ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. వైరస్ ఇంకా కనుమరుగు కాకముందే మళ్లీ మరో ప్రాణాంతక వైరస్ విజృంభిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా పంజా విసురుతోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికా ఖండంలో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ సీ)లో ఎబోలా వ్యాప్తి మళ్లీ మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఆ దేశంలోని ఈశాన్య ప్రాంతమైన ఈక్వెటర్ ప్రావిన్స్ లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసు నమోదైనట్లు పేర్కొంది. ఈ ప్రావిన్స్ లో 2018 నుంచి ఎబోలా స్థానికంగా వ్యాప్తి చెందడం ఇది మూడోసారి. ఈ దేశంలో 1976 నుంచి 14 సార్లు ఎబోలా వ్యాపించింది.
ఇప్పటి వరకు ఒక కేసును ఎబోలాగా అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఏప్రిల్ 5వ తేదీన ఎబోలా లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత ఏప్రిల్ 21న ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేర్చించారు. కానీ, ఒక రోజు తర్వాత అతడు చనిపోయాడు. వైద్య సిబ్బందిలోనూ ఎబోలా లక్షణాలు కనిపించడంతో వెంటనే వారు పరీక్షల కోసం శాంపిల్స్ పంపించారు. ఇక ఎబోలాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలను సాంప్రదాయం ప్రకారం నిర్వహించినట్లు డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది.
ప్రస్తుతం ఈ వ్యాధిని అరికట్టేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే వ్యాక్సినేషన్ ను మొదలు పెట్టనున్నారు. మబండకా పట్టణంలో 2020లోనే చాలామంది ఎబోలా టీకాలు తీసుకున్నారు. దీంతో ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని డబ్ల్యూహెచ్ ఓ సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
మరిన్ని వార్తల కోసం..