెలంగాణ కాంగ్రెస్, రేవంత్​రెడ్డి ఇప్పుడు చాలా ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఎందుకింత దారుణంగా ఓడిపోయింది? బీజేపీని ఓడించేందుకు తమ ఓట్లను బదిలీ చేశామని చెప్పుకుంటే సరిపోదు. కాంగ్రెస్ ఈ ఘోర పరాజయాన్ని తట్టుకోవాలంటే ఇంకా మంచి సమాధానాలు కావాలి.

జాతీయ రాజకీయాలపై ఎఫెక్ట్

  • దేశవ్యాప్తంగా జరిగిన 27 ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. అయితే బీజేపీ వరకూ గుడ్​ న్యూస్​ ఏమిటంటే.. తెలంగాణలో బీజేపీ గెలుపే. ఎందుకంటే ఇక్కడ బీజేపీ సీఎం కేసీఆర్​ను ఓడించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే పార్టీగా ఎదిగింది.
  • చాలా ఏండ్లుగా, దక్షిణాదిలో కర్నాటక కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ విస్తరించాలని బీజేపీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులో ఆ పార్టీ జీరో. ఇప్పుడు ఈటల గెలుపు ద్వారా బీజేపీ తెలంగాణపై ఫోకస్​ చేయడానికి వీలు కలిగింది. ఇక్కడ అధికారంలోకి రావడానికి దారులు ఏర్పడ్డాయి. 
  • 2024 నాటికి, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి పదేండ్లు కావస్తుంది. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అందువల్ల దానిని దాటాలంటే కొత్త రాష్ట్రాల్లో విజయం సాధించాలి. దానికి తెలంగాణ గొప్ప అవకాశంగా మారింది. నార్త్, ఈస్ట్, వెస్ట్​ లో బీజేపీ మాగ్జిమం సక్సెస్​ అయ్యింది. 2024లో 140 ఎంపీ సీట్లు ఉన్న సౌత్​ మాత్రమే వారికి ఉన్న చాన్స్.

అతి ప్రాధాన్యతతోనే..

ఒక్క హుజూరాబాద్​ విజయంతో ఏమీ మారిపోదని కూడా భావించొచ్చు. కేసీఆర్ తన పాలన గతిని మార్చుకుని, మళ్లీ ప్రజల మనసులు గెలుచుకోవచ్చని కూడా అనుకోవచ్చు. అయితే కేసీఆర్​ చేసిన పొరపాటు ఏమిటంటే.. హుజూరాబాద్​ ఎన్నికకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే. అక్కడ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా టీఆర్ఎస్​ ఓటమిపాలైంది. ఇక్కడ కేసీఆర్​ తాను గెలవలేనని సందేశం ఇచ్చినట్లయ్యింది. కొన్ని పొరపాట్లను ఎప్పటికీ సరిదిద్దుకోలేం. హుజూరాబాద్​ అలాంటి పొరపాట్లలో ఒకటా అనేది ఇప్పుడే మనం చెప్పలేం. గొప్ప అధిపతులు ఎలాంటి పోరాటం చేయకుండానే యుద్ధాలు గెలుస్తారు. ఇకపై కేసీఆర్​ ఉప ఎన్నికలకు తొందర పడకపోవచ్చు. తన పార్టీ నాయకులతో నిర్లక్ష్యంగా వ్యవహరించకపోవచ్చు.

కేసీఆర్ మారినా.. మారకపోయినా సవాలే

ఇప్పుడు తెలంగాణలో ఎదిగేందుకు బీజేపీకి గొప్ప అవకాశం వచ్చింది. ప్రస్తుతం కేసీఆర్​ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవేళ కేసీఆర్​ ఎక్కువగా మారితే.. ప్రజలంతా ఆయన భయపడుతున్నారని అంచనా వేస్తారు. అదే కేసీఆర్​లో ఎలాంటి మార్పూ కనిపించనట్లయితే జనంలో మరింత అసంతృప్తి వ్యక్తమవుతుంది. అందువల్ల ప్రస్తుతం కేసీఆర్ నిజమైన సవాల్​ను ఎదుర్కోనున్నారు. తెలంగాణను గెలిచిన వ్యక్తి ఇప్పుడు తనకు తానుగా తెలంగాణను కోల్పోవచ్చు. మరి కేసీఆర్ తనకు తానుగా చేసుకున్న నష్టాన్ని ఎంత వరకు సరిదిద్దుకుంటారో చూద్దాం.

- పెంటపాటి 
పుల్లారావు, 
పొలిటికల్​ ఎనలిస్ట్