ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై ఎటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 7వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్వినీ కుమార్ ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎవ్వరూ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించకూడదని, ఎగ్జిట్ పోల్ సర్వేలను ప్రసారం గానీ, ప్రచారం గానీ చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. తమ ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు కలిపి విధించనున్నట్లు శుక్లా తెలిపారు.
In a notification, the Election Commission of India said, "No person shall conduct any exit poll and publish or publicize by means of print or any other manner, the result of any exit poll." pic.twitter.com/omMfYb7kWV
— ANI (@ANI) January 29, 2022
ఐదు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి మొదలు మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే బహిరంగ సభలు, రోడ్ షోలు, గ్రూప్ గ్యాదరింగ్స్‌పై ఈసీ నిషేధం విధించింది. ఐదుగురికి మించి ఎక్కువ మంది ఇంటింటి ప్రచారానికి కూడా వెళ్లడానికి లేదని ఆదేశించింది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహణపై ఈసీ బ్యాన్ విధించింది. అయితే ఎగ్జిట్ పోల్స్ బ్యాన్ కరోనా కారణంగా కాక.. ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండడం కోసం తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది.